లివర్‌ కౌన్సెలింగ్స్‌

23 Jan, 2019 01:52 IST|Sakshi

నా వయసు 46 ఏళ్లు. నాకు చిన్నప్పుడు, యుక్త వయసులో చాలాసార్లు జాండీస్‌ వచ్చాయి. అప్పట్లో పసరువైద్యం చేశారు. అయితే ఈమధ్య ఆకలి మందగించడం, వాంతులు, వికారం లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అలాగే కడుపునొప్పి, ఏ చిన్న పని చేసినా తీవ్రమైన అలసట కనిపిస్తున్నాయి. దాంతో డాక్టర్‌ను సంప్రదించాను. ఆయన కొన్ని పరీక్షలు చేసి, నా లివర్‌ పూర్తిగా పాడైపోయిందని చెబుతున్నారు. దాంతో నేనూ, మా కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాం. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. 

లివర్‌ పూర్తిగాపాడైంది... పరిష్కారం చెప్పండి
మన దేశంలో తీవ్ర ప్రాణాంతక జబ్బులలో లివర్‌ వ్యాధులు ముఖ్యమైనవి. లివర్‌ పాడవడానికి అనేక కారణాలున్నాయి. పెద్దవాళ్లలో (ముఖ్యంగా మగవాళ్లలో) విపరీతంగా తాగడం వల్ల త్వరగా లివర్‌ పాడైపోతోంది. అలాగే ఎక్కువ శాతం మంది హెపటైటిస్‌– బీ, హెపటైటిస్‌–సి వైరస్‌ సోకడం, జన్యుపరమైన సమస్యలు, ఇతరత్రా కారణాల వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఇక మీ విషయానికి వస్తే మీరు చిన్నప్పటి నుంచే కాలేయ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీరు ముందుగా కాలేయ నిపుణుడిని కలవండి. కంప్లీట్‌ బ్లడ్‌ టెస్ట్స్‌ నిర్వహించి మీ లివర్‌ ఎంతమేరకు చెడిపోయింది, ఎలా దెబ్బతిన్నదనే అంశాలను ప్రాథమికంగా గుర్తించాలి.

ఆ తర్వాతే మీకు ఎలాంటి చికిత్స అందించాలనేది నిర్ణయిస్తారు. ఒకవేళ లివర్‌ పాక్షికంగానే దెబ్బతింటే మందుల ద్వారా దానిని సరిచేయవచ్చు. అలా కాకుండా మీ లివర్‌ పూర్తిగా పాడైపోయి ఇక పనిచేయని తేలితే మాత్రం ‘లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌’ తప్పనిసరిగా నిర్వహించాల్సిందే. అలాంటి పరిస్థితి వస్తే దీనికి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా మీ బ్లడ్‌గ్రూప్‌కి సరిపోలిన వారు ముందుకు రావాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియను ‘లైవ్‌ డోనార్‌’ ప్రక్రియ అంటారు.

ఇది చాలా సురక్షితమైన విధానం. ఇది కాకుండా ‘కెడావర్‌ ఆర్గాన్‌ విధానం ద్వారా కూడా సర్జరీ చేయించుకోవచ్చు. దీనికోసం ‘జీవన్‌దాన్‌’లో పేరు నమోదు చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే మరణానంతరం అవయవదాతల నుంచి లివర్‌ లభ్యమైనప్పుడు మాత్రమే ఇలా లివర్‌ లభించే అవకాశం ఉంది. కెడావర్‌ ఆర్గాన్‌ పద్ధతిలో అవయవాల లభ్యత తక్కువగా ఉండటం వల్ల చాలా మంది పేషెంట్లు ‘లైవ్‌ డోనార్‌’ పైనే ఆధారపడుతున్నారు. మీరు తక్షణమే మీ సమస్యను గుర్తించి అవసరమైన చికిత్స తీసుకోండి. ఒకవేళ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ చేయాల్సి వచ్చినా ఆందోళన అవసరం లేదు. ఈ సర్జరీ సక్సెస్‌ రేటు 90 శాతం ఉంటుంది. ఇక మీరు ఎంతమాత్రమూ ఆలస్యం చేయకుండా లివర్‌ స్పెషలిస్ట్‌ను కలవండి.

నా వయసు 34 ఏళ్లు. మా అన్నయ్యకు కాలేయం పూర్తిగా  దెబ్బతిన్నదనీ, కాలేయ మార్పిడి తప్ప మరో అవకాశం లేదని డాక్టర్లు చెప్పారు. రక్తసంబంధీకులలో ఎవరైనా కాలేయదానం చేయవచ్చని వివరించారు. నేను మా అన్నయ్యకు కాలేయం ఇవ్వాలని అనుకుంటున్నాను. డాక్టర్లు వివిధ పరీక్షలు చేశాక నేను దాతగా అన్నివిధాలా అర్హురాలినని చెప్పారు. మా అన్నయ్యకు కాలేయం ఇవ్వడం వల్ల భవిష్యత్తులో నాకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా? 

నేను కాలేయ దానం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులుఉంటాయా? 
అన్ని రకాల పరీక్షలూ చేశాక, మీ అన్నయ్యకు మీరు కాలేయం ఇవ్వడానికి అన్నివిధాలా అర్హులని వైద్యులు నిర్ధారణ చేశారు కాబట్టి మీరు నిరభ్యంతరంగా కాలేయాన్ని దానం చేయవచ్చు. మన దేహంలో కొంతభాగాన్ని తొలగించినా కూడా మళ్లీ యథారూపానికి వచ్చే స్వభావం కాలేయానికే ఉంది. మీ నుంచి 20–25 శాతం కాలేయాన్ని తొలగించి, దాన్ని మీ అన్నగారికి అమర్చుతారు. కాలేయ దానం వల్ల మీకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలూ ఉత్పన్నం కావు. కాలేయానికి ఉన్న పునరుత్పత్తి శక్తి వల్ల దాతలోని కాలేయం కూడా మళ్లీ  6–8 వారాలలో యథాస్థితికి పెరుగుతుంది.

దీర్ఘకాలికంగా ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం ఉండదు. సర్జరీ తర్వాత అన్ని రకాల ఆటలూ ఆడవచ్చు. అందరిలాగే ఏవిధమైన ఇబందులూ లేకుండా సాధారణ జీవితం గడపవచ్చు. మీ అన్నయ్యకు కాలేయం పూర్తిగా విఫలమై కాలేయ మార్పిడి చేయించుకోవాలని వైద్యులు సూచించినట్లు మీరు తెలిపారు. కాబట్టి వీలైనంత త్వరగా ఈ శస్త్రచికిత్స చేయించాలి. లేకపోతే మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తి అవి మీ అన్నయ్యకు మరింత ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఎందుకంటే కాలేయం చాలా కీలకమైన అవయవం. అది ఒక రసాయన కర్మాగారంలా పనిచేస్తూ మనం తిన్న ఆహారంలోని పదార్థాలను చిన్న పోషకాల్లోకి మార్చుతుంది.

జీర్ణప్రక్రియలో భాగంగా పైత్యరసాన్ని స్రవింపజేస్తుంది. కొవ్వులను, పిండిపదార్థాలను, ప్రోటీన్లను, విటమిన్లను నిల్వ చేస్తుంది. రక్తం గడ్డటానికి ఉపయోగపడే అంశాలను రూపొందిస్తుంది. శరీరంలోకి చేరే విషాలను విరిచేస్తుంది. ఒకవేళ కాలేయం సరిగా పనిచేయకపోతే చిన్న దెబ్బతగిలినా తీవ్ర రక్తస్రావంతో మనిషి ప్రాణాలకే ముప్పు వస్తుంది. మీరు కాలేయాన్ని ఇవ్వడం ద్వారా మీ అన్నయకు కొత్త జీవితాన్ని ప్రసాదించినవారవుతారు. కాబట్టి నిరభ్యంతరంగా కాలేయాన్ని ఇవ్వవచ్చు. 

