నాచన స్థానము

29 Jun, 2020 02:06 IST|Sakshi

కడపలోని సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ప్రచురించిన ‘నాచన సోముడు’, ఈ ప్రాచీన తెలుగు కవి ‘ఉత్తర హరివంశం’ కావ్యంలోని నానాముఖాలపై రాసిన ఎనిమిది వ్యాసాల సంకలనం.

ప్రకాండ పండితులు నడకుదుటి వీరరాజు నూరేళ్ల క్రితమే నాచన సోముని కవితావైభవం గురించి విలువైన రచనలు చేశారు. సోమన్న పూర్వ, ఉత్తర హరివంశాలు రెంటినీ రచించారు. ప్రస్తుతం ఉత్తర హరివంశ మొక్కటే దొరుకుతున్నది. ఎర్రన, సోమన చదివిన సంస్కృత హరివంశం ప్రతులు భిన్నమైనవి. అందువల్లే ఇద్దరూ ఎన్నుకొన్న కథలు వేర్వేరుగా వున్నాయి. నాచన సోముని పక్షపాతి నడకుదుటి వారు. ‘గురువును మించిన శిష్యు’డు అని ప్రశంసించారు. నాచన సోముని భావనాశక్తినీ, లోకజ్ఞతనూ గొప్పగా మెచ్చుకున్నారు.

ఎస్‌.వి.ఎన్‌.భాష్యకారాచార్యులు సోమన్న సంభాషణా చాతుర్యాన్నీ, సంస్కృతాంధ్ర పదబంధాన్నీ, అలంకార ప్రయోగాన్నీ బహుదా ప్రశంసించారు. విశ్వనాథ సత్యనారాయణ ‘నాచన సోమన– సంవిధాన చక్రవర్తి’ 39 పేజీల సుదీర్ఘ రచన. సోమన సీస పద్య రచనా కౌశలాన్నీ, ఉక్తి వైచిత్య్రాన్నీ, నుడికార ప్రయోగాన్నీ నవీన గుణాలుగా పేర్కొంటూ, ఆ మహాకవి శ్రీనాథుడు, ప్రబంధ కవులకు మార్గదర్శకుడైన విధానాన్ని తేటతెల్లం చేశారు. 

నాచన తన పాత్రల్లో సమకాలీన జనుల చిత్తవృత్తుల్ని చొప్పించి, పౌరాణిక పాత్రల్ని సమకాలీన పాత్రలుగా చిత్రించారని ఆరుద్ర అన్నారు. రాణీ హయగ్రీవ శర్మ, సోమన వస్తు చిత్రణా, వర్ణనా వైవిధ్యం వివరించారు. వేదుల కామేశ్వరరావు ‘నాచన సోముడు– ఎర్రన’ వ్యాసం, రాళ్లపల్లి వారి ‘నాచన సోముని నవీన గుణములు’లోని విషయాల్నే ప్రస్తావిస్తుంది. కొలకలూరి ఇనాక్‌ ‘నాచన సోముని కవితావైభవం’, ఎం.గోవిందస్వామి నాయుడు ‘నాచన సోముని శ్రీకృష్ణ పాత్ర చిత్రణ’ వ్యాసాలు సామాన్యంగా ఉన్నాయి. రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ ‘నాచన సోముని నవీన గుణములు’, ‘ఆంధ్ర వాఙ్మయమున నాచన సోమన కీయదగిన స్థానము’ వ్యాసాల్ని కూడా ఈ గ్రంథంలో చేర్చివుంటే పసిడికి పరిమళం అబ్బినట్లు అయివుండేది.
-పినాకిని

నాచన సోముడు 
(విమర్శా వ్యాసాలు); సంపాదకులు: డాక్టర్‌ మూల మల్లికార్జున రెడ్డి; పేజీలు: 140; వెల: 100; ప్రతులకు: సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం, కడప. ఫోన్‌: 08562–25517 

మరిన్ని వార్తలు