పోగొట్టుకున్న ఆస్తి

12 Dec, 2016 14:48 IST|Sakshi
పోగొట్టుకున్న ఆస్తి

సంపాదించుకోవడానికి ఎన్నో ఉన్నాయి.
ఆస్తి, గౌరవం, హోదా, పరపతి...
ఇవన్నీ అలాగే పోగొట్టుకోవచ్చు కూడా!
మరి, సంపాదించి... పోగొట్టుకోనిది ఏదైనా ఉందా? ఉంది...
దాన్నే ‘బంధం’ అంటారు.
కట్టుకున్నవారితో బంధం... కన్నవారితో బంధంలో...
అనుబంధం లేకపోతే?
అన్నీ ఉండీ ఏమీ లేనట్టే! అన్నింటి కన్నా గొప్ప ఆస్తి పోగొట్టుకున్నట్టే!!

పరంధామయ్య పొయ్యి మీద పాలు మరగపెడుతున్నాడు. గిన్నె చేజారి, కాళ్ల మీద పడింది. చర్మం కాలి, బొబ్బలు వచ్చేశాయి. విపరీతమైన మంట, నొప్పితో విలవిల్లాడిపోయాడు. కుంటుకుంటూ వెళ్లి మంచమ్మీద జారిగిలబడ్డాడు. భార్య సుశీల గుర్తుకు వచ్చింది. ‘తను చనిపోయి ఐదేళ్లు అవుతోంది. డెబ్భై ఏళ్ల వయసులో ఒక్కణ్ణే అయిపోయాను. ఇంత ఇంట్లో పిలిస్తే పలకడానికి కూడా ఎవరూ లేరు’ అనుకుంటుండగా బయట ఏవో పెద్ద పెద్ద అరుపులు వినిపించాయి. కుంటుకుంటూనే మెల్లగా బయటకు వచ్చాడు. వాళ్లను చూడగానే గుండెలో ఏదో గుబులుగా అనిపించింది. వాళ్లు తన కొడుకులు రమేష్, సురేష్.

భయపెట్టే బంధాలు
రమేష్ లోపలికి వస్తూనే ‘ఏంటీ, ఇంటి కొనుగోలుకు మనిషిని పంపిస్తే నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడావంట.’ దబాయిస్తున్న కొడుకు వైపు విస్మయంగా చూశాడు. ‘నా ముందు నిల్చోవడానికి కూడా భయపడేవాడు, వీడేనా ఇన్ని మాటలు అంటోంది..’ అనుకుంటూ నిల్చోలేక అక్కడే ఉన్న కుర్చీలో కూలబడ్డాడు.  ‘ఈ ఇల్లేమీ నీ సంపాదన కాదుగా? ఆల్రెడీ వాడికి డబ్బు ఇచ్చేశావు. ఈ ఇంటిని నాకే ఇవ్వాలి..’ అంటున్న చిన్న కొడుకు సురేష్‌కేసి నిర్వేదంగా చూశాడు. ‘ఈ ఇల్లు నీ ఒక్కడికే చెందుతుందా? నువ్వొక్కడివేనా ఆయన కొడుకివి’ అంటూ తమ్ముడిపై విరుచుకుపడ్డాడు రమేష్. ఇద్దరూ ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ, కొట్టుకుంటున్నారు. ఊళ్లో నలుగురూ పోగయ్యారు. ‘‘వచ్చేవారమే ఇంటి రిజిస్ట్రేషన్. వచ్చి సంతకాలు పెట్టు’’ అంటూ విసురుగా వెళ్లిపోయాడు రమేష్. చిన్న కొడుకు కూడా వచ్చిన దారి పట్టాడు. పరంధామయ్య స్థితి చూసిన పెద్దమనుషులు ‘‘ఈ వయసులో నీకెందుకయ్యా ఈ కష్టం. ఒక్కడివే ఎన్ని పాట్లని పడతావు. ఇల్లు అమ్మేసి కొడుకుల దగ్గరే ఉండు. చూడు కాళ్లు బొబ్బలెలా వచ్చాయో..!’’  సానుభూతిగా మాట్లాడుతున్న వాళ్లవైపు చూసి, మెల్లగా లోపలికెళ్లిపోయాడు పరంధామయ్య. సంపాదన కోసం కష్టపడ్డ రోజులన్నీ గుర్తొచ్చాయి పరంధామయ్యకు.

సంపాదన మైకం
భార్య, ఇద్దరు కొడుకులు... ‘బాగా సంపాదించాలి, ఊళ్లో అందరి కన్నా ధనవంతుడి’ని కావాలని కలగన్నాడు. ఉన్న కొద్ది భూమి అమ్మేసి ఆ డబ్బును ఇనుము వ్యాపారంలో పెట్టాడు. రేయింబవళ్లు కష్టపడ్డాడు. రెండేళ్లకే ఉన్న ఇంటిపై మరో ఇల్లు వేశాడు. పిల్లలను పట్నంలో పెట్టి చదివించాడు. ఎప్పుడూ పని ధ్యాసే. పైసకు పైస చేర్చి టౌన్‌లో ప్లాట్లు కొన్నాడు. భార్య అప్పుడప్పుడు అంటుండేది ‘ఏనాడూ బుక్కెడు తిండి కుదురుగా కూర్చుని తిన్నది లేద’ని. ఆ మాటలు పట్టించుకునేవాడు కాదు. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. పెళ్ళిళ్లు అయ్యాయి. ఇద్దరూ వ్యాపారాలే చేస్తున్నారు. ఇద్దరూ పట్నంలో ఉండడం వల్ల ఎప్పుడో చుట్టపుచూపుగా వచ్చిపోయేవాళ్లు. కోడళ్ళిద్దరికీ పడదు. వాళ్లు వచ్చి కూడా నాలుగేళ్లకు పైగా అయింది. ఇక మనవలు, మనవరాళ్లు సరే సరి. భార్య ఐదేళ్ల కిందట చనిపోయింది. అప్పటి నుంచి ఆస్తులు పంచమని కొడుకుల గొడవ. ఈ ఇల్లు ‘అమ్మే ద్దాం..’ అంటున్నాడు రమేష్. ‘ఈ ఇల్లు నాకే కావాలి’ అని వాదిస్తున్నాడు సురేష్. ఇక్కడే అన్నదమ్ములిద్దరికీ పడటం లేదు. కంటి మీద కునుకు లేదు.. బొబ్బలెక్కిన కాళ్లు మండుతున్నాయి.

ఇకనైనా తెలుస్తుందా!
కళ్లు తెరిచేసరికి తనెక్కడో ఉన్నట్టు అర్థమైంది పరంధామయ్యకు. ఆశ్చర్యంగా చూస్తుంటే ‘అంకుల్! మీకు రెండ్రోజులుగా విపరీతమైన జ్వరం. ఊళ్లో వాళ్లు ఫోన్ చేసి మీ గురించి చెప్పారు. మీ ఇంటి పరిస్థితి తెలుసు కదా! చూసెల్దామని వచ్చాను. మీరు స్పృహలో లేరు. వెంటనే ఇక్కడికి తీసుకొచ్చాను..’ అని వర్ధన్ చెబుతుంటే కళ్లనీళ్లు ఆగలేదు పరంధామయ్యకు. తను సాయపడిన ప్రసాద్ కొడుకు వర్ధన్. ప్రసాద్ చనిపోయి ఆరేళ్లు అయ్యింది. కానీ, అతని కొడుకు తనను మర్చిపోలేదు. ‘నిన్ను చూస్తుంటే మనసు నిండిపోతుందయ్యా. నా కొడుకులు సంపాదించిందంతా పట్టుకుపోయారు. ఇంకా కావాలంటున్నారు. నన్ను ఒంటరివాడిని చేశారు’అంటూ కుమిలిపోతున్న పరంధామయ్యను ఓదార్చాడు వర్ధన్.

కర్మ రుణాలు
‘‘ఎక్కడకొచ్చాం’’ ఆ క్లినిక్‌ను చూసి వర్ధన్‌ని అడిగాడు పరంధామయ్య. ‘‘అంకుల్! ఇది గతం గురించి తెలుసుకొని, సాంత్వన చెందే చోటు. మీరు మా నాన్నగారు నిలదొక్కుకోవడానికి సాయపడ్డారు. ఇప్పుడు మీ బాధ పోగొట్టడానికి నేను సాయపడాలనే ఇక్కడకు తీసుకువచ్చాను’’ అంటూ కౌన్సెలర్‌ను పరిచయం చేశాడు వర్ధన్. రిగ్రెషన్ థెరపీ గురించి అంతా తెలుసుకున్న పరంధామయ్య తన బాధల్ని తొలగించమని కోరాడు.

కర్మలు పునరావృతం
తన గత జీవితాన్ని తనే చేతనత్వంతో దర్శిస్తున్నాడు పరంధామయ్య. థెరపీ మొదలయిన కొద్దిసేపటికి అతని మనోఫలకం మీద ఏవేవో దృశ్యాలు.. వాటి గురించి చెబుతున్నాడు. ఐదేళ్ల క్రితం... ‘నా భార్య సుగుణ చావు బతుకుల్లో ఉంది. తన దగ్గర కాసేపు కూర్చోమంది. అప్పుడే బయట నుంచి ఫోన్ వచ్చింది. వెళ్లక తప్పనిస్థితి. చె య్యి పట్టుకొని ఆపింది. ‘ఎన్నాళ్లు సంపాదనంటూ తిరుగుతావు! ఈ రోజైనా ఉండకూడదా! సంచీ నిండా డబ్బు తెచ్చుకోవాలని చూస్తావు. కానీ, మనసు నిండా ఏం నింపుకోవాలని చూడవా!’ అంటోంది. తను మళ్లీ వస్తానని చెప్పి వచ్చేశాడు. వెళ్లిన అరగంటకే పెద్దోడు ఫోన్ చేశాడు - ‘అమ్మ చనిపోయిందని..’ ‘డబ్బు కోసం ఆశపడి చివరి రోజుల్లో ఉన్న భార్య దగ్గర కాసేపు కూడా కూర్చోలేకపోయాను. ప్రేమగా చూసుకోవాల్సిన భార్యను ఇంటి పనులు చేసే యంత్రంలాగే చూశాను..’ పరంధామయ్య గొంతు దుఃఖంతో పూడుకుపోయింది.

కాసేటి తర్వాత ఇంకా ప్రయాణించండి... అని కౌన్సెలర్ సూచనలు అందుకున్నాడు. తనకు ఇంకా వెనక్కి వెళుతున్నాడు.. పాతికేళ్ల వయసు. తండ్రితో తాను గొడవ పడుతున్నాడు. ‘‘భూమి అమ్మడానికి వీల్లేదు’’ అంటున్నాడు తండ్రి. ‘‘అమ్మి తీరాల్సిందే’’ అంటున్నాడు తను. ‘‘అన్నం పెట్టిన నేలయ్యా, దాన్ని అమ్మద్దు. నీకు దండం పెడతా!’’ అని తన కాళ్లు పట్టుకుంటున్నాడుతండ్రి. తను అనరాని మాటలన్నీ అంటున్నాడు తండ్రిని. విసిగిపోయిన ఆయన ‘నీ ఇష్టం’ అన్నాడు. తను భూమిని అమ్మేశాడు. వ్యాపారం మొదలుపెట్టాడు. ఆరు నెలలు తిరక్కుండానే తండ్రి చనిపోయాడు. ముసలోడైపోయాడు అనుకున్నాడు. కానీ, భూమి మీద మమకారంతో చనిపోయాడు తన తండ్రి. పరంధామయ్య గుండెలో నుంచి దుఃఖం ఉబుకుతోంది. తండ్రికి చేసిన అన్యాయం గుర్తుకు వచ్చింది. తండ్రిని క్షమించమని వెక్కుతూనే ప్రాథేయపడ్డాడు పరంధామయ్య.

