ఆనందంగా జీవించండి..!!

2 Aug, 2015 23:47 IST|Sakshi
ఆనందంగా జీవించండి..!!

సాక్షి వెల్‌నెస్ ఎక్స్‌పో గురించి...
 ఆరోగ్య సంరక్షణ విషయంలో డాక్టర్లు తమ పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకోవడం కోసం కాన్ఫరెన్స్‌లు ఉంటాయి. కానీ సాధారణ ప్రజలకు ఆరోగ్యరంగాల్లో వచ్చిన అభివృద్ధి, పురోగతి గురించి తెలియడానికి అంతగా అవకాశం లేదు. ఆరోగ్యరంగంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకోడానికి, ఎన్నెన్నో అంశాలపై అవగాహన కల్పించుకోడానికి ‘సాక్షి వెల్‌నెస్ ఎక్స్‌పో’ బాగా ఉపయోగపడుతుంది. పైగా ఇక్కడ సాధారణ ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారు. కాబట్టి ఈ నెల 8, 9 తేదీల్లో హైటెక్స్‌లో జరిగే సాక్షి వెల్‌నెస్ ఎక్స్‌పోను అందరూ సందర్శించండి. ఆరోగ్యాంశాలపై అవగాహన పొందండి. ఇది నిజంగా అభినందనీయమైన మంచి ప్రయత్నం!
 - పలువురు ప్రముఖ డాక్టర్లు
 
 ఫిట్‌సెస్ కోసం వ్యాయామం

 - డాక్టర్ గురవారెడ్డి మోకాలి మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు
 వ్యాయామం అంటే చాలా కష్టపడి చేయాల్సిన అవసరం లేదు. శరీరమంతా కాస్త కదిలేలా రోజుకు కనీసం అరగంట పాటు వేగంగా నడిస్తే చాలు. కొందరికి వ్యాయామం వల్ల మోకాళ్లపై భారం పడి అరుగుతాయనే దురభిప్రాయం ఉంది. నిజానికి మోకాళ్లకూ తగినంత పోషకాలు అందాలంటే అవి కదులుతూ చురుగ్గా ఉండాలి. అంతేగానీ వ్యాయామం వల్ల మోకాళ్లు అరిగిపోవు. అయితే ఒళ్లు బరువు చాలా ఎక్కువగా ఉన్నవారు మొదటే మోకాళ్లపై భారం పడకుండా సైక్లింగ్, ఈత వంటి వ్యాయామాలు చేసి, బరువును తగ్గించుకొని ఆపై నడక మొదలు పెడితే మంచిది. వ్యాయామం వల్ల చాలాకాలం పాటు ఆరోగ్యంగా, చురుగ్గా జీవించవచ్చు.
 
 అన్నీ కలిస్తేనే ఆరోగ్యం...
 - డాక్టర్ సీహెచ్. మోహనవంశీ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్
 ఆరోగ్యం అంటే కేవలం మన శారీరక ఆరోగ్యం మాత్రమే బాగుండటం కాదు. కేవలం శరీరంలోని అన్ని వ్యవస్థలూ చక్కగా పనిచేయడం మాత్రమే కాదు. మానసికంగానూ చక్కగా, ఆనందంగా ఉండటం కూడా కలుపుకుంటేనే ఆరోగ్యంగా ఉండటం అవుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యాలకు, బుద్ధిపరమైన, ఆత్మానుగతమైన ఆనందం కూడా తోడైతే అది సంపూర్ణారోగ్యం అవుతుంది. అప్పుడే మనిషి పూర్తిగా ఆనందారోగ్యాలతో ఉన్నట్లుగా భావించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సంపూర్ణారోగ్యం విషయంలో ఇదే చెబుతోంది. మనలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండటానికి అవసరమైన అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి.
 
 మంచి నిద్ర అవసరం
 - డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్
 మంచి ఆరోగ్యానికి ఆరు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం. తాము నిద్ర మేల్కొన్న తర్వాత హాయిగా అనిపించేలా ఉన్నప్పుడు మన నిద్ర కూడా నాణ్యమైనదిగా ఉన్నట్లు లెక్క. నిద్ర తగ్గడం వల్ల గుండె, మెదడు లాంటి కీలకమైన అవయవాలపై ప్రతికూల ప్రభావాలు పడతాయి. ఇటీవల ఎలక్ట్రానిక్ పరికరాలతో బెడ్‌రూమ్‌లోనూ పనిచేస్తుండటం మామూలే. వాటి నీలికాంతితో నిద్రలేమి సాధారణం. బెడ్‌రూమ్‌ను కేవలం హాయిగా నిద్రపోవడం కోసమే ఉపయోగించండి. అక్కడి నుంచి టీవీ తీసేయండి. హాయి నిద్రకు కార్బోహైడ్రేట్ ఫుడ్, గోరువెచ్చని పాలు పడుకోబోయే ముందు తీసుకోండి. ఇందులోని ట్రిప్టోఫాన్ అనే ఎంజైమ్ నిద్ర వచ్చేలా చేస్తుంది.
 
