ఆ కోరిక ఇంకా తీరలేదు!

1 Apr, 2016 00:03 IST|Sakshi
ఆ కోరిక ఇంకా తీరలేదు!

టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్ చూసేవాళ్లకి   చిరపరిచితుడు. లైవ్‌షోస్ అలవాటున్నవారు లైక్ కొట్టే మాస్టర్ ఆఫ్ సెర్మనీ. అనుకరణ కళాభిమానులకు మిమిక్రీ మిస్సైల్. సినిమా  ప్రేక్షకులకీ తెలిసినోడు... యాడ్‌‌సలోనూ కనిపిస్తాడు. ప్రైవేటు సంస్థల బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రత్యక్షమవుతాడు. స్టాండప్ కామెడీ నుంచి షార్ట్ ఫిల్మ్‌ల దాకా... ఒక రంగంలో సక్సెస్ అయితే అక్కడే అతుక్కుపోయి ఫ్యూచర్‌ను వెతుక్కునే ధోరణికి దూరంగా, నచ్చిన ప్రతి రంగానికీ దగ్గరగా తనను తాను నిత్య నూతనంగా మలచుకుంటున్న లోహిత్ కుమార్ తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఆయన మాటల్లోనే...

ఎంటర్‌టైన్‌మెంట్... ఓ సెంటిమెంట్...
మాది వరంగల్ జిల్లాలోని పెదవోడూరు గ్రామం. రైతు కుటుంబం. నాకో అన్నయ్య ఉన్నాడు. ప్రస్తుతం ప్రభుత్వోద్యోగి. ఆవులు, గేదెలు, దూడలు, పక్షులు, పిట్టల పలకరింపులు వింటూ... వాటిని అనుకరిస్తూ పెరిగాను. అదే నా తొలి మిమిక్రీ స్కూల్ అని చెప్పాలి. స్నేహితులు, బంధువుల సమూహం ఎక్కడ కనపడినా వారిని ఏదో ఒక రకంగా ఎంటర్‌టైన్ చేయడం నాకలవాటు. బహుశా అదే ఇంకా కంటిన్యూ అవుతోందనుకుంటా. చిన్నప్పుడు అబ్బిన మిమిక్రీ కాలేజీడేస్‌లో స్టేజ్ ప్రోగ్రామ్స్‌తో పాటు యాడ్స్‌లోనూ భాగం అయ్యేలా చేసింది. అలా డిగ్రీ చదివేటప్పుడే నేను సెల్ఫ్ ఎంప్లాయ్డ్ అయిపోయా. అందుకేనేమో... నాకెప్పుడూ ఫ్యూచర్ గురించి ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ కలగదు. కొత్త కొత్త రంగాలవైపు నా ప్రయాణం ఆగలేదు.

  అనుకరిస్తూ... అనుభూతిస్తూ...
గుంటూరులోని హిందూ కాలేజ్ ద్వారా మిమిక్రీలో వరుసగా 3 సార్లు స్టేట్ ఫస్ట్ వచ్చాను. కేవలం 15 నిమిషాల్లో 150 శబ్ధాలు పలికించి తక్కువ టైమ్‌లో అత్యధిక శబ్ధాలు అనుకరించిన కళాకారుడిగా 1992లో లిమ్కాబుక్‌లోకి ఎక్కాను. ఈ రికార్డ్ ఇప్పటికి అలాగే  నా పేరు మీదే ఉంది. ప్రతిరోజూ ఒక కొత్త వాయిస్ సాధన చేయడం నాకు అలవాటు. కమల్ హాసన్ వాయిస్ అనుకరణతో బాగా పేరొచ్చింది. వ్యక్తిగతంగా టాలీవుడ్ విలన్ షియాజీ షిండే వాయిస్ ఇష్టం. వేదిక ఎక్కితే  వినోదం పంచడమే నాకు తెలుసు. అందుకు ఎలాంటి అవకాశం వచ్చినా వదులుకోను. ఆ క్రమంలోనే పరిచయస్థుల సూచనమీద ఓ ప్రోగ్రామ్‌లో ఎమ్సీ (మాస్టర్ ఆఫ్ సెర్మనీ) గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వేల సంఖ్యలో ఎమ్సీగా చేశాను. .

  సీరియల్స్ టూ సినిమాస్...
బాపుగారి బుడుగు టివి సీరియల్‌లో నటించే అవకాశం వచ్చినప్పుడు నాకు 24 ఏళ్లు. అప్పటి నుంచి ఇక వెనుతిరిగి చూడకుండా 17కి పైగా సీరియల్స్ చేశాను. మనసు చూడతరమా? పుత్తడిబొమ్మ, గోరింటాకు, మేఘమాల... ఇలాంటి సూపర్‌హిట్స్ ఉన్నాయి. యండమూరి లేడీస్ హాస్టల్‌లో మెయిన్ క్యారెక్టర్ చేశాను. ఒకేసారి 6 సీరియల్స్‌కి చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రోజుల్లోనూ ఇతర అభిరుచుల్ని, కొత్తవి నేర్చుకోవడాన్ని మానలేదు. సీనియర్‌దర్శకుడు కోదంరామిరెడ్డి తీసిన 2 షార్ట్ ఫిల్మ్స్‌లో లీడ్‌రోల్స్ చేశాను. ఇక ఇప్పుడు సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టాను. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన స్నేహగీతం సహా ఇప్పటిదాకా 15 సినిమాల వరకూ చేసుంటాను. ఓ మనసు, రాంగ్‌రూట్, అక్షరం, సతీ తిమ్మమాంబ తదితర చిత్రాల్లో నటిస్తున్నాను. అగ్నిసాక్షిగా, దర్శక నిర్మాత మధుర శ్రీధర్ రూపొందించిన లేడీస్ అండ్ జెంటిల్మన్ విడుదల కానున్నాయి. కమెడియన్‌గా, విలన్‌గా, కామెడీ విలన్‌గా చేయాలనే కోరిక తీరాలి.

  ఏ స్టేజ్‌లో ఉన్నా స్టేజ్ మీదే...
షూటింగ్ లేకపోతే యాంకరింగ్ అది లేకపోతే మిమిక్రీ, అది లేకపోతే ఎమ్సీగా...  ఇలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. అభినయాన్ని, హాస్యాన్ని కలబోసిన స్టాండప్ కామెడీని అందించే అతితక్కువ తెలుగు స్టేజ్ పెర్ఫార్మర్‌లలో ఒకడిని అయ్యాను. దాదాపు 13 సంవత్సరాల పాటు ల్యాంకో సంస్థలో రిక్రియేషన్ అంబాసిడర్‌గా చేశాను. తాజాగా బేస్ థింగ్స్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఎంపికయ్యా. ప్రసాద్ అనే స్నేహితుడితో కలిసి పిఎల్ మీడియా వర్క్స్ బేనర్ మీద సినిమా నిర్మాణంలోకి కూడా ప్రవేశించాను.

 ‘ఎప్పటి నుంచో చూస్తున్నాం... ఇంకా అంతే యంగ్‌గా కనిపిస్తున్నావ్’ అని ఫ్రెండ్స్ నన్ను అంటుంటారు. చేసే పనిలో రొటీన్ ఫీలింగ్ లేకపోతే బోర్ ఉండదు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఎగ్జయిట్‌మెంట్ అందుకుంటుంటే... అదే టానిక్‌లా పనిచేసి మనల్ని నిత్య యవ్వనులుగా ఉంచుతుందని నా నమ్మకం.  - ఎస్.సత్యబాబు

మరిన్ని వార్తలు