తక్కువ ఖర్చు.. వెంటనే నీటి భద్రత!

17 Jul, 2018 04:06 IST|Sakshi
భగవంతరెడ్డి భూమిలో కందకాలు

చిన్న రైతుల భూముల్లో ప్రభుత్వమే కందకాలు తవ్వించాలి: భగవంతరెడ్డి

మెట్ట భూముల్లో ప్రతి 50 మీటర్లకు ఒక వరుసలో.. మీటరు లోతు మీటరు వెడల్పున.. కందకాలు తవ్వుకోవడం వల్ల.. అతి తక్కువ ఖర్చు (ఎకరానికి రూ. 2–3 వేల)తో తవ్విన కొద్ది నెలల్లోనే సాగు నీటి భద్రత సాధించవచ్చని నల్లగొండ మండలం గుళ్లపల్లి గ్రామానికి చెందిన రైతు, విశ్రాంత ప్రిన్సిపల్‌ పాలవరపు భగవంతరెడ్డి అనుభవపూర్వకంగా చెబుతున్నారు. రైతుల సంక్షేమం కోసం భారీగా ఖర్చు పెడుతున్న ప్రభుత్వాలు చిన్న రైతుల మెట్ట భూముల్లో కందకాలు తవ్విస్తే ఎంతో మేలు జరుగుతుందని ఆయన సూచిస్తున్నారు.

నల్లగొండకు 5 కి.మీ. దూరంలోని తమ 13 ఎకరాల ఎర్ర భూమిలో తవ్విన రెండు బోర్లకు నీటి లభ్యత తక్కువగా ఉండటంతో తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగెం చంద్రమౌళి(98495 66009), మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి(99638 19074)లను 2016 జూన్‌లో భగవంతరెడ్డి సంప్రదించారు. వారు స్వయంగా పొలానికి వచ్చి వాలుకు అడ్డంగా కందకాలు తవ్వించారు. 13 ఎకరాలకు కలిపి రూ. 30 వేలకన్నా తక్కువే ఖర్చయింది. 2016 వర్షాకాలంలో కందకాలు 4,5 సార్లు నిండాయి.

కందకాలు తవ్విన 3,4 నెలల్లోనే భూగర్భ జలమట్టం బాగా పెరిగిందని భగవంతరెడ్డి తెలిపారు. 2017 వర్షాకాలంలో కూడా కందకాలు 2,3 సార్లు నిండాయి. దీంతో ఎండాకాలం కూడా నీరు పుష్కలంగా ఉండటంతో నిశ్చింతగా కూరగాయ తోటలను సాగు చేస్తున్నారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో పక్కన పొలంలో వరి సాగు చేస్తున్న రైతుల బోర్లలో నీరు రాక పొలం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రెండు నెలల పాటు తమ బోర్ల నుంచే నీటిని ఉచితంగా ఇచ్చామని, ఆ రైతుకు మంచి దిగుబడి రావడం తమకూ సంతోషాన్నిచ్చిందని వివరించారు.

ఈ ఏడాది తమ ఇరుగు పొరుగు రైతుల బోర్లలో కూడా నీటి లభ్యత పెరిగిందని ఆయన సంతోషంగా చెప్పారు. ఇది తమ పొలంలో తవ్విన కందకాల వల్ల భూగర్భంలోకి ఇంకిన వర్షపు నీటి వల్లనే సాధ్యపడిందన్నది నూటికి నూరు శాతం వాస్తవమన్నారు. అయితే, రైతులకు కందకాలతో వర్షపు నీటి సంరక్షణపై అవగాహన లోపించిందని, చిన్న రైతుల భూముల్లో ప్రభుత్వమే కందకాలు తవ్వించడం చాలా అవసరమని భగవంతరెడ్డి(94404 05082) సూచిస్తున్నారు.


            భగవంతరెడ్డి

మరిన్ని వార్తలు