విశ్వవ్యాపకుడు... భక్తసులభుడు

31 Aug, 2013 01:02 IST|Sakshi
విశ్వవ్యాపకుడు... భక్తసులభుడు

వైకుంఠం శ్రీమన్నారాయణుని నిత్య నిజనివాసం. శ్రీ మహాలక్ష్మి ఆయన వక్షస్థలంపై విరాజిల్లుతుంది. ఆ తల్లికి చిహ్నంగా శ్రీవత్సం అనే పుట్టుమచ్చ ఆ దేవదేవుని వక్షస్థలాన్ని అలంకరిస్తుంది. విరాట్పురుషునిగా వేదం కొనియాడిన చతుర్మూర్తి విష్ణుభగవానుడు. శంఖ, చక్ర, గదా, పద్మాలు హరి నాలుగు బాహువులనూ అలంకరించి ప్రాణికోటికి ఆ శబ్దస్పర్శరూపరసగంధాలనూ, ధర్మార్థ కామమోక్షాలను ప్రసాదించే నాలుగు వరాలై అలరారుతున్నాయి.

 అమృతం నిండిన రెక్కలతో, వాయువేగంతో సంచరించే సుపర్ణుడు గరుడుడు. సప్తలోకాల్లో అమృతం పంచిపెట్టే అమృతహృదయుడైన శ్రీహరి వాహనమే గరుత్మంతుడు. విశ్వవృక్షానికి వేదాలు ఆకులవంటివి. ఈ మహావృక్షంపై రెండు పక్షులుంటాయి. అందులో ఒకటి కమ్మని పండ్లను ఆరగిస్తుంది. మరొక పక్షి అది చూసి ఆనందిస్తుంది. ఆనందాన్ని గ్రోలే పక్షియే సుపర్ణం. అదే ఆ దేవదేవుని దివ్యవాహనం. పంచభూతాలతో కూడిన పార్థివ శరీరమే పాంచజన్యం. అదే పరిసరాలను పావనం చేసే సామర్థ్యం గల పరంధాముడు వినిపించే శంఖధ్వని.
లోకాన్నంతా ఆనందనిలయంగా మార్చే దివ్యమైన ఆయుధం నందకం అనే ఖడ్గం. ధర్మసంస్థాపనే ఖడ్గసృష్టికి సార్థకం.

 ప్రపంచ వలయంలోని చలనాన్ని, గమనాన్ని, అరవింద సుందర సౌందర్యాన్ని, హరి అరచేతిలో చిటికెనవేలి చివరన ఆవిష్కరించగలిగేదే సుదర్శనచక్రం. సంసార చక్రంలోని సారమంతా సుదర్శనచక్రంలో ప్రస్ఫుటమవుతుంది. శారఙ్గం అనే ధనువు ద్వారా బ్రహ్మపదార్థమనే లక్ష్యాన్ని ఆత్మ అనే బాణంతో ఛేదించి ఆత్మానుభూతి కలిగించే మహా ప్రహరీణాయుధుడు గోవిందుడు. పరబ్రహ్మ నోట వెలువడిన వాక్కే కౌమోదకి గద. ప్రపంచంలోని తియ్యని నాదాలకు ఆమోదమై, కువలయానికి మోదమై, పరంధాముని చేతిలో ఒప్పారే దివ్యాయుధం కౌమోదకి.
 
లోకయాత్రకు అనుగుణంగా అనేక రథాలను సృష్టించి రథచక్రాలను తన చేతిలో అట్టిపెట్టుకునే రథాంగపాణి శ్రీమహావిష్ణువు. సంసార గమనాన్ని నిశ్చలంగా నడిపించే సర్వలోకసారథియై వెలిగే పరంజ్యోతి.
 
సమస్తాన్నీ ప్రపంచానికి అందించే జగజ్జేత శ్రీమన్నారాయణునికి ఫలం పత్రం పుష్పం తోయం ఏదైనా భక్తితో సమర్పిస్తే తృప్తిగా స్వీకరించే భక్తసులభుడు. కానీ ఎక్కడ తలచుకుంటే అక్కడ ప్రభవించే విష్ణుదేవుని స్మరిస్తే చాలు... జన్మ సంసారబంధం తొలగిపోతుందట. విశ్వమంతటా వ్యాపించిన విభుడు శ్రీ మహావిష్ణువు దివ్యలీలా ప్రాభవం అవాజ్ఞ్మానస గోచరం.
 
- ఇట్టేడు అర్కనందనాదేవి
 

మరిన్ని వార్తలు