రెండో వైపు కూడా చూడాలి

6 Jun, 2020 02:27 IST|Sakshi

అమెరికాలో ప్రస్తుతం సాగుతున్న జాత్యంహకార దాడులకు కారణమైన ఘటనలో బాధితుడైన ఫ్లాయిడ్‌ను అమరుడిగా చిత్రించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయా! దీని వెనుక రాజకీయ కోణం ఉందా! కొన్ని ప్రశ్నలకు సమాధానం ఉండదు. పరిస్థితులు, పరిణామాలను బట్టి అర్థం చేసుకోవాల్సిందే. కొన్ని విషయాలలో ఎవరికి వారు సొంత భాష్యాలు చెప్పుకుంటుంటారు. ఇప్పటి వరకూ జార్జ్‌ ఫ్లాయిడ్‌ అమరుడంటూ అమెరికాలో ఉన్న నల్ల జాతీయులు నీరాజనాలు పట్టారు. ఇప్పుడు ఇందుకు భిన్నమైన కోణం ఆవిష్కృతమైంది. అది కూడా ఒక ఆఫ్రికన్‌ అమెరికన్‌ నోటినుంచి రావటం విశేషం. ‘ఆయనను అమరుడిని చేయకండి, ఆయన ఒక కరడుగట్టిన నేరస్థుడు’ అంటూ కన్సర్వేటివ్‌ కామెంటేటర్‌ క్యాన్‌డేస్‌ ఓవెన్స్‌ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అమెరికాలో సంచలనాన్ని సృష్టిస్తోంది. ‘అతడో క్రిమినల్‌. అతడిపై ర్యాప్‌ షీట్‌ ఉంది. అతడు మరణించే వరకు నేరస్థుడుగానే ఉన్నాడు’ అంటూ తన వీడియోలో వివరించారు ఆమె.

నాణానికి బొమ్మ బొరుసు ఉన్నట్లే అన్ని అంశాలలోనూ మంచి చెడు రెండూ ఉంటాయి. ఫ్లాయిడ్‌లో కూడా మంచిచెడులు ఉన్నాయి. కాకపోతే చెడు కాస్తంత కాదు బాగా ఎక్కువగానే ఉంది... అంటూ ఫ్లాయిడ్‌ చేసిన అరాచకాలను, అకృత్యాలను ఏకరువు పెట్టారు ఓవెన్స్‌. అదే సమయంలో ఫ్లాయిడ్‌ను హత్య చేయటాన్ని తాను సమర్థించటం లేదని కూడా అంటున్నారు ఓవెన్స్‌. ఎవరి ఊహకూ అందని విధంగా ఫ్లాయిడ్‌ పైశాచిక హత్యకు గురయ్యాడు. అతని మెడను ఓ తెల్ల పోలీసు కాలితో నొక్కి పెట్టడంతో ఊపిరాడక మరణించాడన్న విషయం తెలిసిందే. ‘కారణం ఏదైతేనేం, నేరస్థుల్ని రాత్రికి రాత్రే హీరోలను చేయటం ఐదారు సంవత్సరాలుగా ఒక ఫ్యాషన్‌గా మారింది. నేను ఇటువంటి వాటికి వ్యతిరేకం. అయోగ్యులను యోగ్యులుగా మార్చేయటం నా మనసుని కలచి వేస్తోంది. ఇలా చూపించే ట్రెండ్‌ నాకు నచ్చట్లేదు. ఎక్కడ అన్యాయం జరిగినా నా మనసు గాయపడుతుంది. ఫ్లాయిడ్‌ విషయంలో ‘అతడిది వీరోచితమైన జీవితం’ అంటూ అందరూ అతడిని పొగుడుండటం నాకు నచ్చలేదు.

అతడి నేర చరిత్ర గురించి తెలిసి కూడా ఇలా మాట్లాడటం బాధ కలిగించింది. ఆయుధాలతో దాడి చేసి, ఒక మహిళ ఇంట్లో దొంగతనం చేసిన నేరానికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. అక్కడ నుంచి విడుదలయ్యాక, జీవనం కోసం సిగరెట్లు అమ్మాడు. వాటిలో డ్రగ్స్‌ నింపాడని అతడి మీద అభియోగం ఉంది. అయితే అతడు ఎంతటి దుర్మార్గుడైనా, అంత క్రూరంగా చంపటాన్ని సమర్థించను. ఇన్ని నేరాలు చేసిన ఫ్లాయిడ్‌ని అమరుడిని చేయటం మాత్రమే సరికాదని చెబుతున్నాను.’ అంటూ బాధతో నిండిన గొంతుతో పద్దెనిమిది నిమిషాల వీడియో విడుదల చేశారు క్యాన్‌డేస్‌ ఓవెన్స్‌. ఈ వీడియో మీద పలు విమర్శలు, ప్రశంసలూ కూడా వచ్చాయి. ఒక వ్యక్తి జీవితంలో ఉన్న రెండు కోణాలనూ చర్చించాలనేది ఓవెన్స్‌ అభిప్రాయం. అతని అభిప్రాయాన్ని అందరూ అంగీకరించాలని కానీ ఏకీభవించాలని కానీ లేదు. కుక్కను చంపాలంటే అది పిచ్చిదని ముద్రవేయాలనే సూత్రం అందరికీ తెలిసిందే. అమెరికాలో ఇందుకు రివర్స్‌ పాలిటిక్స్‌ ప్లే చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనం పొందటానికి ఫ్లాయిడ్‌ వంటి నేరస్థుడిని అమరుడిగా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారనేది ఓవెన్స్‌ అభిప్రాయం.

మరిన్ని వార్తలు