ప్రేమ వేరు.. పెళ్లి వేరు...

18 Feb, 2014 23:42 IST|Sakshi
ప్రేమ వేరు.. పెళ్లి వేరు...

 ప్రేమ కేవలం మన మనసుకి సంబంధించిన విషయం. కాని పెళ్లి అలా కాదు...భర్త, అత్తమామలు, కొత్త  బంధువులు, కొత్త వాతావరణం...ఇలా అన్నీ ఉంటాయి. ప్రేమించుకునే సమయంలో అబ్బాయిలోని గొప్పతనం, మంచితనం మాత్రమే మీకు తెలుస్తాయి. కానీ మనిషన్నాక మంచీ, చెడూ రెండూ ఉంటాయి. పెళ్లి తర్వాతగానీ అబ్బాయి దినచర్య, అలవాట్లు, భావోద్వేగాలు మీకు తెలియవు. కేవలం చిన్న చిన్న కారణాలతో ప్రేమపెళ్లిళ్లు విఫలమవుతున్న సందర్భాలు చూస్తున్నాం మనం. ప్రేమపెళ్లికి ముందు, తర్వాత అమ్మాయి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్నింటిని అర్థం చేసుకోవాలి. ఇంకొన్నిటికి సర్దుకుపోవాలి. అన్నిటికంటే ముఖ్యమైనది మీ జీవితంపట్ల మీకు అంకితభావం ఉండాలి. కొన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు పాటిస్తే చాలా సమస్యల నుంచి బయటపడినవారవుతారు.
 
     {పేమ రెండేళ్లదయినా, నాలుగేళ్లదయినా పెళ్లికి సిద్ధపడుతున్నప్పుడు పెళ్లి తర్వాత మీ దినచర్య మొదలు సమాజంలో మీకున్న గుర్తింపు వరకూ అన్నింటి గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించుకోండి.
    మీరు పెళ్లిచేసుకోబోయే వ్యక్తి పేదవాడయితే పెళ్లి తర్వాత అతనితో కలిసున్నప్పుడు వచ్చే కష్టాలపై అవగాహన పెంచుకోవాలి. కారుని విడిచి బస్సులో వెళితే ఎలా ఉంటుందో ఒకసారి ప్రయత్నించి చూడడంలో తప్పులేదు.
 
     ‘పెళ్లయ్యాక భర్త స్వభావాన్ని మార్చుకోవచ్చు’ అని అనుకునే అమ్మాయిలు చాలామంది ఉంటారు. స్వభావరీత్యా భర్తని భార్య, భార్యను భర్త మార్చడం మాటల వరకే తప్ప నిజజీవితంలో అయ్యేపని కాదు.
    ఏవో చిన్న చిన్న అలవాట్లు, ఆలోచనలు మార్చగలరేమో కాని మీరు కోరుకున్నట్లు ఎదుటివారు మారిపోరు. ఇలాంటి అపోహలవల్ల కూడా చాలా ప్రేమపెళ్లిళ్లు విఫలమవుతుంటాయి.  కేవలం భర్తను మార్చాలనుకునే పనిలో చాలా మంది మహిళలు తమ అమూల్యమైన సమయాన్ని వృథా చేసుకుంటున్నారు.
 
     పెళ్లయి, పిల్లలు పుట్టాక మోసపోయానంటూ వచ్చే అమ్మాయిలుంటారు. పెళ్లి తర్వాత కనీసం ఒకటి రెండు సంవత్సరాల తర్వాత పిల్లల్ని కనడం మంచిది. ఆ సమయంలోగా మీ జీవితభాగస్వామి గురించి ఎంతో కొంత తెలుసుకునే అవకాశం ఉంటుంది.  
 
    - డాక్టర్ పద్మ పాల్వాయ్, సైకాలజిస్టు,
 రెయిన్‌బో చిల్డ్రన్ అండ్ ఉమెన్ హాస్పటల్

మరిన్ని వార్తలు