‘‘ఇంకా వెనక్కి ప్రయాణించండి. మీ ఈ జీవితం నుంచి గత జీవితంలోకి... ’’ అన్నారు కౌన్సెలర్. పరంధామయ్య గతంలోకి ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రయాణం.. మెల్ల మెల్లగా ఒక దగ్గరకు చేరుకుంది.  ‘ముగ్గురు వ్యక్తులు గొడవపడుతున్నారు. వారిలో తనున్నాడు. ఎవరో పెద్దాయన మోకాళ్లలో తల దాచుకుని ఏడుస్తున్నాడు. అతను తన తండ్రి. ఆస్తుల కోసం గొడవలు. తను ఆ ఇంటికి పెద్ద. కాబట్టి, తనకు ఎక్కువ వాటా కావాలని తమ్ముళ్లతో వాదిస్తున్నాను. వాళ్లెవరో కాదు రమేష్, సురేష్‌లు. అంటే, వాళ్లే ఈ జన్మలో నాకు కొడుకులుగా పుట్టారా? వాళ్లను తను కొడుతున్నాడు. తమను విడదీయడానికి తండ్రి వచ్చాడు. అయినా నేను వినడం లేదు. తను అందరికన్నా ధనవంతుడవ్వాలి.

ఈ విషయం అర్థమయ్యాక పరంధామయ్య మనసు పశ్చాత్తాపంతో కుమిలిపోయింది. తనకు డబ్బు మీద ఉన్న కాంక్ష ఎంతటిదో అర్థమైంది. ఆస్తి కోసం తండ్రిని వేధించాను. భార్యను పట్టించుకోలేదు. పిల్లలను దూరం పెట్టాడు. బంధువులను దగ్గరకు రానివ్వలేదు. అందుకే తాను ఒంటరి అయిపోయాడు. ఈ విషయం అర్థమవగానే పరంధామయ్య మనసు తేలికపడింది. తన ధన దాహం బంధాలను ఎలా దూరం చేసిందో అర్థమైంది. ఈ బాధల నుంచి బయటపడడమే కాదు, పిల్లలను దగ్గరకు తీసుకొని, తన ఆస్తి మీరే అని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. తనకీ అవకాశాన్ని కల్పించిన వర్ధన్‌కి, కౌన్సెలర్ కృతజ్ఞతలు తెలిపి పిల్లల వద్దకు బయల్దేరాడు పరంధామయ్య.

విశ్వమంతా  ఒకే న్యాయం
‘ఎలాంటి విత్తనం నాటుతామో అలాంటి మొక్కే వస్తుంది’. ఇది ప్రకృతి చెబుతోంది. ‘ఏదైనా వస్తువు పైకి విసిరేస్తే పైకి వెళ్లదు. అది కిందే పడుతుంది’. ఇది సైన్స్ చెబుతోంది. కర్మలు కూడా అంతే! ఎవరైతే ఈ ప్రక్రియను అర్థం చేసుకుంటారో వారిలో ఆత్మపరిణతి చెంది, కర్మల నుంచి బయటకు వస్తారు. లేదంటే, కర్మల విషవలయంలో తిరుగుతూనే వుంటారు. మన దేశం ‘భగవద్గీత’ ద్వారా ప్రపంచ దేశాలకు కర్మన్యాయ జ్ఞానాన్ని ఇచ్చింది. బుద్ధిజవ్‌ు సైతం కర్మన్యాయం గురించి వివరించింది. అయితే, మిగతా ప్రపంచ దేశాలు వీటిని ఆధారంగా చేసుకొని శాస్త్రీయ పరిశోధనలు చేస్తూ, పరిష్కారానికి చికిత్సామార్గాన్ని సూచించారు. అదే పాస్ట్‌లైఫ్ రిగ్రెషన్ థెరపీ. 1950 నుంచి జరిగిన ఈ పరిశోధనల విస్తృతి ఇంకా పెరుగుతోంది. తెలుసుకొని వదిలేయడం కాకుండా అవగాహన చేసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా పాప కర్మలు తగ్గించుకునే అవకాశం ఉంది. డాక్టర్ బ్రెయిన్ ఎల్ వెయిజ్ అనే అమెరికన్ ైసైకియో థెరపిస్ట్ కర్మన్యాయం మీద పరిశోధనలు జరిపి‘మెనీ లైవ్స్... మెనీ మాస్టర్స్’ అనే పుస్తకం రాశారు. ఇంకా ఎంతో ప్రముఖ మనస్తత్వ నిపుణులు పాపకర్మలు మనిషి జీవితంపై ఎలాంటి ప్రభావాలు చూపుతున్నాయనే అంశాలను గ్రంథస్థం చేశారు. కర్మలకు దూరంగా ఉంటే మానవ జీవనానికి అర్థం ఉండదు. మంచి కర్మలు చేసిన మనిషి సుఖమయ జీవనాన్ని పొందుతాడని అర్థం చేసుకోవాలి.

