నాన్నా! నన్ను క్షమించు!!

23 Jul, 2014 01:04 IST|Sakshi
నాన్నా! నన్ను క్షమించు!!

అంతర వీక్షణం!
 
యండమూరి వీరేంద్రనాథ్ పరిచయం అక్కర్లేని ప్రముఖులు. నవలా రచయితగా తెలుగు పాఠకులను అక్షర నీహారికతో గిలిగింతలు పెట్టిన రచయిత. ఆయన వ్యక్తిత్వాన్ని, జీవితానుభవాన్ని క్లుప్తంగా తెలియచేసే ప్రయత్నమే ఈ అంతరవీక్షణం.


మీ గురించి మీరు ఒక్కమాటలో...    
 నా కృషే నా బలం. పెద్దగా తెలివితేటలు లేకపోయినా కృషితో ఎదిగాను.
మీలో మీకు నచ్చే లక్షణం, అలాగే నచ్చని లక్షణం...
నచ్చే లక్షణం... అనుకున్న పని పూర్తి చేయడానికి అవసరమైనంత కష్టపడడం, రాజీ పడకపోవడం. నచ్చని లక్షణం... ప్రపంచం పట్ల చిరాకు.
ఎదుటి వారిని చూసే దృష్టి కోణం ఎలా ఉంటుంది ?
వీరికి జీవితం పట్ల ప్రేమ (జీవితేచ్ఛ) ఉందా లేదా అని చూస్తాను.
ఎలాంటి వ్యక్తులను ఇష్టపడతారు ?
చేస్తున్న పని, ఉద్యోగాన్ని... సిన్సియర్‌గా చేసేవారిని.
మీరు సృష్టించి మలిచిన పాత్రల్లో ఏ పాత్ర అంటే ఎక్కువ ఇష్టం?
ఆనందోబ్రహ్మ నవలలో మందాకిని పాత్ర.
ఎక్కడ స్థిరపడాలనుకున్నారు? ఎక్కడ స్థిరపడ్డారు? (రంగం, ప్రదేశం)
ఉద్యోగం వస్తే చాలనుకున్నాను, రచయితనయ్యాను. ఇక ప్రదేశం విషయానికి వస్తే ఇప్పుడు కాకినాడలో స్థిరపడితే బావుణ్ణనిపిస్తోంది.
మీరు ఎక్కువగా ఇష్టపడే వ్యక్తి ఎవరు ?
తండ్రి, అలాగే నన్ను అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి కూడా ఆయనే.
మిమ్మల్ని కెరీర్ దిశగా ప్రభావితం చేసిన సందర్భం, సంఘటన...
ఎం.కామ్ చదవడానికి డబ్బుల్లేక సి.ఎలో చేరడం.
తొలి సంపాదన ?
ఏడవ తరగతిలో... ట్యూషన్ చెప్పడం ద్వారా.
పెద్ద మొత్తం అందుకున్న సందర్భం?
బెంగళూరులో ఒక గంట ప్రసంగానికి జిఎమ్‌ఆర్ (గ్రంథి మల్లికార్జునరావు) లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. అది నేను ఊహించని మొత్తం.
మిమ్మల్ని అత్యంత బాధ పెట్టే విషయాలు?
అర్థంపర్థం లేని విమర్శలు. విమర్శ ఎప్పుడూ కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి.
అలా చేసి ఉండాల్సింది కాదని పదే పదే అనుకున్న సందర్భం...
నాన్న చివరి రోజుల్లో ఆయన దగ్గర గడిపి ఉంటే బావుండేదని చాలాసార్లు అనిపిస్తుంటుంది.
మీరు ఎవరికైనా క్షమాపణ చెప్పుకోవాల్సి ఉందా?
మా నాన్నకే.
‘నా నుంచి సహాయం పొంది నాకే ద్రోహం చేశార’నే ఆరోపణ ఉందా?
ఒక మంచి స్నేహితుడు డబ్బు అప్పుగా తీసుకుని ముఖం చాటేశాడు. అతడు డబ్బు ఇవ్వలేనని చెప్పినా ఇంత బాధపడేవాడిని కాదేమో.
భాగస్వామికి తగినంత సమయం కేటాయిస్తున్నానని అనుకుంటున్నారా?
లేదు. చాలా అన్యాయమే చేశాననిపిస్తుంటుంది. జీవితంలో అట్టడుగు నుంచి పెకైదిగిన వారందరి పరిస్థితి ఇలాగే ఉంటుందనుకుంటాను.
జీవితంలో ఆనందపడిన క్షణాలు...
చిన్న విషయానికే ఆనందపడిపోతాను. ఒక మంచి వాక్యం రాస్తే ఆ రోజంతా సంతోషంగా ఉంటాను. వంట బాగా కుదిరినప్పుడు కూడా.
మిమ్మల్ని భయపెట్టే విషయాలేంటి?
నన్ను ఏ విషయమూ భయపెట్టదు. భవబంధాలకు అతీతుణ్ని.
ఒక్క రోజు మిగిలి ఉంటే ఏం చేస్తారు? ఆ రోజును ఎలా గడుపుతారు?
ఆర్థిక విషయాలను, అసంపూర్తిగా ఉన్న స్క్రిప్టును పరిష్కరిస్తాను.
ఎప్పుడైనా అబద్ధం చెప్పారా?
చాలాసార్లు. ఎక్కువ అబద్ధాలు మా ఆవిడ అనుగీతతోనే. ఆమె సంతోషించే చిన్న అబద్ధాలనే చెప్తాను. నా ప్రయోజనం కోసం కాదు.
దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటారు?
నేనసలు దేవుడినే నమ్మను.
అద్దంలో చూసుకున్నప్పుడు ఏమనుకుంటారు?
గుడ్... వృద్ధాప్యం రాలేదు. ఇంకా ఎన్ని ప్రోగ్రామ్‌లైనా చేయవచ్చు.
సమాజానికి ఏం చెప్తారు?
రేపటి మరింత ఆనందం కోసం ఈ రోజు బాగా పని చేయాలి.

 - వాకా మంజులారెడ్డి

మరిన్ని వార్తలు