లివర్ పెరుగుతోంది... ఎందుకు?

4 Feb, 2016 23:39 IST|Sakshi

హోమియో కౌన్సెలింగ్
 
 నా వయస్సు 45 ఏళ్లు. నేను గత రెండేళ్లుగా తీవ్రమైన మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్నాను. నేను చాలా మంది డాక్టర్లను కలిశాను. కానీ తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తుంది. హోమియోపతిలో దీనికి ప్రత్యేక పరిష్కారమార్గాలు ఏవైనా ఉన్నాయా?
 - శ్యామ్, కరీంనగర్

 మైగ్రేన్ అనేది ఒక విధమైన తలనొప్పి. తలనొప్పిలో చాలా రకాలు ఉంటాయి. ఈ మైగ్రేన్ అనేది తలకు ఒక పక్కనే వస్తుంది కాబట్టి దీనికి పార్శ్వపు నొప్పి అంటారు. కారణాలు:  మానసిక ఒత్తిడి  అధిక శ్రమ  ప్రకాశవంతమైన వెలుతురు కళ్లపైన పడటం  ఋతుక్రమంలో తేడాలు  మత్తు పానీయాలు ఎక్కువగా తీసుకోవడం  పొగ తాగడం  వంటివి దీనికి కారణాలు. కొందరిలో గర్భనిరోధక మాత్రలు మైగ్రేన్‌ను ప్రేరేపించే అవకాశం ఉంది  తలకు ఒక వైపు వెళ్లే నరాలు ఒక్కసారిగా కుచించుకుపోవడం వల్ల లక్షణాలు ప్రారంభమవుతాయి.
 మైగ్రేన్ రకాలు

 1) క్లాసికల్ మైగ్రేన్: ఈ రకం తలనొప్పి స్త్రీ, పురుషులకు సమానంగా ఏ వయసు వారికైనా రావచ్చు. ఈ రకం తలనొప్పి మొదట చెవి పై భాగంలో మొదలై తరువాత తల సగ భాగానికి వ్యాపిస్తుంది.

 2) కామన్ మైగ్రేన్: ఈ రకం తలనొప్పి సాధారణంగా స్త్రీలలో ఎక్కువగా మధ్య వయస్సు వారిలో కనిపిస్తుంది. ఈ నొప్పి తలలో ఎక్కడైనా రావచ్చు. ఈ నొప్పి మంద్రంగా కళ్లల్లో సందులతో గుచ్చుతున్నట్లుగా ఉంటుంది.

లక్షణాలు:  ఉదయం నిద్ర మేల్కొన్నప్పుడు ఎక్కువగా తలనొప్పి వస్తుంది  కొందరిలో వాంతి వచ్చినట్లు ఉంటుంది  అధిక వెలుతురును భరించలేకపోవడం  ఎక్కువ శబ్దాలను తట్టుకోలేకపోవడం  కళ్ల ముందు వెలుతురు చుక్కలాగా కనిపించడం  ఆకలి తగ్గిపోవడం  స్త్రీలలో రుతుక్రమ సమయంలో ఈ నొప్పి ఎక్కువవుతుంది  ముఖంలోని ఒక భాగంలో కాని, ఒక చేయి కాని, తిమ్మిరి పట్టడం జరుగుతుంది  కళ్లు తిరగడం

నిర్థారణ: వ్యాధి లక్షణాలు తెలుసుకోవడం, సిటీ స్కాన్, ఎమ్మారై, రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధి నిర్ధారణ చేయవచ్చు
నివారణ:  పోషకాఆరం తీసుకోవడం  రోజూ వ్యాయామం చేయడం  ఎక్కువగా మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండడం  పొగతాగడం, మత్తు పానీయాలకు దూరంగా ఉండడం  ఎక్కువగా యాంటీ బయాటిక్స్‌కు వాడకుండా ఉండడం.
 హోమియో చికిత్స: హోమియోలో ఎటువంటి సమస్యలకైనా కాన్‌స్టిట్యూషనల్ చికిత్స ద్వారా రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధి తీవ్రతను తగ్గించి క్రమక్రమంగా పూర్తిగా వ్యాధి నివారణ చేయవచ్చు.
 
డాక్టర్ ఎ.ఎం. రెడ్డి
సీనియర్ డాక్టర్
పాజిటివ్ హోమియోపతి
హైదరాబాద్
 
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
 
నా వయసు 35 ఏళ్లు. నేను నిద్రపోయే సమయంలో ఛాతీ కింద ఎడమవైపున గత వారం నుంచి నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే లివర్ సైజు పెరిగిందని చెప్పారు.  లివర్ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి.
         - విజయ్, ఆమదాలవలస

 మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ లివర్ సైజు పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్ మితిమీరి తీసుకునేవారిలో, స్థూలకాయుల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్ సైజ్ పెరిగే అవకాశం ఉంది. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్-బి, హెపటైటిస్-సి వంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా లివర్ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ.

 - ముందుగా మీలో లివర్ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ పరీక్ష చేయించండి. ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు నొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి.
 
