ఇప్పటికీ ఉంది

29 Feb, 2020 04:53 IST|Sakshi
డేవిడ్‌ బెక్‌హామ్, విక్టోరియా

అమ్మాయి బాగుంది! చూడగానే గుండె క్షణమాగి కొట్టుకుంది. పేరడగాలి. భయం. పేరే అడగలేనప్పుడు ఫోన్‌ నెంబర్‌ ఏమడుగుతాం! ఇరవై మూడేళ్ల క్రితం విక్టోరియా అనే అమ్మాయిని చూడగానే డేవిడ్‌ బెక్‌హామ్‌కి కూడా ఇలాగే భయం వేసింది. అయితే అతడికి పేరు అడిగే అవసరం రాలేదు. విక్టోరియా అప్పటికే విశ్వవిఖ్యాత ఫ్యాషన్‌ డిజైనర్, సింగర్‌. బెక్‌హామ్‌కి ఆమెను ఫోన్‌ నెంబర్‌ అడగాలని ఉంది. నెంబర్‌ తీసుకుని రోజూ మాట్లాడాలని ఉంది. అప్పటికే అతడు కూడా పేరున్న ఫుట్‌బాల్‌ ప్లేయర్‌. పైగా ఇంగ్లండ్‌ జట్టుకు అప్పుడే  కెప్టెన్‌ అయ్యాడు. అయినా విక్టోరియా నెంబర్‌ అడగడానికి ధైర్యం సరిపోలేదు. ఏదో పార్టీలో చూశాడు ఆమెను. ధైర్యం కోసం ఇలాంటి అబ్బాయిలు ఆల్కహాల్‌ సేవిస్తారు. అయితే బెక్‌హోమ్‌.. ఆ అమ్మాయి ఆల్కహాల్‌ సేవించే వరకు ఆగాడు. మరికొంచెం తీసుకునే వరకు ఆగాడు. ఇంకొంచెం తాగనిచ్చాడు. అప్పుడు వెళ్లి ఫోన్‌ నెంబర్‌ అడిగాడు! విక్టోరియా నవ్వింది. పెన్‌ కోసం పక్కకు చూసింది. ‘‘నా దగ్గర ఉంది’’ అని.. తను కూడా ఎక్కడో పక్కనుంచి తీసుకున్న పెన్‌ని ఆమెకు ఇచ్చాడు. విక్టోరియా దగ్గర కాగితం లేదు. హ్యాండ్‌బ్యాగ్‌లో వెతికి ట్రెయిన్‌ టిక్కెట్‌ ఉంటే తీసి, దానిమీద తన ఫోన్‌ నెంబర్‌ రాసి బెక్‌హామ్‌కి ఇచ్చింది. ‘‘ఇప్పటికీ ఆ టిక్కెట్‌ నా దగ్గర ఉంది’’ అని గురువారం జిమ్మీఫాలెన్‌ లేట్‌ నైట్‌ షోలో చెప్పాడు బెకహామ్‌. మంచి భర్తే.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు