భౌ... వావ్!

26 Jul, 2016 00:36 IST|Sakshi
భౌ... వావ్!

టెక్ టాక్
 
‘‘మనసున మనసై... బతుకున బతుకై.. తోడొకరుండిన అదే భాగ్యమూ అదే సౌఖ్యమూ’’ పాతకాలం సినిమా పాట ఇది. ఫొటోలో కనిపిస్తున్న డామ్గీ రోబోకు... ఈ వర్ణన అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. ఎందుకంటారా? ఈ రోబో కుక్కపిల్ల కూడా మీ ఇంట్లో ఎల్లప్పుడూ మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది కాబట్టి! అంతలేసి కళ్లు మిటకరిస్తూ... ఇంట్లో ఉన్నవారందరి పేర్లు, ముఖాలు గుర్తుపెట్టుకోవడమే కాకుండా.. అందుకు తగ్గట్టుగా పలకరిస్తుంది కూడా. మీ ముఖంలో ఫీలింగ్స్‌ను పసిగట్టి ఒకవేళ మీ మూడ్ బాగా లేదనుకుంటే మంచి సంగీతం వినిపిస్తుంది.. లేదా మీకిష్టమైన పనేదో చేసి మిమ్మల్ని మామూలు మూడ్‌లోకి తెచ్చేస్తుంది. అంతేకాదు.. ఒకవేళ ఇంట్లో ఎవరూ లేరనుకోండి.. ఇల్లంతా కలియదిరుగుతూ కొత్తవాళ్లెవరూ చొరబడకుండా కాపలా కాస్తూ ఉంటుంది కూడా.

దీని ప్రత్యేకతలు ఇంకా ఉన్నాయి. మీరు సోఫాలో జారగిలబడి టీవీ చూస్తున్నప్పుడు.. ఛానల్ మార్చేందుకు కూడా బద్దకించే వేళ డామ్గీ మీ టీవీ రిమోట్ అయిపోతుంది. ఒక్క మాటతో నచ్చిన ఛానల్‌ను తెరపైకి తెచ్చేస్తుంది. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతూంటే.. తానంతటతనే ప్లగ్ ఎక్కడుందో వెతుక్కుని రీఛార్జ్ చేసుకుంటుంది కూడా. అన్నిటికన్నా సదుపాయం... మనం ఈ కుక్కపిల్ల మూతీ ముక్కు తుడిచే పని లేదు. బయట ఎక్కడికీ తిప్పనవసరం లేదు. రూబో అనే చైనీస్ కంపెనీ తయారు చేసిన ఈ తొమ్మిది అంగుళాల రోబో కుక్కపిల్ల త్వరలోనే మార్కెట్‌లోకి రాబోతోంది.
 

>
మరిన్ని వార్తలు