ధృతరాష్ర్టుడి కథలోనూ...
కురుక్షేత్ర యుద్ధంలో నూరుగురు కుమారులను కోల్పోయిన ధృతరాష్ట్రుడు ఆవేదనతో కృష్ణుడిని సమీపించి ‘కృష్ణా... కొడుకులను కాపాడుకోలేని నిస్సహాయుడిని ఎందుకయ్యాను?’ అని అడిగాడు. కృష్ణుడు అతనికి జ్ఞాననేత్రం ద్వారా గత జన్మ కర్మలను దర్శించే అవకాశం ధృతరాష్ట్రుడికి కల్పించాడు. ‘కిందటి జన్మలో వేటగాడైన ధృతరాష్ట్రుడు చెట్టు మీదున్న మగపక్షికి బాణం వేశాడు. అది తప్పించుకుంది. అతనికి కోపం వచ్చి, చెట్టుకు నిప్పు పెట్టాడు. చెట్టు పై గూడులో ఆ మగ పక్షి సంతానమైన వంద పక్షులు మంటల్లో కాలిపోయాయి. మంటల ధాటికి మగ పక్షి కళ్లు పోయాయి. దానివల్లే ఈ జన్మలో అంధత్వం ప్రాప్తించింది. కొడుకులు యుద్ధంలో మరణిస్తుంటే నిస్సహాయిడై ఉన్నానని గ్రహించాడు. శిక్షకు శిక్ష తప్పదని అదే కర్మ పాఠం అని గ్రహించాడు.

వృద్ధాప్య  పాఠం
చాలా మంది వృద్ధాప్యంలో ‘తమను ఎవరూ పట్టించుకోరు’ అని బాధపడుతూనో, ‘పిల్లలు తమ మాట ఇంకా వినితీరాలని’ ఆలోచన వల్లనో ప్రశాంతతను కోల్పోతుంటారు. వృద్ధాప్యం అనేది ఒక అందమైన విద్యావిధానం. అన్ని బాధ్యతలూ తీరిపోయి జీవన ప్రయాణంలో పరుగులు తీయడం తగ్గి తమ కోసం తాము జీవించే అవకాశం వృద్ధాప్యం కలిగిస్తుంది. ఈ వయసులో తమ చేతన (ఆత్మ) లక్ష్యం ఏంటి? అని తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ఇదో మంచి అవకాశం. మన పూర్వీకులు వృద్ధాప్యంలో అన్ని బంధాల నుంచి విముక్తి పొంది, తమను తాము తెలుసుకోవడానికి వానప్రస్థాశ్రమాన్ని చేరుకునేవారు. ఈ వయసులో బంధుత్వాలకు దగ్గరగా ఉంటూనే బంధాల నుంచి మానసికంగా దూరం అవడం నేర్చుకోవాలి.   - నిర్మల చిల్కమర్రి

మరిన్ని వార్తలు