తిమింగలంతో నా సమరం

6 Jul, 2020 00:13 IST|Sakshi
మాబీ డిక్‌ రచయిత హెర్మన్‌ మెల్‌విల్లి

ప్రతిధ్వనించే పుస్తకం

మాబీ డిక్‌ 1851లో ప్రచురితమైనప్పుడు విమర్శకులు పెద్దగా పట్టించుకోలేదు. దీని రచయిత హెర్మన్‌ మెల్‌విల్లి (1819–1891) చనిపోయేనాటికి కూడా ఆయనకు పెద్ద పేరు లేదు. కనీసం ఆ సమయంలో నవల పునర్ముద్రణలోనైనా లేదు. కానీ ఆయన శతజయంతి తర్వాత నెమ్మదిగా నవల పాఠకుల్లో కొత్త ఆసక్తి పుట్టించింది; రచయిత మళ్లీ సజీవుడైనాడు. ఇప్పుడు మాబీ డిక్‌ గొప్ప అమెరికన్‌ నవలల్లో ఒకటి.

హెర్మన్‌ మెల్‌విల్లి నావికుడిగా తన జీవితం ప్రారంభించాడు. పంతొమ్మిదవ శతాబ్దంలో తిమింగలాల వేట పెద్ద పరిశ్రమ. ఆ వ్యాపారంలో ఉన్నవాళ్లు మహాసముద్రాలన్నింటినీ కలియదిరిగి, తిమింగలాలను వేటాడి, వాటి నుండి లభించే నూనెను అమ్ముకునేవారు. దీనికోసం నెలలు, సంవత్సరాల పాటు సముద్రాల మీద తిరిగేవారు. ఆ క్రమంలో ఎన్నో భయంకర అనుభవాలను ఎదుర్కొనేవారు. ఈ నవలలో వర్ణితమైన తిమింగలాల వేట, ఆ జీవితం తాలూకు ఎన్నో విషయాలు రచయిత ప్రత్యక్ష అనుభవం అనుకోవచ్చు. ఈ విశిష్ట నవలను తెలుగులోకి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అనువదించారు. 1967లో గంగాధర పబ్లికేషన్స్‌ ప్రచురించింది. అనువాదకుడు క్లుప్తంగా 

రాసిన పరిచయంలోంచి కొంతభాగం:
‘‘ఇది కేవలం తిమింగలపు వేటలోని కష్టనిష్ఠూరాలను చిత్రించే కథ మాత్రం కాదు. ఈ కథకు ప్రధానపాత్ర అయిన అహబ్, ఒకానొక సన్నివేశంలో, ‘మాబీ డిక్‌’ అనబడే తిమింగలపు వేటు వల్ల తన కాలుని పోగొట్టుకుంటాడు. ప్రస్తుత కథ అహబ్‌ యొక్క ప్రతీకార దీక్షకి చెందినది. చతుస్సముద్రాలు గాలించి, మాబీ డిక్‌ని మరల చూచి, ఎలాగైనా దానిని వధించి, తన పగ తీర్చుకొంటానని అహబ్‌ పట్టుబడతాడు. తన అనుచరులు ఎంత వారించినా లెక్క చేయక, నెగ్గించుకోవడానికి పంతము పూనుకొంటాడు. అది విధి ప్రేరణ. చిట్టచివరకు ఆ తిమింగలాన్ని కనుగొంటాడు, తన శక్తినంతా ఉపయోగించి దానిని ఎదుర్కొంటాడు. కాని ఆ భూతానికి బలి అవుతాడు.

ఈ విషాదగాథ ఒక ‘‘ట్రాజెడీ’’ అయింది– విషాదాంత నాయకునకు ఉండే లక్షణములలో ముఖ్యమైనది ఏమనగా, తనను కబళింపనున్న విధికి తనకి తెలియకుండగనే తన చేతుల వల్ల సాయపడుట! తుది నిశ్వాసమును విడుచుచున్నను పరాజయమును ఒప్పుకోకపోవుట. ఈ లక్షణము ఈ కథానాయకుడగు అహబ్‌ ఎడ సంపూర్ణంగా సమన్వయించుకోవచ్చు.’’

మరిన్ని వార్తలు