శ్రీ సౌమ్యరామ

31 Jan, 2019 00:26 IST|Sakshi

చెట్టు నీడ

ఎంత కోపం వచ్చినప్పటికీ, రాముడు విచక్షణ కోల్పోయిన సందర్భాలు లేవు. తనను అరణ్యవాసం చేయమన్న కైకను ఎందరు ఎన్ని విధాల దూషించినప్పటికీ, తాను మాత్రం తూలనాడలేదు రాముడు. దశరథుడు, కౌసల్య, లక్ష్మణుడు, అయోధ్యాపురవాసులు ఆఖరికి కన్నకొడుకయిన భరతుడు కూడా కైకను నిందిస్తారు. అయినా రాముడు వారందరినీ వారిస్తూ ‘‘ఇప్పటివరకూ కైక నన్ను కన్నకొడుకు కన్నా ఎక్కువగా ఆదరించింది. ఇప్పుడు మాత్రమే ఆమె ఇలా ప్రవర్తిస్తోందంటే దైవ నిర్ణయమే తప్ప వేరు కాదు. దశరథుడు కూడా ధర్మానికి, ఇక్ష్వాకువంశ రాజుల సత్యనిష్ఠకు కట్టుబడి కైక కోరికలకు తలవంచాడే తప్ప, వాంఛకు వశుడై కాదు. తల్లిదండ్రుల మాటను గౌరవించాల్సిన ధర్మం నా మీద ఉంది కాబట్టి తనకు పెద్దకొడుకుగా రాజ్యాధికారం ఉన్నా, అరణ్యవాసమే మిన్న’’ అని అడవులకు వెళ్లాడు.
భరతుడు రాముని అయోధ్యకు తీసుకురావడానికి తన మాతలతో, వశిష్టాది గురువులతో, పెద్ద సైన్యంతో అడవికి వస్తున్నప్పుడు, లక్ష్మణుడు అనుమానించి, కోపోద్రిక్తుడై భరతుడి మీద యుద్ధానికి సిద్ధపడినప్పుడు, రాముడు భరతుని పట్ల కోపం తెచ్చుకోకుండా అతని నిజాయితీని సరిగ్గా అంచనా వేశాడు.

అధర్మం ఎవరు చెప్పినా రామునికి కోపం వస్తుంది. ‘తండ్రి అయినా సరే, చనిపోయిన దశరథుని మాట మన్నించనక్కరలేదు’ అని జాబాలి అనే పురోహితుడు చెప్పినప్పుడు, రామునికి కోపం వచ్చింది. కానీ తొందరపడకుండా శాంతవాక్యాలతోనే జాబాలిని ఖండించాడు.ఇక సుగ్రీవుడు తనకు రాముడిచ్చిన గడువు పూర్తయినప్పటికీ, భోగాలలో మునిగి తేలుతూ, సీతాన్వేషణ ఇంకా మొదలుపెట్టక పోవడంతో రామునికి కోపం వస్తుంది. కానీ దానిని అణచుకుంటాడు. ‘‘మిత్రుడు కాబట్టి మెల్లగా చెప్దాము, ఒక అవకాశం ఇద్దాము. అయినా వినకపోతుంటే అప్పుడు ‘వాలి వెళ్లిన దారిలోనే నిన్నూ పంపిస్తాము’ అని’’ చెప్పి రమ్మని లక్ష్మణుని పంపిస్తాడు. అదే వాలి విషయానికి వచ్చేసరికి అతడు అధర్మాన్నే అనుసరించాడు కాబట్టి హెచ్చరికలు లేకుండా శిక్షిస్తాడు. ఇక్కడ సుగ్రీవునిది కర్తవ్య నిర్వహణా లోపం, వాలిది అధర్మం. కర్తవ్య నిర్వహణలో పొరపాటు సహించవచ్చు కాని, అధర్మాన్ని మాత్రం సహించకూడదని రాముడు తన చేతల ద్వారా చెప్పాడు. పై మూడు సంఘటనలలో రాముడు ఎవరిమీద కోపం తెచ్చుకోకూడదో, కోపం వచ్చినా దాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలో చెప్తున్నాడు. మనం శ్రీరామచంద్రమూర్తి నుండి నేర్చుకోవలసినది అదే.
– డి.వి.ఆర్‌. 

మరిన్ని వార్తలు