ప్రేమించా.. కానీ విడిపోయా!

1 Dec, 2013 00:54 IST|Sakshi

అమ్మాయిలు ఎలా ఉండాలి?
 ఇది కరెక్టు ప్రశ్న కాదు.
 మరేది కరెక్టు ప్రశ్న?
 అబ్బాయిలు ఎలా ఉండకూడదు? అని అడగడం.
 ఇంతవరకూ ఎవరైనా ఈ ప్రశ్న అడిగారా?
 లేదు!
 అబ్బాయిలు ఎలా ఉండకూడదో చెప్పేవాళ్లు ఉండి ఉంటే...
 అమ్మాయిలు ఎలా ఉండాలన్న ప్రశ్న వచ్చి ఉండేదే కాదు.
 ‘సాక్షి’ ఫ్యామిలీ ఈ వారం...
 నిత్యా మీనన్ అనే అమ్మాయితో మాట్లాడినప్పుడు ఇలాంటి డిస్కషన్ ఏమీ రాలేదు కానీ...
 అమ్మాయిలు ఎలా ఉన్నా, ఎలా ఉండకున్నా
 నిత్యనైతే ఆదర్శంగా తీసుకోవాలనిపించింది!
 అదేమిటి? నిత్యామీనన్ హీరోయిన్ కదా...
 సింపుల్‌గా... ‘అమ్మాయి’ అనేయడమేనా?!
 నిత్య... హీరోయినే. కానీ...
 ఆమెను మించిన హీరోయిన్ ఆమెలోని అమ్మాయి!
 ఇవాళ్టి ఈ ‘తారాంతరంగం’ చదవండి.
 మీ అమ్మాయి చేత చదివించండి.
 పెప్పర్ స్ప్రేలు, గన్‌ల కన్నా అనువైనదేదో...
 మీకు ఈ ఇంటర్వ్యూలో దొరుకుతుంది.

  ఎక్కువమంది లేడీ డైరక్టర్స్‌తో సినిమాలు చేస్తున్నారు కదా..  మేల్, ఫీమేల్ డెరైక్టర్స్‌లో వర్కింగ్ పరంగా మీకు కనిపించిన వ్యత్యాసం ఏంటి?
 నిత్యామీనన్: ఓ విధంగా నేను లక్కీ. ఎందుకంటే, ఎక్కువమంది ఫీమేల్ డెరైక్టర్స్‌తో సినిమాలు చేసే అవకాశం నాకే దక్కిందనుకుంటున్నా. నందిని, అంజు, అంజలీమీనన్.... ఇప్పుడు శ్రీప్రియగారు. దర్శకులని ఆడ, మగ అని విభజించలేం. ఏ డెరైక్టర్ అయినా ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్పే’. ఏ డెరైక్టర్‌తో అయినా వేవ్‌లెంగ్త్ కుదరడం అవసరం. లేడీ డెరైక్టర్స్‌తో చేసినపు్పుడు వెసులుబాటు ఏంటంటే, కాస్ట్యూమ్ గురించి ఓపెన్‌గా మాట్లాడొచ్చు.
 
 ఒకవేళ మీకు ఏ దర్శకులతో అయినా వేవ్ లెంగ్త్ కుదరకపోతే ఏం  చేస్తారు?
 నిత్యామీనన్: అందుకే సినిమాలు సెలక్ట్ చేసుకునే విషయంలో జాగ్రత్త వహిస్తా. సినిమాలకన్నా ముందు వ్యక్తులను సెలక్ట్ చేసుకుంటాను. ‘వీళ్లతో సినిమా చేస్తే ఇబ్బందేమీ ఉండదు’ అనే నమ్మకం కుదిరితే ఒప్పుకుంటాను. ఒక సినిమాని ఎంజాయ్ చేస్తూ చేయాలి కానీ ఇబ్బందులుపడి కాదు.
 
 ‘వీళ్లతో ఇబ్బందులు రావు’ అని ఎలా జడ్జ్ చేస్తారు?
 నిత్యామీనన్: ఓ సినిమా స్టార్ట్ అయ్యే ముందు కథ, పాత్ర గురించి చెప్పడానికి దర్శక, నిర్మాతలు కనీసం రెండు, మూడుసార్లయినా కలుస్తారు. అప్పుడు వాళ్లేంటో కొంతవరకు అర్థమవుతుంది. అన్నిసార్లూ జడ్జ్ చేయడం కష్టమే. కానీ, ఇప్పటివరకు దాదాపు నా జడ్జిమెంట్ కరెక్ట్ అయ్యింది. మహా అయితే ఒకటి, రెండుసార్లు ఇబ్బందిపడ్డ సందర్భాలు ఉన్నాయేమో. వాటిని కూడా డీల్ చేయగలిగాను.
 
