నన్నడగద్దు ప్లీజ్..!

17 Nov, 2013 01:07 IST|Sakshi

ప్రియదర్శిని రామ్, లవ్ డాక్టర్
 

మీకో తిక్కుంది. లవ్ డాక్టర్‌కో లెక్కుంది.
 మీ తిక్క మీ ప్రేమ ప్రాబ్లమ్స్!
 మరి లవ్‌డాక్టర్‌కో...
 
 యధార్థ సంఘటన
 ఒక రోజు అర్ధరాత్రి.. యాక్చువల్లీ అపరాత్రి.
 టైమ్ పన్నెండుకు అటూ ఇటూ! ఎటో మరి.
 ఉబుసుపోక క్లినిక్‌కి వెళదామని ఇంటినుంచి బయల్దేరాను.
 పై అంతస్తులో ఉన్న క్లినిక్‌కు  చేరుకోవడానికి అటూ ఇటూ ఎటో చూస్తున్నాను.
 అటుగా వె ళుతున్న ఓ వ్యక్తి దగ్గరగా వచ్చాడు.
 అనుమానంగా చూస్తూ ‘‘మీరు... లవ్ డాక్టర్ కదా!’’ ఆశ్చర్యంగా, అబ్బురంగా, ఆసక్తిగా...గా.. గా..గా...అడిగాడు.
 ‘‘అవును’’అన్నాను.
 ‘‘మీరు చాలా బాగా రాస్తారు సర్!’’ అన్నాడతను.
 ‘‘ఎందుకులెండి బాబూ!’’ అన్నాను మరీ మొహమాటపడిపోతూ!
 ‘‘నిజం సార్! మీరు చెప్పిన మాటలకు ఎంత బలం ఉంటుందంటే, అవి జీవితాలను నిలబెడతాయ్!’’ అన్నాడతను.
 ‘ఓర్నాయనో... ఈ మనిషి మరీ మోసేస్తున్నాడు’ అనుకుంటుండగా ఆ వ్యక్తి ‘‘సార్ మీకు గుర్తుందా! ఒకమ్మాయి మీకో ఉత్తరం రాసింది. ప్రేమను పొందలేక ఆత్మహత్య చేసుకుంటాను... అని...’’
 (నా ముఖం బ్లాంక్‌గా అయ్యింది)
 ‘‘అంతేలెండి సార్, మీకు ఎంతోమంది ఉత్తరాలు రాస్తుంటారు. ఎవర్నని గుర్తుపెట్టుకుంటారు’’ అన్నాడతనే.
 ‘‘ఇంతకీ సమాధానం ఇచ్చానా?’’ అనుమానంగా అడిగాను.
 ‘‘ఇచ్చార్సార్!’’ అంటూనే ‘‘ఆ అమ్మాయి ఎవరో తెలుసా సార్ మీకు.’’
 (నాది మళ్లీ బ్లాంక్ ఫేస్).
 ‘‘ఆ అమ్మాయి ఇప్పుడు నా భార్య సార్!’’ అన్నాడతను.
 షాక్ అయ్యాను. మనసులో ‘అయ్యో! వీణ్ణి చేసుకోవాలని డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్య చేసుకుందామనుకుందా ఏమిటి? అందుకే అప్పుడు ఉత్తరం రాసుంటుందా! పాపం’ అనుకుంటూ భయం భయంగా ‘‘అదెలా జరిగింది?’’ అన్నాను.
 ‘‘మేమిద్దరం ప్రేమించుకున్నాం సర్! పెద్దవాళ్లు ఒప్పుకోలేదు. ఏ నిర్ణయం తీసుకోలేక ‘చనిపోవాలనుకుంటున్నాం..’ అని మీకు లెటర్ రాసింది తను. మీరు సమాధానం ఇచ్చారు. ఆ సమాధానం మేం మా ఇద్దరి తల్లిదండ్రులకు చూపించాం. వారు రియలైజ్ అయ్యారు. ఇదే కరెక్ట్ అని మాకు పెళ్లి చేశారు. మీ దయవల్ల మేం ఒకింటివారమయ్యాం...’’ అతను అంటుండగానే లిఫ్ట్ డోర్ ఓపెన్ అయ్యింది. నీలాంబరి అరటిపండు పట్టుకొని ఉంది. ఆయన హ్యాండ్‌ని షేక్ చేయాలా? నీలాంబరి చేతిలోని అరటిపండు టేక్ చేయాలా? అని బుర్ర బేక్ అవుతున్న టైమ్‌లో నీలాంబరి చెప్పింది ‘‘ఏంటోసార్! మళ్లీ ఉత్తరాలకు మీరే సమాధానాలు రాయాలట. ‘సాక్షి’ నుంచి ఇప్పుడే కబురొచ్చింది. కబురుతో పాటు డజను అరటిపండ్లు కూడా పంపించార్సార్! అయినా... మీ తొక్కలో సమాధానాలకి డజను అరటిపండ్లా సార్!’’ అని ఆ సంసారి ముందు నన్ను సన్నాసిని చేసింది.

 సరదాగా కాసేపు పిల్లలతో మాట్లాడుతూ మంచి విషయం చె ప్పినా చెప్పకపోయినా కలుపుగోలుగా ఉంటే జీవితంలోని ఆశలు ఆశయాలుగా మారుతాయని మొదలుపెట్టిన ‘లవ్‌డాక్టర్’ కాలమ్ అందరికీ ఉపయోగపడింది. అందుకే మళ్లీ వస్తున్నాడు మీ లవ్ డాక్టర్. మీరు రాసిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పకుండా మిమ్మల్ని చిరాకు పెట్టిన లవ్‌డాక్టర్‌కు ‘మీ కాలమ్ మొద లు పెడుతున్నాం’ అని చెప్పినప్పటి నుంచి కాలు కాలిన పిల్లిలా తలుపుదగ్గరకు వెళుతున్నాడు.. వస్తున్నాడు. నీలాంబరిని ఉత్తరాలు వచ్చాయా? అని అడుగుతున్నాడు. పోస్ట్‌మేన్ బాషా, కొరియర్ అరుణాచలం, స్పీడ్‌పోస్ట్ ముత్తు... కోసం పడిగాపులు కాస్తున్నాడు. నర్స్ నీలాంబరి ఈయన అగచాట్లు చూసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకుంటోంది. అప్పుడు వంకరటింకర సమాధానాలిచ్చి మిమ్మల్ని ఆటపట్టించినందుకు మీకిదే ‘రివెంజ్’ తీసుకునే బెస్ట్ ఛాన్స్!
 
 ‘నన్ను అడగద్దు ప్లీజ్’ కాలమ్‌కి ఒక్క ఉత్తరం కూడా రాయకండి. చెప్పులు అరిగి బుర్ర వేడెక్కి కడుపుతిప్పి ‘లవ్‌డాక్టర్’ పేషెంట్ అయిపోవడం ఖాయం. మీరు తొందరపడి ఉత్తరం రాయకూడని అడ్రస్...
 
 లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్,
 హైదరాబాద్-500034, మెయిల్: sakshi.lovedoctor@gmail.com
 https://www.facebook.com/sakshifamily

 

>
మరిన్ని వార్తలు