సహజ లక్షణాలు

23 Nov, 2017 23:41 IST|Sakshi

ఒక వ్యక్తి సుగుణాలతో శోభిల్లితే సంఘంలో అతనికి గౌరవ మర్యాదలుంటాయనడానికి రాముడే ఉదాహరణ. మహిమలు, మహత్యాలు చూపలేదు. కేవలం మానవమాత్రుడిగా మనలో ఒకడిగా కార్య నిర్వహణ చేశాడు. మనిషిగానే సాధించాడు. రాజ వంశంలో జన్మించిన రాముడికి, అవతలి వారు తనను పలకరించే వరకు వేచి చూడక తానే చిరునవ్వుతో పలకరించేవాడట. నవ్వు మనసులను, మనుషులను దగ్గర చేస్తుంది. కాగల కార్యం నెరవేరుస్తుంది. ఇప్పటి వ్యక్తిత్వ వికాస తరగతుల్లో చెప్పేదదే! రాముడికి తండ్రి మాట వేదం. తల్లిదండ్రులను గౌరవిస్తూ వారి మాటలను శిరసా వహిస్తే, అవే అందరకు ఆశీర్వచనాలు.

రాముడిలోని మరో లక్షణం స్థిరచిత్తం. తన తండ్రి మాట నెరవేర్చడంలోనూ, ‘రాజ్యపాలనకు అంగీకరించమ’న్న భరతుని అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించడంలోనూ, సీతాపరిత్యాగంలోనూ, ఏకపత్నీవ్రతంలోనూ, సుగ్రీవునకు మాటిచ్చి వాలిని హతమార్చడంలోనూ, రావణుడిని యుద్ధంలో సంహరించి సీతను తిరిగి తెచ్చుకోవడమనే సందర్భాల్లోనూ రాముని స్థిరచిత్తం స్పష్టంగా గోచరమవుతుంది. మనసు ఊయలలా ఊగులాడకుండా, అంకితభావంతో అనుకున్నది నెరవేర్చుకోవడమే లక్ష్యసాధన. దానికి త్రేతాయుగ కాలంలోనే అంకురార్పణ జరిగింది. హనుమంతుడు రాముని గుణగణాలను సీతకు వర్ణించి చెబుతూ ‘తన నడవడికను తనే సమీక్షించుకునేవాడు’ అని చెబుతాడు. అంటే తనలోని లోటుపాట్లను తెలుసుకుని చక్కదిద్దుకునే గొప్ప వ్యక్తిత్వం గలవాడు రాముడు.

మన లోపాలు మనకు తెలిసుండి కూడా అహంకారంతో సంస్కరించుకోకుండా ఉండే వాళ్లకు ఆయన వ్యక్తిత్వం ఓ పాఠం. అదేవిధంగా ఎంత అవసరమో అంతే మాట్లాడడం, ఎలాంటి పరిస్థితుల్లోనూ అప్రియంగా మాట్లాడకపోవడం, శత్రుశిబిరం నుంచి వచ్చినా (విభీషణుడు) నమ్మి ఆదరించడం, సముద్రుడి మీద కోపంతో బ్రహ్మాస్త్రం ఎక్కుబెట్టినా, కోపం తగ్గాక మరోవైపు ప్రయోగించడం, తనకు అన్యాయం చేసినా.. కైకను ఒక్క పరుషపు మాట అనకుండా గౌరవించడం ఇవన్నీ రామచంద్రుడి సహజాభరణాలు. భ్రాతృప్రేమను రుచి చూపి లక్ష్మణుని సహవాసిగా చేసుకున్నాడు. గుణ సంపదతో హనుమను ఆకట్టుకుని సేవకుడిని చేసుకున్నాడు. అందుకే ఆయనకు దేవుడని పట్టంగట్టి వదిలెయ్యకుండా మనలో ఒకడిగా చూసుకుంటున్నాం. శ్రీరాముడి గుణసంపదలోంచి మనం కొన్ని గుణాలు అలవర్చుకున్నా, వ్యక్తిత్వ శోభతో సమాజంలో వెలుగొందుతాం. ఇదే శ్రీరాముడు చూపిన మార్గం.

మరిన్ని వార్తలు