కీటో డైట్‌తో గుండెకు చేటు

7 Mar, 2019 13:38 IST|Sakshi

లండన్‌ : కొవ్వును కరిగించి స్ధూలకాయాన్ని తగ్గించేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన కీటో డైట్‌పై తాజా అథ్యయనం బాంబు పేల్చింది. కార్బొహైడ్రేట్లను ఆహారంలో తగ్గించే ఈ డైట్‌ ద్వారా గుండె జబ్బులు, స్ర్టోక్‌ ముప్పు అధికమని అథ్యయనం హెచ్చరించింది. సెలబ్రిటీలు సైతం వాడుతున్న కీటో ఆహారంతో గుండెకు చేటేనని సర్వే తేల్చింది. ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించడం గుండె ఆరోగ్యానికి మంచిది కాదని వెల్లడించింది.

కీటో ఆహారంలో భాగంగా ధాన్యాలు, పండ్లు, కూరగాయలను తగ్గించడం ద్వారా గుండెకొట్టుకునే వేగం లయతప్పుతుందని, ఇది గుండె పోటు వంటి తీవ్ర అనర్ధాలకు దారితీస్తుందని తమ అథ్యయనంలో తేలిందని పరిశోధకులు వెల్లడించారు. బరువు తగ్గే క్రమంలో పాటిస్తున్న కీటో డైట్‌పై జాగ్రత్తగా వ్యవహరించాలని వైద్య నిపుణులకు అథ్యయన రచయిత సన్‌ యాట్‌-సేన్‌ యూనివర్సిటీ, చైనాకు చెందిన కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ జుంగ్‌ సూచించారు.

కార్బోహైడ్రేట్‌ల స్ధానంలో ప్రొటీన్‌, కొవ్వు పదార్ధాలు తీసుకున్నప్పటికీ కార్బోహైడ్రేట్‌లు తక్కువగా ఉండే ఆహారంతో గుండె కొట్టుకునే వేగం లయ తప్పుతుందని తమ అథ్యయనంలో వెల్లడైందని ఆయన చెప్పారు. 14,000 మంది ఆహారపు అలవాట్లను రెండు దశాబ్ధాల పాటు పరిశీలించిన అనంతరం పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు