పీసీతో ఇలా... చకచకా!

25 Jun, 2014 22:49 IST|Sakshi
పీసీతో ఇలా... చకచకా!

ఇంట్లో ఓ పీసీ, దానికో ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మనం చేయలేని పనంటూ లేదంటే అతిశయోక్తి కాదు. ఈమెయిళ్లు, చాటింగ్‌లు, ఆఫీసు పనులను పక్కనబెడితే... ఏ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోకుండా కూడా ఎన్నో సరదా, సీరియస్ పనులను చక్కబెట్టుకోవచ్చు. కేవలం గూగుల్ క్రోమ్, ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వంటి బ్రౌజర్లతో మాత్రమే ఎలాంటి విషయాలు తెలుసుకోవచ్చు... ఏయే పనులు చేయవచ్చో మచ్చుకు చూద్దామా....
 
జీమెయిల్ కోసం రెండు ఆప్స్...

జీమెయిల్‌లో మెసేజ్ టైప్ చేసి... మెయిల్ ఫలానా టైమ్‌కు, ఫలానా వారికి పంపితే బాగుండు అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే బూమరాంగ్ మీకోసమే. www.boomeranggmail.com/వెబ్‌సైట్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు. మీ మెయిళ్లను మీరు అనుకున్న సమయానికి పంపేందుకు వీలు ఏర్పడుతుంది. అయితే ఇది పూర్తిగా ఫ్రీ సర్వీస్ కాకపోవడం గుర్తుంచుకోవాలి. బేసిక్ అకౌంట్ ద్వారా నెలకు 10 మెయిళ్లను ఉచితంగా షెడ్యూల్ చేసి పంపవచ్చు. అంతకంటే ఎక్కువ మెయిళ్లను పంపాల్సిన  పరిస్థితి ఉంటే మాత్రం సర్వీసులకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీకు ఒకటికంటే ఎక్కువ జీమెయిల్ అకౌంట్స్ ఉంటే... వాటిని ఒకేచోట చూసుకునేందుకు వీలు కల్పిస్తుంది చెకర్ ప్లస్ ఫర్ జీమెయిల్. క్రోమ్ వెబ్‌స్టోర్ ద్వారా లభించే ఈ ఎక్స్‌టెన్షన్‌లో ఒక డ్రాప్‌డౌన్ మెనూ ఉంటుంది. దాంట్లో మీరు రిజిస్టర్ చేసుకున్న జీమెయిల్ అకౌంట్లలో చదవని మెయిళ్లు, వాటి ప్రివ్యూలు కనిపిస్తూంటాయి.
 
ఫొటోలకు రంగులు అద్దండి...

స్మార్ట్‌ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఫోటోలు తీయడం బాగా పెరిగిపోయింది. అయితే ఈ ఫొటోలకు సరదాగా రంగులద్దాలనుకుంటే? లేదా స్పెషల్ ఎఫెక్ట్స్ జోడించాలను కుంటే సైకోపెయింట్ అవకాశం కల్పిస్తుంది. రకరకాల పెయింట్ శైలుల నుంచి ఆన్‌లైన్‌లోనే మీ ఫోటోలకు రంగులు అద్దవచ్చు. లేదంటే సిద్ధంగా ఉన్న కొన్ని టూల్స్‌ను వాడుకోవచ్చు కూడా. మీకు పెయింటింగ్‌తో పరిచయముంటే కొత్తకొత్త డిజిటల్ కళాఖండాలను తయారు చేసేందుకు ఈ వెబ్‌సైట్‌లో బోలెడు రకాల బ్రష్‌లు, పెయింట్ ఎఫెక్ట్‌లు ఇచ్చే ఫిల్టర్లు అందుబాటులో ఉన్నాయి. మరిన్ని వివరాల కోసం psykopaint.comవెబ్‌సైట్ చూడండి. ఐఫోన్ అప్లికేషన్‌గానూ సైకోపెయింట్ లభిస్తోంది.
 
ఫోటోల ఎడిటింగ్...

ఫోటోలకు పెయింట్ లక్షణాలను చేర్చేందుకు సైకోపెయింట్ ఉపయోగపడితే... సైజును సరిచేయడం, రంగులు నియంత్రించడం, వెలుతురును అడ్జస్ట్ చేయడం వంటి పనులకు పిక్స్‌లర్ దారి చూపుతుంది. పూర్తిస్థాయి ఫొటో ఎడిటింగ్ కోసం పిక్స్‌లర్ ఎడిటర్, ఎఫెక్ట్‌లను చేర్చేందుకు పిక్స్‌లర్ ఓ మాటిక్, వేగంగా కొన్ని అంశాలను మాత్రమే సరిచేయాలనుకుంటే పిక్స్‌లర్ ఎక్స్‌ప్రెస్.. ఇలా మూడు లేయర్లలో ఈ వెబ్‌సైట్ సేవలు పనిచేస్తాయి. ఒక్కో లేయర్‌లో ఫొటోల నాణ్యతను పెంచేందుకు కొన్ని టూల్స్ ఏర్పాటు చేశారు. ఎడిటింగ్ మొత్తం పూర్తయ్యాక మీ ఫోటోలను మళ్లీ కంప్యూటర్‌పై సేవ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్: Pixlr.com
 
ఈసెల్.ఎల్‌వై...

వెయ్యి మాటల్లో చెప్పలేని విషయాన్ని ఒక ఫొటో ద్వారా చెప్పవచ్చు. అలాంటి ఫోటోలకు అంకెలు, గ్రాఫ్‌లు కూడా కలిశాయనుకోండి... విషయాన్ని సూటిగా, వివరించవచ్చు. అచ్చంగా ఈ పనులన్నింటికీ ఉపయోగపడే వెబ్‌సైట్ ఈసెల్.ఎల్‌వై. దాదాపు 300కుపైగా ఉన్న లేఔట్లను ఉచితంగా వాడుకునే అవకాశముంది. ఆ లేఔట్లపై రకరకాల ఫొటోలు, చిత్రాలను చేర్చుకునే సౌలభ్యం ఉంది దీంట్లో. పూర్తయిన తరువాత ఇన్ఫోగ్రాఫిక్‌ను జెపీఈజీ, పీడీఎఫ్ ఫార్మాట్లలో సేవ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్ : www.easel.ly
 
డెస్క్‌టాప్‌పై నోటీస్‌బోర్డు...

ఏరోజుకు ఆరోజు మీరు చేయాల్సిన పనులను గుర్తు పెట్టుకునేందుకు ప్యాడ్‌లెట్ బాగా ఉపయోగపడుతుంది. www.padlet.comవెబ్‌సైట్‌లో ఒకసారి ఫ్రీఅకౌంట్‌ను క్రియేట్ చేసుకుంటే చాలు. డెస్క్‌టాప్‌పై ఒక బ్లాంక్ నోటీస్‌బోర్డు ప్రత్యక్షమవుతుంది. మౌస్‌తో డబుల్‌ట్యాప్ చేయడం ద్వారా మీరు అందులో నోట్‌లు ఉంచుకోవచ్చు. టెక్ట్స్‌తోపాటు వెబ్‌లింక్‌లు, ఫైళ్లు, వెబ్‌క్యామ్‌తో తీసిన ఫొటోలను కూడా ఉంచుకోవచ్చు. ఇతరులతో షేర్ చేసుకునేందుకు అవకాశముంది. బ్లాంక్‌గా ఉండటం బోరు కొట్టిస్తూంటే అందమైన వాల్‌పేపర్లతో అలంకరించుకోవచ్చు. రకరకాల లేఔట్లతో తీర్చిదిద్దుకోవచ్చు కూడా.
 

మరిన్ని వార్తలు