పంట్లామా మజాకా!

3 Nov, 2019 04:08 IST|Sakshi

ఏరా పోరగా! యాడికి పోయినావు...అని తిట్లు తిడుతుంది పొయ్యి కాడ నుంచి అమ్మ. ఎదురు మాట్లాడితే ఇంకా తిడుతుంది అని ఏమీ మాట్లాడకుండా  ఒళ్ళంతా దుమ్ముతో పొయ్యి కాడ ఉన్న అమ్మ దగ్గరకు పోయా. ఇంట్లో నుంచి మూలుగుతున్న శబ్దాలు పొయ్యి కాడ ఉన్న నా చెవుల్లోకి చేరుతున్నాయి. మూలిగేది మా నాన్నే. లేచి పొయ్యి కాడ నుంచి గుమ్మం దగ్గరకు పోయి దీపాన్ని ఓ చేతితో పట్టుకొని ఆరి పోకుండా మరో చేతిని అడ్డు పెట్టుకుంటూ ఎదురుగా ఉన్న బస్తా కేసి నా కాళ్లను తుడుచుకొని నాన్న పడుకొని ఉన్న మంచం దగ్గరకు పోయా. నాన్న బక్క శరీరాన్ని చూడగానే తెలీకుండానే నీళ్లు కన్నుల్లో తిరిగాయి. ముడుచుకుపోయిన మొహంతో గుండెల వరకు దుప్పటి కప్పుకొని పడుకొని మూలుగుతున్నాడు. నాన్నతో ఏమీ మాట్లాడకుండానే కన్నీళ్లని దిగమింగి దీపాన్ని తీసుకువచ్చి గుమ్మం ముందు పెట్టా. పొయ్యి కాడ కూర్చున్న అమ్మ దగ్గరికి పోయి, పొయ్యిలో నుంచి వేడి సెగలకు చేతులు అడ్డు పెట్టుకుంటూ ‘నాన్నకు ఏమైంది?’ అని అడిగా.

అప్పటివరకు నేను అమ్మమ్మ ఇంటి దగ్గరే ఉండే వాడిని, ఇంటికి వచ్చే వాడిని కాదు. అందుకే తెలీదు నాన్నకు ఏమైంది అనేది. ‘మీ అయ్యా మన చేనుకు నీళ్లు పెట్టాలని వెళ్లి కరెంటు స్తంభం ఎక్కి కరెంటు లైన్‌ వేసాడు, కరెంటు కొట్టి కింద పడ్డాడు కాకి పడ్డట్టు. అప్పటికి నువ్వు కడుపులోనే ఉన్నావు. డాక్టర్‌కి చూపెడితే మందులతోనే బతికించడం అని అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలాగే ఉన్నాడు. నొప్పి మాత్రలు వేసుకుంటే కాసేపు బాగానే ఉంటాడు’ పాత చేదు జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ చెబుతుంది అమ్మ. నేనేమో కథ విన్నట్టు వింటున్నాను నోరు తెరిచి. నాన్నకు కాళ్ల నొప్పులు ఎక్కువ కావడంతో అమ్మ డాక్టర్‌ దగ్గరికి వెళ్ళింది. నేను స్నానం చేసి ప్యాంట్‌ కోసం వెతుకుతున్న. బట్టల మూటలో అడుగున దాక్కున్న నా ప్యాంటుని తీసి వేసుకున్న.

రెండు కాళ్ల మధ్యలో గాలి చొరబడి చల్లగా తొడలకు తగులుతూ ఉంది. చూస్తే ప్యాంట్‌ చినిగి ఉంది. అప్పటికే నాలుగైదుసార్లు మిషన్‌ కాడ కుట్టించ ఆ ప్యాంటును. నేను ఆడే ఆటల్లో దూకుడికి అది తట్టుకోలేక పోతుంది పాపం. బడికి లేట్‌ అవుతుందని చిరిగిన కాడ పిన్నీసులు పెట్టుకుని బడికి వెళ్లాను. ఫిజిక్స్‌ పంతులు యూనిట్‌ టెస్ట్‌ మార్కులు దగ్గరకు పిలిచి మరీ ఇస్తున్నాడు. నాకు ఆయన దగ్గరకు వెళ్లాలంటే భయం. ప్యాంట్‌కు పెట్టుకున్న పిన్నీసు ప్రేయర్‌లో ఎక్కడో వూడి పడిపోయింది. బహుశా నా ప్యాంట్‌కు ఉండటం ