స్వేదం చిందించనిదే  సంపద దక్కుతుందా? 

28 Feb, 2019 02:54 IST|Sakshi

చెట్టు నీడ 

కుశాల్‌ చంద్‌ బాబా భక్తుడు. తెల్లవారింది మొదలు పొద్దుపోయే వరకు షిడ్డీలోని మసీదే అతని ఆవాసం. ఏ పనీ చేయకుండా మసీదులోనే గడిపేవాడు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో బాబాకు హారతి ఇచ్చేటప్పుడు పంచే ప్రసాదంతో కడుపు నింపుకునేవాడు. చాలాకాలం పాటు బాబా అతని వాలకాన్ని గమనించారు. ఇలా అయితే లాభం లేదనుకుని ఒకరోజు కుశాల్‌చంద్‌ని దగ్గరకు పిలిచి, ‘‘నీకు పొలం ఉంది కదా! అందులో పంటలు పండించడం లేదా?’’ అని అడిగారు. ‘‘లేదు బాబా! అది మొత్తం బీడు పడింది. పంటలు పండవు’’ కుశాల్‌ చంద్‌ చెప్పాడు. ‘‘భలేవాడివే! నీ పొలంలో లంకెబిందెలు ఉన్నాయయ్యా! వెంటనే పొలాన్ని మొత్తం దున్ను’’ అని బాబా అతనికి చెప్పారు. 

కుశాల్‌ చంద్‌ పొలం మొత్తం దున్ని లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. బాబా ఆశ్చర్యం నటిస్తూ ‘‘దొరకలేదా? ఇంతకీ పొలాన్ని ఎటునుంచి దున్నావ్‌’’ అని అడిగారు. కుశాల్‌చంద్‌ నిలువుగా దున్నానని చెప్పగానే, ‘‘ఈసారి అడ్డంగా దున్ని చూడు. తప్పకుండా దొరుకుతాయి’’ అని బాబా చెప్పారు. కుశాల్‌చంద్‌ అలా  కూడా చేసి లంకెబిందెలు దొరకలేదని చెప్పాడు. ‘‘సరే, దొరక్కపోతే ఏం చేస్తాం! ఎలాగూ పొలాన్ని మొత్తం దున్నావు కాబట్టి అందులో మిరప విత్తనాలు చల్లు’’ అని సూచించారు బాబా. కుశాల్‌చంద్‌ అలాగే చేశాడు. బాబా సలహా సూచనలతో పంటను పెంచి పోషించాడు. ఆ ఏడాది సమీపంలో ఎక్కడా మిరప పంటన్నదే లేదు. కుశాల్‌చంద్‌ ఒక్కడే పండించాడు.

దీంతో అతని పంటకు విపరీతమైన గిరాకీ ఏర్పడి లాభాలు ఇబ్బడి ముబ్బడిగా వచ్చాయి. కుశాల్‌చంద్‌ తనకొచ్చిన సొమ్మును రెండు మూటలుగా కట్టి బాబా ముందుంచాడు. సుఖం, కోరికలు, సంపద, కీర్తిప్రతిష్ఠలు ఏవైనా సరే ఆయాచితంగా లభించవు. దేనినైనా ప్రయత్నంతోనే సాధించుకోవాలి. స్వేదం చిందించనిదే సంపద దక్కదు. సాధన చేయనిదే ఏదీ సాధ్యం కాదు. భక్తి మంచిదే కానీ దాని పేరుతో పని మానుకోవడం మహా చెడ్డం. పనిపాటలు చేసుకుంటూనే భగవంతుని నామాన్ని నిత్యం స్మరించుకో. ఇక నువ్వు చేసే పనికి తిరుగుండదు. నీ పనికీ ఆటంకం ఉండదు’’అని బోధించారు విపులంగా. 
డా. కుమార్‌ అన్నవరపు

మరిన్ని వార్తలు