కాశీకి పోయాను రామాహరి...

2 Jun, 2015 23:41 IST|Sakshi
కాశీకి పోయాను రామాహరి...

అబద్ధంలో ఆకర్షణ ఉంటుంది. అందుకే మనుషులు అబద్ధాల మాయలో పడిపోతారు. ఏ కొందరో ఆ అబద్ధాల నిగ్గు తేలుస్తారు. ‘ఇదీ నిజం’ అని చెప్పడానికి దీక్ష పూనుతారు. అబద్ధాలపై సమరశంఖం పూరిస్తారు.అబద్ధాల్లోని డొల్లతనాన్ని కనిపెట్టి చెప్పేవారు పక్కన లేకపోతే ఎంతటివారైనా బొక్కబోర్లా పడవలసిందే. ‘అప్పు చేసి పప్పు కూడు’ (1958) సినిమాలో పాట ఒకటి ఉంది. అందులో రేలంగి చెప్పేవన్నీ అబద్ధాలే. ఆయన శిష్యురాలు పక్కనే ఉండి నిజం చెప్పబట్టి అమాయక ప్రజలు ఆ మాయ నుంచి బైటపడతారు. ‘కాశీకి పోయాను రామాహరి... గంగ తీర్థమ్ము తెచ్చాను రామా హరి’ అంటాడు రేలంగి. ‘కాశీకి పోలేదు రామాహరి... ఊరి కాల్వలో నీళ్లండి రామాహరి’ అని గిరిజ చెబుతుంది.

అంతటితో ఊరుకోడు రేలంగి. ‘శ్రీశైలం వెళ్లాను రామాహరి... శివుని విభూతి తెచ్చాను రామాహరి’ అంటాడు. గిరిజ మాత్రం ఊరుకుంటుందా! ‘శ్రీశైలం పోలేదు రామాహరి... ఇది కాష్ఠంలోని బూడిద రామాహరి’ అంటుంది. రేలంగి అబద్ధాలు అక్కడితో ఆగవు.
 ‘అన్నమక్కరలేదు రామాహరి... నేను గాలి భోంజేస్తాను రామాహరి’ అంటాడు. ‘గాలితోపాటు రామాహరి... వీరు గారెలే తింటారు రామాహరి... నేతి గారెలే తింటారు రామాహరి’... అని గిరిజ అంటుంది. రేలంగి గుర్రున చూస్తాడు. ఇక లాభం లేదనుకుని... ‘కైలాసం వెళ్లాను రామాహరి... శివుని కళ్లార చూశాను రామాహరి’ అంటాడు.‘కైలాసం వెళితేను రామాహరి... నంది తన్ని పంపించాడు రామాహరి’ అని గిరిజ అసలు సంగతి బయటపెడుతుంది. 57 ఏళ్ల క్రితం పింగళి నాగేంద్రరావు రాసిన ఈ పాట... ఇప్పుడున్న కొందరు లీడర్ల  అబద్ధాలకూ చక్కగా సూట్ అవుతుంది!
 

మరిన్ని వార్తలు