వెలుగులు చిమ్మే మొక్కలు

15 Dec, 2017 00:05 IST|Sakshi

పరి పరిశోధన

రాత్రయితే చాలు.. బల్బు వెలిగించేందుకు సిద్ధమైపోతాం మనమందరం. బదులుగా చీకటి పడుతూండగానే.. ఇళ్లల్లో ఉన్న మొక్కలే వెలుగు దీపాలైతే? ఆహా.. అద్భుతంగా ఉంటుంది కదూ.. మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు అచ్చంగా ఇలాంటి మొక్కలనే సృష్టించారు. వాటర్‌క్రెస్‌ అని పిలిచే ఒక రకమైన మొక్కల్లోకి నానో స్థాయి కణాలను చొప్పించి అవి చీకట్లో దాదాపు నాలుగు గంటల పాటు వెలుగులు చిమ్మేలా చేశారు. ఇంకొంచెం మెరుగులు దిద్దితే ఈ మొక్కలతో మరింత ఎక్కువ కాలం, ఎక్కువ ప్రకాశాన్ని సాధించవచ్చునని అంటున్నారు ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త మైకేల్‌ స్ట్రానో. భవిష్యత్తులో ఇలాంటి మొక్కలు, చెట్లు... వీధి దీపాలుగానూ వాడుకోవచ్చునని అంచనా. స్ట్రానో నేతృత్వంలో శాస్త్రవేత్తలు చాలాకాలంగా నానో టెక్నాలజీ సాయంతో మొక్కలకు విభిన్న లక్షణాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఈ క్రమంలోనే వారు మిణుగురుల్లో వెలుగులకు కారణమైన లూసిఫెరన్‌ కణాలను పది నానో మీటర్ల సైజుండే సిలికా కణాలతో కలిపి మొక్కల ఆకుల్లోకి జొప్పించారు. ఆకులపై ఉండే స్టొమాటా (సూక్ష్మస్థాయి రంధ్రాలు) ద్వారా లోనికి ప్రవేశించిన లుసిఫెరన్‌ కణాలు ఒకచోట గుమికూడాయి. ఆ తరువాత అక్కడ జరిగే రసాయన చర్య కారణంగా మొక్క కూడా వెలుగులు చిమ్ముతుందన్నమాట. దాదాపు పది సెంటీమీటర్ల పొడవైన వాటర్‌క్రెస్‌ మొక్క ద్వారా వచ్చే వెలుగు కొంచెం తక్కువే ఉన్నప్పటికీ భవిష్యత్తులో దీన్ని మెరుగుపరచవచ్చునని శాస్త్రవేత్తలు అంటున్నారు. వెలుతురు ఇచ్చే మొక్కలను అభివృద్ధి చేసేందుకు గతంలోనూ కొన్ని ప్రయత్నాలు జరిగినా, అవన్నీ జన్యుమార్పిడి టెక్నాలజీపై ఆధారపడటం గమనార్హం.

మరిన్ని వార్తలు