 సినిమాల ఎంపిక విషయంలో మీరు చాలా సెలక్టివ్‌గా ఉండటంవల్లనో, కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉండటంవల్లనో మీరు ‘యారోగెంట్’ అని కొంతమంది అంటుంటారు..
 నిత్యామీనన్: నేను యారోగెంట్ కాదు. స్ట్రిక్ట్‌గా ఉంటాను. నాతో పాటు షూటింగ్స్‌కి మా అమ్మానాన్న రారు. నా పక్కన నా మేనేజర్ ఉండరు. సో.. నా దగ్గర ఎవరైనా తప్పుగా బిహేవ్ చేస్తే.. నేనే డీల్ చేయాలి కదా. నాతో రాంగ్‌గా మాట్లాడినా, తేడాగా బిహేవ్ చేసినా నేను ఊరుకోను. అరిచి, గోల చేయను. ‘నాతో అలా ప్రవర్తించవద్దు’ అని ఖరాఖండిగా చెబుతాను. అలా అబ్బాయిలు చెబితే ఏమీ అనరు కానీ.. అమ్మాయిలు మాట్లాడితే మాత్రం యారోగెంట్ అంటారు. నా గురించి మంచివాళ్లను అడిగితే, మంచిగానే చెబుతారు. కానీ, చెడ్డవాళ్లని అడిగితే కచ్చితంగా చెడుగానే చెబుతారు. సో.. నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే, వాళ్లు రాంగ్ పర్సన్ అని మీరు ఫిక్స్ అవ్వొచ్చు.
 
 ఆడవాళ్లు నిర్భయంగా మాట్లాడితే తప్పు... మగవాళ్లయితే ఏమైనా చేయొచ్చనే ఈ పరిస్థితి మీకెలా అనిపిస్తుంది?

 నిత్యామీనన్: అది బాధాకరమే. సరైన విషయాల గురించి మాట్లాడే హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆ హక్కుని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి.. ఏదైనా సరే  నిర్భయంగా చెప్పేయాలి. లక్కీగా నేనిప్పటివరకు అంతా మంచివాళ్లతోనే యాక్ట్ చేశాను. మగాళ్లందరూ డామినేట్ చేస్తారనలేం. రైట్‌పర్సన్స్ కూడా ఉంటారు. అందుకే అంటున్నా.. రైట్ పీపుల్‌ని సెలక్ట్ చేసుకుంటే ఇబ్బందులు ఉండవని.
 
 జనరల్‌గా చాలామంది హీరోయిన్స్ అమ్మా నాన్నని తోడు తీసుకొచ్చుకుంటారు. మరి.. మీతో పాటు మీవాళ్లను ఎందుకు తీసుకురారు?

 నిత్యామీనన్: మా అమ్మా నాన్న జాబ్ చేస్తారు. నాకోసం వాళ్లిద్దరూ ఉద్యోగాలు వదులుకోవాల్సిన అవసరం లేదు కదా. మా అమ్మ కొంగు పట్టుకుని తిరగడానికి నేనేం చిన్నపిల్లనూ కాదు. నా లైఫ్‌ని డీల్ చేసుకునే సమర్థత, వయసు నాకున్నాయి. మా అమ్మానాన్నలకు నేను ఒకే కూతుర్ని. నన్ను గారాబంగా పెంచడంతో పాటు నా లైఫ్‌ని నేను డీల్ చేసుకునే విధంగా పెంచారు. చిన్న విషయాలక్కూడా పెద్దగా భయపడిపోవడం నా డిక్షనరీలో లేదు. నేను చాలా విషయాలకు అస్సలు భయపడను.
 
 ఊరు కాని ఊరు.. దేశం కాని దేశం వెళుతుంటారు కదా.. మీ అమ్మానాన్న జాగ్రత్తలు చెబుతుంటారా?
 నిత్యామీనన్: పిల్లలు బయటికెళ్లేటప్పుడు ఏ తల్లిదండ్రయినా జాగ్రత్తలు చెబుతారు. మావాళ్లూ అంతే. నా మీద మా అమ్మానాన్నలకు నమ్మకం ఎక్కువ. నా చిన్నప్పుడు కూడా నేను వాళ్లకి ఎలాంటి సమస్యలు తేలేదు. చిన్నప్పుడు అల్లరి చేసేదాన్ని కాదట. రెండేళ్ల వయసులో కూడా ఎక్కడ పుస్తకాలు అక్కడ పెట్టడం, కాళ్లు కడుక్కుని సోఫాలో కూర్చోవడం చేసేదాన్నట. అమ్మ అప్పుడప్పుడూ చెబుతుంటుంది. కొన్ని సమస్యలను మాకన్నా నువ్వే బాగా హ్యాండిల్ చేయగలుగుతావని నా పేరెంట్స్ అంటుంటారు.
 
 మీకు సినిమా పరిశ్రమలో స్నేహితులు ఉన్నారా?
 నిత్యామీనన్: లేరు.
 
 ఫ్రెండ్‌షిప్ చేసేంత మంచివాళ్లు దొరకలేదా?
 నిత్యామీనన్: విడిగానూ నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ. నా వేవ్‌లెంగ్త్‌కి మ్యాచ్ కానివాళ్లతో నేను ఫ్రెండ్‌షిప్ చేయలేను. పైగా, నేను ఫేస్‌బుక్, ట్విట్టర్ అంటూ సోషల్ నెట్‌వర్కింగ్‌లో కూడా లేను. అయితే నా కో-స్టార్స్‌తో మాత్రం ఫ్రెండ్లీగా ఉంటాను. కానీ, ‘వీళ్లు నా ప్రాణస్నేహితులు’ అని చెప్పేంత స్నేహితులు సినిమా పరిశ్రమలో లేరు.
 
 మీ పేరు మీద ట్విట్టర్ ఎకౌంట్ ఉందే?

 నిత్యామీనన్: అది నకిలీది. నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ పేజ్ కూడా ఉంది. ఆ ఎకౌంట్స్ నావే అని చాలామంది ఫాలో అయ్యి, మోసపోతున్నారు. అందుకే.. నేను సోషల్ నెట్‌వర్కింగ్‌లో లేనని మరోసారి స్పష్టం చేస్తున్నా.
 
 మరి.. మీరే ఓ ఎకౌంట్ ఓపెన్ చేయొచ్చుగా?
 నిత్యామీనన్: నాకంత టైమ్ లేదండి. ఆల్రెడీ కెరీర్‌తో బిజీగా ఉన్నాను. ఇక ఆన్‌లైన్ మేనేజ్‌మెంట్ అంటే కష్టం. టైమ్ దొరికితే నా ఫ్యామిలీతో గడపాలనుకుంటాను. అంతేకానీ.. ఏ టెన్షన్సూ పెట్టుకోదల్చుకోలేదు.
 
 ఎనిమిదేళ్ల వయసులోనే ఇంగ్లిష్ సినిమాలో యాక్ట్ చేశారట?

 నిత్యామీనన్: అవును. మా ఇంట్లో నా ఫొటో చూసి, ‘పాప బాగుంది..’ అని ఓ ఫొటోగ్రాఫర్ ఆ ఫొటో తీసుకున్నారు. మా ఇంటిపక్కనే ఆయన ఉండేవారు. ఆయన యాడ్ ఏజెన్సీలో వర్క్ చేసేవారు. అక్కడ నా ఫొటో పెట్టారు. అది చూసి, ఓ ఫ్రెంచ్ డెరైక్టర్ టబు చెల్లెలి పాత్రకు నన్నడిగారు. చిన్నప్పుడు నాలో టబు పోలికలు కనిపించేవి. ఆ డెరైక్టర్ మా ఇంటికి ఫోన్ చేసి ‘పాపని యాక్ట్ చేయిస్తారా’ అని అడిగితే, మేమందరం షాక్ అయ్యాం. ఎందుకంటే, మా ఇంట్లో సినిమా పరిశ్రమకు సంబంధించినవాళ్లెవరూ లేరు. మా కుటుంబంలో చదువుకి ప్రాధాన్యం ఇస్తారు. బాగా చదువుకోవడం, మంచి ఉద్యోగం చేయడం. అంతవరకే. అందుకే, మావాళ్లెవరూ ఒప్పుకోలేదు. కానీ, నేను చేస్తానన్నాను. అలా, ‘హనుమాన్’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా యాక్ట్ చేశాను.
 
 అప్పట్నుంచే సినిమాలంటే ఇంట్రస్ట్ ఏర్పడిందా?
 నిత్యామీనన్: అలా ఏం లేదు. జర్నలిస్ట్ అవ్వాలని ఉండేది. కానీ, చివరికి యాక్టింగే నా కెరీర్ అవుతుందని అనుకోలేదు.
 
 జర్నలిస్ట్‌గా చేశారా?

 నిత్యామీనన్: చేశాను.. కానీ, ఒకటి, రెండేళ్ల తర్వాత ఆ జాబ్ మనకు సరిపడదనిపించింది. అందుకే, వదిలేశా.
 
 సినిమాలే కెరీర్ అయినందుకు ఎలా అనిపిస్తోంది?

 నిత్యామీనన్: ఈ ఫీల్డ్‌లో మంచీ చెడూ రెండూ ఉన్నాయి. అవి పక్కనపెడితే, ఓ మంచి సీన్‌లో యాక్ట్ చేసిన రోజున చాలా ఆనందంగా ఉంటుంది. అయితే సెలబ్రిటీగా ఉండటం నచ్చదు. ఎక్కడికెళ్లినా దొంగచాటుగా ఫొటోలు తీయడానికి ప్రయత్నిస్తారు. అది ఇబ్బందిగా ఉంటుంది. అలాగే, నిజమా? కాదా అని తెలుసుకోకుండా మా గురించి ఏదేదో ప్రచారం చేస్తుంటారు. అప్పుడు బాధగా ఉంటుంది. కానీ, ఇప్పుడు అన్నింటినీ ఎదుర్కోవడం అలవాటయ్యింది.
 
 మీ మీద వదంతులు వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది?
 నిత్యామీనన్: నా గురించి వదంతులేవీ రావు కదా.
 
 ఎఫైర్లకు సంబంధించినవి కాదు.. నిత్యా పొగరుగా బిహేవ్ చేయడంతో మలయాళ పరిశ్రమలో నిషేధించారట.. లాంటి వార్తలకు?
 నిత్యామీనన్: నేను చాలా సెన్సిటివ్. అందుకని, చాలా బాధపడతాను. వాస్తవానికి నన్ను చాలామంది అపార్థం చేసుకున్నారు. ‘వామ్మో.. నిత్యా’ అంటారు. కానీ, యాక్చువల్‌గా చెప్పాలంటే నేను చాలా ‘లవింగ్ పర్సన్’. రాంగ్‌గా బిహేవ్ చేసేవాళ్ల దగ్గరే స్ట్రిక్ట్‌గా ఉంటాను. నాతో బాగుంటే నేనూ బాగుంటాను. ఏదేమైనా, ఈ సంఘటనల వల్ల నాలో ఇంకా మానసిక పరిణతి పెరిగింది. ఫిలసాఫికల్‌గా ఆలోచించడం అలవాటయ్యింది. ఒక సమస్యను అధిగమించి ప్రశాంతంగా ఎలా ఉండాలి? అనే నేర్పు వచ్చింది.
 
 గ్లామరస్ రోల్స్ చేస్తేనే హీరోయిన్స్‌కు మనుగడ అంటారు.. కానీ, మీ రూటే సెపరేటు అన్నట్లుగా ఉంది?
 నిత్యామీనన్: కావాలనే ఆ రూట్‌లో వెళుతున్నా. నాకు సౌకర్యవంతంగా అనిపించే పాత్రలనే చేస్తాను.
 
 ఒకవేళ ఏదైనా సీన్ చాలా గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్ చేస్తే.. అప్పుడేం చేస్తారు?

 నిత్యామీనన్: లొకేషన్లో నాకా ప్రాబ్లమ్ రాదు. ఎందుకంటే, కథ వినేటప్పుడే సీన్స్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుంటాను. నన్నెవరూ గ్లామరస్‌గా కనిపించాలని డిమాండ్ చేయరు. ముఖ్యంగా తెలుగులో. ‘మీరు చేయరని మాకు తెలుసు..’ అని చెబుతుంటారు. ఒకవేళ గ్లామరస్ రోల్ అంటే నా దగ్గరకి ఎందుకొస్తారు? అందమైన హీరోయిన్లు చాలామంది ఉన్నారు కదా.
  మీరూ అందంగానే ఉంటారు.. కానీ, స్లిమ్‌గా ఉండటానికి ట్రై చేయరేమో?
 నిత్యామీనన్: (నవ్వుతూ). మీరన్నట్లు ఫిజిక్‌ని మెయిన్‌టైన్ చేయను. అందుకే లావుగా ఉన్నాను. ఎక్సర్‌సైజులు చేయను. నాకెందుకో యాక్టింగ్ కోసం తిండిని త్యాగం చేయడం చాలా క్రేజీ అనిపిస్తుంది. నాకు నచ్చినట్లుగా ఉంటాను. నాకు నచ్చినవి తింటాను.
 
 గ్లామరస్ రోల్స్ చేసే తారలకన్నా మీ పారితోషికం తక్కువ కదా.  మరి.. ‘పర్ఫార్మెన్స్’ రోల్స్‌కి పరిమితమై ఆర్థికంగా నష్టపోతున్నారేమో?
 నిత్యామీనన్: కేవలం డబ్బు కోసమే నేను పని చేయను. ఈ సినిమా నాకు ఆత్మసంతృప్తినిస్తుంది... గౌరవం పెంచుతుందనిపిస్తే చేస్తాను. కానీ, డబ్బు కూడా ముఖ్యమే. మన దురదృష్టం కొద్దీ డబ్బు లేకుండా మనం బతకలేం. అందుకే కదా ఈ ఉద్యోగాలు చేస్తున్నాం. ఇక, ఇతర తారల పారితోషికం గురించి మాట్లాడాలంటే.. వాళ్లకంత మార్కెట్ ఉంది కాబట్టే ఎక్కువ ఇస్తున్నారన్నది నా ఫీలింగ్. సో.. తప్పేంటి? ఊరకనే ఎవరూ డబ్బు ఇచ్చేయరు కదా. తెలుగు ఇండస్ట్రీ బాగా బిజినెస్ ఓరియంటెడ్. ఎవరికైనా భారీ పారితోషికం ఇచ్చేటప్పుడు వాళ్ల మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుంటారు. నా స్థాయికి కరెక్ట్ అనిపించినది నేను ‘కోట్’ చేస్తున్నాను. మిగతావాళ్లు ఇంత తీసుకుంటున్నారు కాబట్టి మనమూ అంతే తీసుకోవాలనుకోను.
 
 నంబర్‌వన్ స్థానాన్ని టార్గెట్ చేయరా?

 నిత్యామీనన్: నా బాటలో నేను ‘నంబర్‌వన్’. నేను చేస్తున్న పాత్రలు మిగతావాళ్లు చెయ్యలేరు. వేరేవాళ్లు చేస్తున్నవి నేను చెయ్యలేను. నటనకు అవకాశం ఉన్న పాత్ర అనుకోండి.. ‘ఈ పాత్ర నిత్యామీనన్ మాత్రమే చేయగలదు’ అని ఎవరైనా అంటే.. నేను నంబర్‌వన్ కిందే లెక్క.
 
 మీ మనస్తత్వానికి సినిమా పరిశ్రమ సరిపడదేమో అనిపిస్తోంది?

 నిత్యామీనన్: అది కొంతవరకు కరెక్టే. నాకిది కరెక్ట్ ప్లేస్ కాదని చాలాసార్లు అనిపించింది. ఉదాహరణకు ఈ మధ్య జరిగిన ఓ సంఘటన చెబుతాను. నేను కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినప్పుడు, ‘డ్రంక్ అండ్ డ్రైవ్’కి చెక్ చేశారు. అక్కడ ఎందుకున్నారో కానీ చాలామంది ఫొటోగ్రాఫర్లు ఉన్నారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించకూడదు కాబట్టి, ఊదాను. ఈలోపు ముందుకు దూసుకొచ్చేసి, ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. నాకెంత ఇబ్బందిగా ఉంటుందో అర్థం చేసుకోండి. నా కారు వెళ్లడానికి కనీసం దారి కూడా ఇవ్వలేదు. అది నాకు ‘హెరాస్‌మెంట్’లా అనిపించింది. ఇలాంటివి హెరాస్‌మెంట్స్ చాలా జరిగాయి. ఆ విషయాన్ని అలా ఉంచితే.. మేం కెమెరా ముందు మాత్రమే కాదు.. విడిగానూ యాక్ట్ చేయాలని కొంతమంది ఎదురు చూస్తారు. ‘హాయ్ హలో..’ అంటూ క్లోజ్‌గా మాట్లాడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. అలా చేయకపోతే ‘చెడ్డ అమ్మాయి’ అంటారు. అప్పుడనిపిస్తుంది... ఇక్కడకి ఎందుకు వచ్చామా? అని. క్రియేటివ్ జాబ్‌ని ఇష్టపడతాను కాబట్టి.. ఇలాంటివి తట్టుకోవాలని సర్దిచెప్పుకుంటాను. గౌతమబుద్ధుడిలా వివేకవంతంగా మారడానికి, ప్రశాంతంగా ఉండటానికే ఆ దేవుడు నాకిలాంటి కెరీర్‌ని ఇచ్చాడేమో అనిపిస్తుంటుంది (నవ్వుతూ).
 
 మీరు యాక్ట్ చేసే సినిమాలు మీరు చూడరట కదా?