మా బాబు వయసు పదేళ్లు. అతడికి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు పచ్చకామెర్లు వచ్చాయి. అవి నెలలోపు వాటంతట అవే తగ్గిపోయాయి. మళ్లీ రెండు వారాల క్రితం నుంచి కళ్లు పచ్చగా కనిపిసర్తున్నాయి. దయచేసి సలహా ఇవ్వగలరు.
 - సుభాష్, నవీన్‌నగర్

మీ అబ్బాయి వయసులోని వారికి ప్రధానంగా హైపటైటిస్-ఎ, హెపటైటిస్-ఈ అనే వైరస్‌ల వల్ల కామెర్లు రావడానికి అవకాశం ఉంటుంది. మీవాడికి ఇంతకుముందు కూడా ఒకసారి కామెర్లు వచ్చాయంటున్నారు. కాబట్టి ఈ వైరస్ వల్ల మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ సోకే అవకాశం చాలా అరుదు. ఒకసారి పై ఇన్ఫెక్షన్లు సోకితే వాటి పట్ల వ్యాధి నిరోధకశక్తి అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. దీన్ని బట్టి చూస్తే మీ బాబు కామెర్లకు ఇతర కారణాలు అంటే... విల్సన్ డిసీజ్ వంటివి ఉండవచ్చు. మీ బాబుకు దురద, రక్తహీనత వంటి లక్షణాలు ఉన్నాయా, లేవా అన్న విషయం మీరు రాయలేదు. మీరు దగ్గర్లోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌కు చూపించుకోండి.
 
డాక్టర్ భవానీరాజు,
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
క్యాన్సర్ కౌన్సెలింగ్
 
మా తాతగారు, నానమ్మ, పెద్దనాన్న, మా నాన్నగారు క్యాన్సర్ బారిన పడి చనిపోయారు. కుటుంబసభ్యుల్లో ఎవరైనా క్యాన్సర్‌బారిన పడి ఉంటే, ఆ కుటుంబ వారసులూ జాగ్రత్తగా ఉండాలని చదివాను. మా కుటుంబ వైద్య చరిత్రలో క్యాన్సర్ ఉంది కాబట్టి నేనూ క్యాన్సర్‌తో చనిపోతాననే ఆందోళన ఉంది. దయచేసి నా అనుమానాలకు తగిన సమాధానాలు ఇవ్వండి.
 - రఘు, విజయవాడ

మీ అనుమానాలకు తగిన బలముంది. క్యాన్సర్ వ్యాధి బారిన పడి చనిపోయిన కుటుంబ చరిత్ర ఉంటే వాళ్ల వారసులకు ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగానే ఉందని చెప్పాలి. దీనికి స్త్రీ, పురుషులు, వయసు వంటి అంశాలతో సంబంధం లేదు. ఎవరికైనా రావచ్చు. అయితే మా తాతగారి కాలంలో క్యాన్సర్ వ్యాధికి సరైన చికిత్సే కాదు... దానిని ముందుగా కనిపెట్టేందుకు తగినంత వైద్యపరిజ్ఞానం కూడా లేదు. దాంతో అప్పట్లో క్యాన్సర్ పదం వింటేనే ఆ వ్యాధి బారిన పడ్డవారిపై ఆశలు వదలులుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అత్యాధునిక వైద్యపరిజ్ఞానంతో పాటు నిపుణులైన డాక్టర్లు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నారు. అంతేకాదు ముఖ్యంగా ఈ క్యాన్సర్ వ్యాధిని ముందే గుర్తించే అధునాతనమైన వైద్య పరిరకాలు, ఉపకరణాలు, వైద్య పరీక్షలు, ఇతరత్రా అనేక ప్రక్రియలు మనకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా ఏ రకమైన క్యాన్సర్‌నైనా మొదటిదశలోనే గుర్తిస్తే దాన్ని సమూలంగా రూపుమాపవచ్చు. సకాలంలో గుర్తిస్తే దాదాపు 75 శాతం వరకు దీనిని ఎదుర్కొనే వైద్య సదుపాయాలు ఉన్నాయి. కానీ దీని బారిన పడ్డవారు చివరిదశలో చికిత్స కోసం వస్తే వారి జీవితానికి 25 శాతం మాత్రమే హామీ ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే... మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఉన్న అలవాట్లను బట్టి మీరు వెంటనే కొన్ని వైద్య పరీక్షలు చేయించుకుంటే మీకు క్యాన్సర్ వస్తుందా, రాదా అని కూడా చెప్పవచ్చు. మీకు ఆరోగ్యకరమైన అలవాట్లు, జీవనశైలి ఉంటే క్యాన్సర్‌ను జయించవచ్చు. ఒకవేళ చెడు అలవాట్లకు లోనైతే క్యాన్సర్‌బారిన పడే అవకాశాలు ఎక్కువ. అయితే అందరూ గుర్తించి, పాటించాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉన్నాయి. అవి...  పొగతాగే అలవాటు ఉంటే వెంటనే దాన్ని మానేయాలి  విపరీతంగా మద్యం తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు  క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి  తాజా పండ్లు, కాయగూరలు, ఆకుకూరలు తినాలి  చిన్నప్పుడు ఇవ్వాల్సిన అన్ని రకాల వ్యాక్సిన్‌ను పిల్లలకు ఇవ్వాలి.
 
డాక్టర్ జి. వంశీకృష్ణారెడ్డి
సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్
యశోద హాస్పిటల్స్
మలక్‌పేట
హైదరాబాద్
 

మరిన్ని వార్తలు