దీర్ఘకాలిక యౌవనాన్ని ఇచ్చే చిలగడదుంప!

6 Dec, 2017 23:29 IST|Sakshi

గుడ్‌ఫుడ్‌

చిలగడదుంపను కొన్ని ప్రాంతాల్లో మోరం గడ్డ అనీ, మరికొన్ని చోట్ల గణుసుగడ్డ అని కూడా పిలుస్తారు. దీర్ఘకాలం యౌవనంగా ఉండేలా చేసే గుణం చిలగడదుంపలో ఉంది. సాధారణంగా చాలా రకాల దుంపలను డయాబెటిస్‌ రోగులు తీసుకోకూడదని అంటారు. కానీ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువగా ఉండటం వల్ల చిలగడదుంపలను డయాబెటిస్‌ ఉన్నవారూ పరిమితంగా తీసుకోవచ్చని న్యూట్రిషన్‌ నిపుణుల మాట. దీంతో ఒనగూనే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలివి...

►చిలగడదుంప చర్మంలోని కణాలను గట్టిగా దగ్గరగా పట్టి ఉంచే కొలాజెన్‌ ఉత్పత్తికి విటమిన్‌–సి బాగా దోహదపడుతుంది. ఈ కారణం వల్లనే విటమిన్‌–సి పోషకాలను పుష్కలంగా తీసుకునేవారి చర్మం చాలా కాలం యౌవనంగా ఉంటుంది. దీనిలోనూ  విటమిన్‌–సి పాళ్లు ఎక్కువ. అందుకే దీన్ని తినేవారి చర్మం అంత త్వరగా ఏజింగ్‌ దుష్ప్రభావాలకు గురికాదు.

►చిలగడదుంపలో శరీరంలోని విషాలను బయటకు పంపే గుణం కూడా ఉంది.  ఒత్తిడితో పాటు అనేక కారణాలతో ఒంట్లో పేరుకునే విషాలను కూడా చిలగడదుంప సమర్థంగా తొలగిస్తుంది. ఈ కారణంగానే దీన్ని తినేవారిలో ఏజింగ్‌ ప్రక్రియ చాలా ఆలస్యంగా జరగడం, తద్వారా దీర్ఘకాలం యౌవనంగా ఉండటం సాధ్యపడుతుంది.

►చిలగడదుంపలో ఐరన్‌ పాళ్లు ఎక్కువ. అందుకే రక్తహీనత ఉన్నవారు దీన్ని తీసుకోవడం వల్ల ఒంట్లో రక్తహీనత తగ్గుతుంది. అంతేకాదు... ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాల ఉత్పత్తి పెరుగుతుంది.

►చిలగడదుంపలోని మెగ్నీషియమ్‌... ధమనులు, ఎముకలు, గుండె, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది.

మరిన్ని వార్తలు