 నిత్యామీనన్: సీన్ తీసేటప్పుడు డెరైక్టర్ చెప్పే ‘యాక్షన్... కట్’ మాత్రమే నాకు ముఖ్యం. ఆ సమయంలోనే వంద శాతం ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను. అందుకని, సినిమా చూసుకుని లోపాలు వెతుక్కోవడానికి ట్రై చేయను. సినిమా ఎలా వచ్చింది? హిట్టా.. ఫ్లాపా అనే విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కనబర్చను.
 
 అంటే... హిట్స్‌కి పొంగిపోవడం, ఫ్లాప్స్‌కి కుంగిపోవడం జరగదన్నమాట?
 నిత్యామీనన్: మలయాళంలో కెరీర్ స్టార్టింగ్‌లో నేను చేసినవన్నీ ఫ్లాప్సే. కానీ, ఆ సినిమాలు నాకు చాలా ముఖ్యం. ఎందుకంటే, కేరక్టర్ నచ్చడంవల్లే అవి చేశాను. సినిమా అనేది ఓ మంచి అనుభవం. 50, 60 రోజులు ఓ సినిమాకి పని చేస్తాం. ఆ సినిమా ఫ్లాప్ అయినంత మాత్రాన ఆ 60 రోజులను చేదు అనుభవాలుగా, జీవితంలో ఎందుకూ పనికిరాని వాటిగా నేను ఫీలవ్వను. ఎందుకంటే, ఆ సినిమా చేస్తున్నప్పుడు నాకెన్నో మంచి సంఘటనలు ఎదురై ఉంటాయి. కొంతమంది మంచి మనుషులతో పరిచయం అయ్యి ఉంటుంది. కాబట్టి, ఓ ఫ్లాప్ సినిమా కూడా నాకు మంచి అనుభవమే.  
 
 మీరే సినిమా ఒప్పుకోవడానికైనా ఓ కారణం ఉంటుందట.. మరి ఇప్పుడు చేస్తున్న ‘మాలిని 22’కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం ఏంటి?
 నిత్యామీనన్: ఇది ఓ  మలయాళ చిత్రానికి రీమేక్. మలయాళ చిత్రం చూశాను. చాలా నచ్చింది. మంచి సందేశం ఉంది. ప్రస్తుతం సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న సంఘటనలు చాలామందిని ఆవేదనకు గురి చేస్తున్నాయి. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నాం. ఈ విషయాల గురించే సినిమాలో చర్చించబోతున్నాం అని చిత్రదర్శకురాలు శ్రీప్రియగారు అన్నారు. సినిమా అనేది శక్తిమంతమైన మాధ్యమం కాబట్టి.. దీని ద్వారా ఒక మంచి విషయాన్ని చెప్పే అవకాశం రావడం ఆనందించదగ్గ విషయమే కదా. ఇది కమర్షియల్ ఫార్మాట్‌లో సాగే ప్రయోజనాత్మక సినిమా కాబట్టి ఒప్పుకున్నాను.
 
 ఒకవేళ సినిమాలు కాకుండా వేరే కెరీర్‌ని సెలక్ట్ చేసుకోవాలనుకుంటే ఏం చేస్తారు?
 నిత్యామీనన్: సినిమాలకు పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని ఉంది. కానీ, భవిష్యత్తు గురించి చెప్పడం కష్టం. ముఖ్యంగా నాలాంటివాళ్లకి. ఎందుకంటే, నా ఆలోచనలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి.
 
 మరి.. అప్పుడెప్పుడో ఓ స్కూల్ పెట్టాలని ఉందన్నారు. ఆ ఆలోచన అలానే ఉందా.. మారిపోయిందా?
 నిత్యామీనన్: అది మాత్రం ఎప్పటికీ మారదు. ఎందుకంటే, నాకు పిల్లలంటే చాలా ఇష్టం. నేను నిజాయితీగా మాట్లాడితే, కొంతమంది పెద్దవాళ్లు నన్ను ‘యారోగెంట్’ అంటారు.. అదే పిల్లల దగ్గర అనుకోండి.. మనం మనలా ఉండొచ్చు. ప్రపంచంలో ఎక్కడా నిజాయితీ దొరకదు. కానీ, పిల్లల దగ్గర దొరుకుతుంది. అందుకే పెద్దవాళ్లతో ఉండటంకన్నా పిల్లలతో ఉండటమే నాకిష్టం. ఈ కారణంగానే ఓ స్కూల్ పెట్టాలని ఉంది.
 
 సినిమాలు కాకుండా మీకేమేం ఇష్టం?
 నిత్యామీనన్: నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఎప్పట్నుంచో ఓ మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలని ఉంది. గిటార్ వచ్చు. వయొలిన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. అయితే, ఇప్పుడు కాదు. సినిమాల నుంచి రిటైర్ అయిన తర్వాత.
 
 పాటలు కూడా పాడుతుంటారు... నేర్చుకున్నారా?
 నిత్యామీనన్: సంగీతమైతే నేర్చుకోలేదు. చిన్నప్పట్నుంచీ పాటలు పాడుతున్నాను కాబట్టి సింగింగ్ అలవాటయ్యింది. నేను సింగరవుతానని అందరూ అనుకున్నారు.
 
 ఇంకా ఎన్నేళ్లు సినిమాల్లో ఉండాలనుకుంటున్నారు?
 నిత్యామీనన్: లైఫ్‌లో అనుకున్నవన్నీ జరగవు. ఒకప్పుడు మలయాళంలో పెద్ద పెద్ద సినిమాలకు అవకాశాలొచ్చాయి. కానీ, నేను హీరోయిన్‌గా చేయాలనుకోవడంలేదని తిరస్కరించాను. అయితే.. ఆ తర్వాత ఏమైంది? సినిమాల్లోకొచ్చానుగా. అందుకే మన చేతుల్లో ఏమీ ఉండదంటున్నాను.
 
 ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?

 నిత్యామీనన్: అది కూడా చెప్పలేను.
  ఎలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు?
 నిత్యామీనన్: నా జీవితం ఇప్పటికన్నా ఇంకా బెటర్‌గా ఉంటుందనే నమ్మకం కలిగించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అంతేకానీ పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోను. జీవితాన్ని నరకం చేసే వ్యక్తిని పెళ్లాడి జీవితాంతం బాధపడే బదులు పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోవడమే బెటర్ అనేది నా ఫీలింగ్.  
 
 అంటే.. లవ్ మ్యారేజ్ చేసుకుంటారా..?

 నిత్యామీనన్: లవ్ మ్యారేజే చేసుకోవాలని ఉంది. ఎవరినో ఒకర్ని సెలక్ట్ చేసేసి, అతన్ని పెళ్లి చేసుకునే తీరాలని మా ఇంట్లో ఒత్తిడి చేయరు.
 
 ఇంకా హైట్ ఉండి ఉంటే బాగుండేదని ఎప్పుడైనా అనుకున్నారా?
 నిత్యామీనన్: నాకేదైనా వంక చెప్పాలంటే ‘హైట్’ గురించి మాట్లాడతారు. అంతకుమించి నన్ను ఏ విషయంలోనూ వంక పెట్టలేరు. సో.. అది ఆనందమే. అయినా హైట్ ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ‘రుద్రమదేవి’లో నేనో కీలక పాత్ర చేస్తున్నాను. అప్పుడు అనుష్కతో మంచి స్నేహం ఏర్పడింది. అనుష్క నాతో ఏమన్నదంటే ‘మంచి హైట్ ఉంటేనూ విమర్శిస్తారు.. హైట్‌గా లేకపోతేనూ విమర్శిస్తారు. లావుగా ఉంటే లావంటారు.. సన్నగా ఉంటే సన్నం అంటారు. ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటారు. పట్టించుకోకూడదు’ అని చెప్పింది. అది కరెక్టే కదా. హైట్ గురించి వదిలేయండి. నాలో ఇంకా చాలా పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదా. వాటి గురించి ఎవరూ మాట్లాడరు. అయినా ఎత్తు, పొట్టి, అందం.. ఇవన్నీ ఇచ్చేది ఆ దేవుడు. దాని గురించి ఎవరూ మాట్లాడకూడదు. కానీ, ప్రవర్తన అనేది మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి, అది సరిగ్గా లేకపోతే విమర్శించాలి. అంతేకానీ, దేవుడు ఇచ్చినవాటిని విమర్శించకూడదు... పశ్చాత్తాపపడకూడదు.
 
 ఎవరూ మీకు ‘ఐ లవ్ యు’ చెప్పలేదా?
 నిత్యామీనన్: నాకు లవ్ లెటర్స్ మాత్రం రాలేదు. ఐ లవ్యూలు చెప్పిందీ తక్కువే. ఎందుకంటే, నేనెప్పుడూ సీరియస్‌గా ఉంటాను కాబట్టి భయపడతారు.
 
 మీరెవరితోనూ ప్రేమలో పడలేదా?
 నిత్యామీనన్: పడ్డాను. కానీ, అతనితో జీవితం గొప్పగా ఉండదనిపించింది. అందుకని విడిపోయాను.
 
 అది ఏ వయసులో జరిగింది?
 నిత్యామీనన్: 18 ఇయర్స్‌లో. అప్పుడు మినహా ఆ తర్వాత ఎప్పుడూ ప్రేమలో పడలేదు.
 
 తొలి ప్రేమ ఫెయిల్యూర్‌ని తట్టుకోవడం అంత ఈజీ కాదంటారు?

 నిత్యామీనన్: నిజమే. కానీ, ఆ సమయంలోనే నేను ‘అలా మొదలైంది’ ఒప్పుకున్నాను. ఆ సినిమాతో బిజీ అవ్వడంవల్ల ఆ బాధను అధిగమించగలిగాను.
 
 పబ్‌కి ఎప్పుడైనా వెళ్లారా?

 నిత్యామీనన్: నాకంత టైమ్ లేదు. నేను మందు తాగను. ఎప్పుడైనా టైమ్ దొరికితే ఇంట్లోనే ఉంటాను. మంచి పుస్తకాలు చదువుతాను.
 
 మళ్లీ జన్మంటూ ఉంటే నిత్యాలానే పుట్టాలనుకుంటారా?
 నిత్యామీనన్: లేదు. ఈ జన్మకి నిత్యా ఎలా ఉంటుందో తెలుసుకున్నాను కదా. అందుకని, వేరేవాళ్లలా పుట్టాలనుకుంటున్నాను.
 
 - డి.జి. భవాని
 
  అప్పట్లో ప్రభాస్ ఎవరో తెలియదని చెప్పారు. ఇప్పుడు తెలిసిందా?

 నిత్యామీనన్: తెలుగు పరిశ్రమకు వచ్చీ రావడంతోనే అందరూ తెలియరు కదా. అప్పట్లో ప్రభాస్ గురించి నా దగ్గర ప్రశ్న అడిగితే.. ‘ఆయనెవరు’ అన్నాను. దాంతో నాకు పొగరు అని కొంతమంది అన్నారు. ప్రభాస్ కూడా ఫీలవ్వలేదనుకుంటా. తెలుగు సినిమాలు బాగా చేయడం మొదలుపెట్టిన తర్వాత ప్రభాస్ ఎవరో తెలిసింది. తను యాక్ట్ చేసిన ‘మిర్చి’ సినిమా చూశాను. అలాగే, ‘గుండె జారి గల్లంతయ్యిందే’ ఫంక్షన్‌కి ఆయన వచ్చారు. అప్పుడు మాట్లాడాను.
 
 మీ కుటుంబంలో ఎడ్యుకేషన్‌కి ఇంపార్టెన్స్ ఇస్తారని అన్నారు కదా.. మరి.. మీరు హీరోయిన్ అయినందుకు ఏమంటున్నారు?
 నిత్యామీనన్: మా అమ్మమ్మ అయితే ‘ఈ సినిమాలు వదిలెయ్. చక్కగా ఏదైనా చిన్న జాబ్ చేసుకో’ అంటుంది. నాకెంత పాపులార్టీ ఉందో తనకు తెలియదు. మా కుటుంబంలో ఎవరూ నా పాపులార్టీని తెలుసుకోవాలని కూడా అనుకోవడంలేదు. అందుకే, ఇంట్లో ఉన్నప్పుడు నేను మామూలు అమ్మాయిలానే ఉంటాను.
 
 మీరు బెంగళూరులో ఉంటారా?

 నిత్యామీనన్: అవును. నేను పుట్టింది, పెరిగింది బెంగళూరులోనే. కేరళతో నాకు పెద్దగా ఎటాచ్‌మెంట్ లేదు. కానీ, నా మాతృభాష మలయాళమే. మూడు తరాల నుంచి మా కుటుంబానికి చెందినవాళ్లు బెంగళూరులోనే ఉంటున్నారు.
 
 మీ ఫేవరెట్ ప్లేస్?

 నాకు స్పెయిన్ చాలా ఇష్టం. ఇప్పటివరకు వెళ్లింది లేదు. నేను స్పానిష్ లాంగ్వేజ్‌ని ఇష్టపడుతున్నా. అది నేర్చుకుంటున్నాను. జనరల్‌గా నేను ఇతర దేశాల సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకుంటుంటాను. అలా తెలుసుకున్నప్పుడే స్పెయిన్  మీద ఇష్టం ఏర్పడింది.
 

మరిన్ని వార్తలు