ఉప్పుతో ప్రాణాలకు ముప్పే...

25 Jun, 2018 01:13 IST|Sakshi

ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే రక్తపోటు వంటి సమస్యలు వస్తాయని మనకు చాలాకాలంగా తెలుసు. అయితే తాజా అధ్యయనాల ప్రకారం సమస్య రక్తపోటుకు మాత్రమే పరిమితం కావడం లేదు. గుండెజబ్బులు.. చివరకు మరణానికి కూడా అధిక మోతాదులో వాడే సోడియం (ఉప్పులో ఉండేది సోడియం క్లోరైడ్‌) కారణమవుతున్నట్లు బ్రిగామ్‌ అండ్‌ విమన్స్‌ హాస్పిటల్‌ శాస్త్రవేత్తలు అంటున్నారు. శరీరం లోపలకు వెళ్లే సోడియం మోతాదును లెక్కకట్టడం కష్టమైన నేపథ్యంలో తాము విసర్జితాలను సేకరించి పరీక్షలు జరిపామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ నాన్సీ కుక్‌ తెలిపారు.

రక్తపోటు నివారణ కోసం చేపట్టిన ఒక ప్రయోగంలో పాల్గొన్న మూడు వేల మంది నుంచి తాము మూత్ర నమూనాలు సేకరించామని, రోజులో వేర్వేరు సమయాలు కొన్ని రోజులపాటు సేకరించి పరీక్షలు జరిపినప్పుడు సోడియం ఎక్కువైన కొద్దీ... మరణానికి కారణం కాగల సమస్యలు ఎక్కువ అవుతున్నట్లు తెలిసిందని.. అలాగని అతితక్కువ సోడియం తీసుకోవడమూ ప్రమాదకరమేనని తాము జరిపిన కవాసాకీ ఫార్ములా లెక్కలు చెబుతున్నాయని నాన్సీ వివరించారు. 

మరిన్ని వార్తలు