ఫ్యాటీలివర్‌అంటున్నారు... సలహాఇవ్వండి
నా వయసు 56 ఏళ్లు. శాకాహారిని. అయితే తరచూ మద్యం తీసుకుంటూ ఉంటాను. డయాబెటిస్‌ ఉంది. మందులు వాడుతున్నాను. ఇటీవల హాస్పిటల్‌కు వెళ్లి జనరల్‌ చెకప్‌ చేయించుకున్నప్పుడు ఫ్యాటీలివర్‌ ఉన్నట్లు డాక్టరు గుర్తించారు. ఫ్యాటీలివర్‌ అంటే ఏమిటి? దీనికి చికిత్స చెప్పండి. 

ఫ్యాటీలివర్‌ వ్యాధి అంటే కాలేయంలో మామూలుగా ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా కొవ్వు చేరడం. శరీరంలో కొంత కొవ్వు ఉండటం సహజమే. కానీ శరీరపు బరువులో అది పదిశాతాన్ని మించినప్పుడు ఫ్యాటీలివర్‌ వ్యాధి వస్తుంది. ఈవ్యాధి కొంతమందిలో ఎందుకు వస్తుందో, మరికొంత మంది దీనికి నిరోధక శక్తి ఎందుకు కలిగి ఉంటారో తెలియదు. అయితే కొన్ని లక్షణాలు మాత్రం వ్యాధిగ్రస్తుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ వ్యాధిగ్రస్తులంతా దాదాపు స్థూలకాయులే. ఊబకాయం కాలేయ వ్యాధులకు కారణమవుతోంది. ఈ వ్యాధిగ్రస్తులు చాలావరకు మధ్యవయస్కులు. రక్తంలో ట్రైగ్లిసరైడ్స్, కొలెస్ట్రాల్‌ అధికంగా ఉంటాయి.

డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులు, ఇతరత్రా కాలేయ వ్యాధి ఉన్న చాలామందిలో ఫ్యాటీలివర్‌ వ్యాధి చాలా సాధారణంగా కనిపిస్తోంది. ఫ్యాటీ లివర్‌తో సహా చాలా కాలేయ వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. అందువల్ల ఆలస్యం చేయకుండా కాలేయ వ్యాధుల చికిత్సకు అవసరమైన ఆధునిక వసతులు, నిపుణులు ఉన్న ఆసుపత్రికి వెళ్లి చూపించుకోండి. అవసరమైన పరీక్షలు జరిపించి, వ్యాధి ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, తగు చికిత్స ప్రారంభించగలుగుతారు. మద్యం అలవాటు కాలేయ వ్యాధుల తీవ్రతను పెంచి పరిస్థితిని మరీ దిగజారుస్తుంది.

మద్యం అలవాటు మానేయండి. శరీరం బరువు తగ్గించుకోండి. బరువు మూడు నుంచి ఐదు శాతం తగ్గినా కాలేయంలో కొవ్వు గణనీయంగా తగ్గిపోతుంది. ఫ్యాటీలివర్‌కు ఇతర వైద్యచికిత్సలతో పాటు ఆరోగ్యకరమైన జీవనవిధానం, క్రమం తప్పని ఏరోబిక్‌ వ్యాయామాలు, రెడ్‌మీట్‌ తినకుండా ఉండటం వంటి జీవనశైలిని సూచిస్తుంటాం. ఫ్యాటీ లివర్‌ ఉన్నవారు వారానికి ఐదురోజులైన రోజుకు అరగంట కంటే తగ్గకుండా వ్యాయామం చేయడం అవసరం. 

డాక్టర్‌ బాలచంద్రన్‌ మీనన్,
సీనియర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌
హెపటాలజీ అండ్‌ లివర్‌ డిసీజెస్, 
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌  

మరిన్ని వార్తలు