తల్లి హక్కు

13 Sep, 2019 00:17 IST|Sakshi

చెట్టు నీడ

ఆ తల్లి ‘క్షమించాను’ అన్న మరుక్షణమే ఆ వ్యక్తి ఆత్మ అతని నుండి వేరైపోయింది
ఒకసారి ప్రవక్త ముహమ్మద్‌ (స) వద్దకు ఒక సహచరుడు పరిగెత్తుకుంటూ వచ్చి, ‘‘అయ్యా! ఫలానా వ్యక్తి ఉదయం నుండి సక్రాత్‌ స్థితిలో.. అంటే చివరి ఘడియల్లో.. నరకయాతన అనుభవిస్తున్నాడు’’ అని తెలిపాడు.ప్రవక్త (స) ఆ వ్యక్తి వద్దకు వచ్చి, ‘‘ఇతను ఎవరికైనా ఋణ పడి ఉన్నాడా?’’ అని వాకబు చేసారు. అలాంటిదేమీ లేదు అని తెలిసింది. ‘‘మరి ఎవరైనా ఆయనంటే అయిష్టంగా ఉన్నారా?’’ అని అడిగారు. అక్కడ ఉన్న వారు ‘‘ఇతని తల్లి ఇతనంటే కాస్త అయిష్టతగా ఉంది’’ అని తెలిపారు.ప్రవక్త (స) తల్లిని పిలిచి ఆమె కుమారుడ్ని  క్షమించవలసిందిగా కోరారు. కాని ఆమె ఎంతకూ వినకపోవడంతో, సహచరులను కట్టెలు పోగేసి మంట రాజేసి అతనిని అందులో వెయ్యమని ఆజ్ఞాపించారు.అప్పుడు ఆ తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ తన కొడుకును అగ్నిలో వెయ్యొద్దని ప్రాధేయపడింది.

‘‘చూడు తల్లీ, ఇక్కడ నీ కుమారుడిని మంటల్లో వేయడాన్ని భరించలేక పోతున్నావే, రేపు పరలోకం శాశ్వతంగా నరకాగ్నిలో కాల్చబడటం నీకు ఇష్టమేనా’’ అని అడిగారు ప్రవక్త (స).‘‘లేదు ప్రవక్త (స), లేదు. నేనే కాదు ఏ తల్లి కూడా భరించలేదు. అల్లాహ్‌ కరుణ కోసం నేను నా కుమారుడ్ని క్షమిస్తున్నాను’’ అని అంది. ఆ తల్లి ‘క్షమించాను’ అన్న మరుక్షణమే ఆ వ్యక్తి ఆత్మ అతని నుండి వేరైపోయింది.‘‘ఈ జీవితం శాశ్వతమైన మరణానంతర పరలోక జీవితానికి ఒక పరీక్ష. ఇక్కడ దైవం హక్కులలో లోటు జరిగినా దైవం క్షమిస్తాడు కానీ సాటి మనుషుల హక్కులలో చిన్న లోపం జరిగినా వారు క్షమించనంత వరకు అల్లాహ్‌ కూడా క్షమించడు’’ అని ప్రవక్త (స) తెలిపారు.ముఖ్యంగా తల్లితండ్రుల హక్కులు. అందునా తల్లి హక్కు. అందుకే ప్రవక్త (స) ఇలా సెలవిచ్చారు. ‘తల్లి పాదాల చెంత స్వర్గం ఉంది’ అని.       కన్నవారి కంట కన్నీరు మన సకల అనర్ధాలకు మూలం అని గ్రహించి వారి సేవలో తరిద్దాం. ఇహ పరాల్లో సాఫల్యం పొందుదాం.
– షేక్‌ అబ్దుల్‌ బాసిత్‌

మరిన్ని వార్తలు