 ఒత్తిడిని జయిస్తేనే...
 
 - డాక్టర్ గోపీచంద్ మన్నం ప్రముఖ కార్డియోథొరాసిక్ సర్జన్
 మన జీవితాల్లో ఒత్తిడి చాలా ప్రముఖ భూమిక పోషిస్తోంది. ఒత్తిడి అంటే కేవలం వృత్తిపరమైనదే కాదు...  బయట సామాజికంగా ఒత్తిళ్లు, వృత్తుల్లో లక్ష్యాల ఒత్తిళ్లు... ఇలా ఎన్నో రకాల ఒత్తిళ్లు మనల్ని అనుసరిస్తుంటాయి. ఒత్తిడి కలిగినప్పుడు దానికి కారణాలను అన్వేషించి, మూలం నుంచి సరిచేసుకుంటూ వస్తే చాలు సమస్య దూరమవుతుంది. అంతేగానీ ఒత్తిడిని పెంచుకుంటే మరింత జటిలం అవుతుంది. ఇక యోగా, ధ్యానం వంటివి కూడా మానసికంగా ప్రశాంతత కల్పించి, ఒత్తిడిని దూరం చేసేందుకు ఎంతో ఉపయోగపడతాయని చాలా పరిశోధనల్లో తేలింది. కాబట్టి క్రమం తప్పకుండా యోగా చేయడం మానసిక ఒత్తిళ్ల నుంచి బయటపడటానికి ఎంతగానో ఉపకరిస్తుంది.
 
 మంచి ఆహారంతో  మేలైన ఆరోగ్యం...
 - డాక్టర్ నాగేశ్వరరెడ్డి, ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్
మనం తీసుకునే ఆహారం బాగుంటే ఆరోగ్యం చాలావరకు దానంతట అదే మెరుగవుతుంది. మన జీర్ణవ్యవస్థ బాగుండటానికి అన్ని పోషకాలూ ఉండే సమతుల ఆహారం తీసుకోవాలి. సమతులాహారం అంటే... అందులో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు ఉండాలి. ప్రోటీన్లు కాస్త ఎక్కువగానూ, కార్బోహైడ్రేట్లు తగినంత, కొవ్వులు చాలా పరిమితంగా ఉండాలి. ఆకుపచ్చటి ఆకుకూరల్లో తగినంత ఆరోగ్యాన్ని సమకూర్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పైగా మన జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడానికి మనం తీసుకునే ఆహారంలో తగినంత పీచు ఉండాలి. ఈ పీచు పదార్థాలు కూడా ఆకుపచ్చటి ఆకుకూరగాల్లో, కాయగూరల్లో, తాజా పండ్లలో పుష్కలంగా లభిస్తుంటాయి. మనకు అన్ని పోషకాలూ అవసరం కాబట్టి మన ఆహారం కూడా సమతౌల్యంగా ఉండేలా జాగ్రత్త పడితే మనకు మంచి ఆరోగ్యం సమకూరుతుంది.
 
గమనిక: ఆదివారం ఇదే పేజీలో ప్రచురితమైన ‘ఆరోగ్యానికి పారాహుషార్’ అనే కథనంలో జీవనశైలి వ్యాధులతో పోరాటమెలా... అనే సూచనల్లో మంచి ఆరోగ్యం కోసం ‘క్రమం తప్పకుండా వారంలో కనీసం 150 గంటల పాటు తేలికపాటి వ్యాయామాలు’ చేయాలని పొరపాటున ప్రచురితమైంది. దీనిని గంటలకు బదులు నిమిషాలుగా చదువుకోగలరు.
 
 ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్ హైటెక్స్‌లో జరగనున్న సాక్షి వెల్‌నెస్ ఎక్స్‌పో గురించి మరింత సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ - 96662 84600
 
 

మరిన్ని వార్తలు