‘రజనీగంధ’ కవి యోగేష్‌ మృతి

30 May, 2020 00:24 IST|Sakshi

నివాళి

‘రజనీగంధ’ సినిమా గుర్తుందా? అందులోని ‘రజనీగంధ ఫూల్‌ తుమ్హారే’ పాట ఇప్పటికీ సంగీత ప్రియులకి ఎంతో ఇష్టమైనది. రాజేష్‌ ఖన్నా నటించిన ‘ఆనంద్‌’ సినిమా తెలుసు కదా. అందులో ముఖేశ్‌ పాడిన ‘కహీ దూర్‌ జబ్‌ దిన్‌ ఢల్‌ జాయే’ పాటను ఎందరో ఇప్పటికీ కూనిరాగం తీస్తూనే ఉంటారు. ఇక ‘ఛోటీసి బాత్‌’లో లతా పాడిన ‘నా జానే క్యూ’ టైటిల్‌ సాంగ్‌ ప్రతి రెండోరోజూ రేడియోలో వస్తూనే ఉంటుంది. ఈ అన్ని పాటలు రాసిన సుప్రసిద్ధ సినీ గీత రచయిత యోగేష్‌ (77) నేడు ముంబైలో తుదిశ్వాస విడిచాడు. తక్కువ పాటలు రాసినా రాసినవి నిక్కమైన నీలాలు అని యోగేష్‌ పేరు పొందాడు.

హిందీ పాటలలో సాధారణంగా మజ్రూ సుల్తాన్‌పురి, కైఫీ ఆజ్మీ, హస్రత్‌ జైపురి వంటి ఉర్దూ కవుల ప్రభావం ఎక్కువ. పాటలలో ఉర్దూపదాల వాడకం కూడా ఎక్కువ. కాని యోగేష్‌ తన పాటలలో హిందీపదాల ఉపయోగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవాడు. పొదుపైన పదాలతో పాటలు రాసేవాడు. లక్నోకు చెందిన యోగేష్‌ తండ్రి మరణంతో 18 ఏళ్ల వయసులో ముంబై చేరుకుని సినీ రంగంలో పాటల రచయితగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. జూనియర్‌ ఆర్టిస్టుగా నటించాడు. చాలాకాలం ఆయన మురికివాడల్లోనే ఒక గుడిసెలో నివసించాడు.

ఆయనతోపాటు లక్నో నుంచి వచ్చిన మిత్రుడొకడు తాను సంపాదిస్తూ మిత్రుణ్ణి ఎలాగైనా సినీ రచయితగా చూడాలని సంకల్పించడంతో యోగేష్‌ కవిగా నిలదొక్కుకున్నాడు. సంగీత దర్శకుడు సలీల్‌ చౌదరి ఎక్కువగా యోగేష్‌ను ప్రోత్సహించాడు. ఆయన సంగీతంలో యోగేష్‌ రాసిన ‘కహి బార్‌ యూ భీ దేఖాహై’ (రజనీగంధ) పాడి గాయకుడు ముఖేశ్‌ జాతీయ పురస్కారం పొందాడు. ఎస్‌.డి.బర్మన్, రాజేష్‌ రోషన్‌ తదితర సంగీతదర్శకులు యోగేష్‌ సృజనను ఉపయోగించుకున్నవారిలో ఉన్నారు. ‘మిలి’, ‘బాతో బాతోం మే’, ‘మంజిల్‌’, ‘అన్నదాత’ తదితర సినిమాలలో యోగేష్‌ పాటలు రాశాడు. నలుగురిలో చొచ్చుకుపోయే అలవాటు లేకపోవడం వల్ల ఆయనకు ఎక్కువ పాటలు రాలేదన్న వ్యాఖ్య ఉంది.

యోగేష్‌ గత 15 సంవత్సరాలుగా ఒంటరిగా ముంబైలో జీవిస్తున్నాడు. ఆయన భార్య ఆయనతో 30 ఏళ్ల క్రితమే విడిపోయింది. ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడు. వారు కూడా తండ్రిని పెద్దగా చూడలేదు. సత్యేంద్ర త్రిపాఠి అనే గాయకుడు ఆయన బాగోగులు చూస్తూ వచ్చాడు. ఆయన ద్వారానే యోగేష్‌ మరణవార్త లోకానికి తెలిసింది. యోగేష్‌ పట్ల గాయని లతా మంగేష్కర్‌కు అమిత అభిమానం ఉంది. ‘ఆయన రాసిన చాలా మంచి పాటలు నేను పాడాను. ఆయన మరణవార్త విని బాధ కలిగింది. ఆయన శాంత స్వభావం ఉన్నవాడు. ఆయనకు నా శ్రద్ధాంజలి’ అని ఆమె ట్వీట్‌ చేసింది. యోగేష్‌ను సినిమా ఇండస్ట్రీ ఎప్పుడో మర్చిపోయింది. కాని ఆయన పాటలు మాత్రం అభిమానులకు ఎప్పటికీ గుర్తుంటాయి.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా