పిజ్జా, బర్గర్‌లు మాత్రమే తింటున్నాడు..!

11 Apr, 2017 00:30 IST|Sakshi
పిజ్జా, బర్గర్‌లు మాత్రమే తింటున్నాడు..!

మా బాబు వయసు పన్నెండేళ్లు. ఇటీవల వాడు పిజ్జా, బర్గర్‌లను మాత్రమే ఇష్టపడుతున్నాడు. వాడి బరువు క్రమంగా పెరగడంతో పాటు ఊబకాయంతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు. వాడి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి.
– నవీన, రాజమండ్రి

పిల్లలు టీవీలు, కంప్యూటర్ల ముందు ఎక్కువ సమయం గడుపుతున్నారు. వ్యాయామాలు, ఆటల వంటి కార్యకలాపాలపై ఎక్కువ సమయం వెచ్చించడం లేదు. కౌమార బాలబాలికలు ఆహార నియమాలు సరిగా పాటించకపోగా... అనారోగ్యకరమైనవీ, పోషకాలు సరిగా లేనివి అయిన ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్‌డ్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకుంటున్నారు.

దాంతో ఒబేసిటీ, ఆస్తమా వంటి శారీరక రుగ్మతలతోపాటు వాళ్ల వికాసం, మానసిక ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతోంది. గతంతో పోలిస్తే దాదాపు రెట్టింపుకంటే ఎక్కువగా పిల్లలు దీర్ఘకాలికమైన వ్యాధుల బారిన పడుతున్నట్లు కొన్ని అధ్యయనాల్లో తేలింది.

ఇలా పోషకాహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం వల్ల పిల్లలు భవిష్యత్తులో స్థూలకాయం, హైబీపీ, హైకొలెస్ట్రాల్, టైప్‌–2 డయాబెటిస్‌ బారిన పడుతున్నారు. మంచి ఆహారం తీసుకోవడంతో పాటు వాళ్లు చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలు తీసుకోకపోవడం వల్ల పిల్లలను పైన పేర్కొన్న లైఫ్‌సై్టల్‌ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. మీరు మీ పిల్లలకు ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు ఎక్కువగా తినేలా చూడండి. తాజా పండ్లు ఎక్కువగా అందేలా జాగ్రత్తలు తీసుకోండి.

 బయటకు వెళ్లి ఆటలు ఎక్కువ ఆడేలా ప్రోత్సహించండి. టెలివిజన్, కంప్యూటర్, మొబైల్, ఐపాడ్‌ వంటి వాటితో ఎక్కువగా ఆడనివ్వకండి. రోజూ ఉదయం మంచి బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకునేలా చూడండి. బేకరీ ఐటమ్స్, ప్రాసెస్‌డ్‌ ఫుడ్స్, చక్కెరపాళ్లు ఎక్కువగా ఉండే పానీయాలను చాలా పరిమితంగా అందేలా చూడండి. ఇవి మీ బాబు విషయంలో తప్పక అనుసరించాల్సిన జాగ్రత్తలు. వాటిని తప్పక పాటించండి.

ఇటీవల ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి మీడియా ద్వారా డాక్టర్ల నుంచి ప్రజలకు ఎన్నో సూచనలు అందుతూనే ఉన్నాయి. కానీ ఇంకా చాలామంది అంత ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవడం, వ్యాయామాలు చేయడం వంటి ఆరోగ్య నియమాలను పాటించడం లేదు. ఇది పిల్లల మీద, వాళ్ల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు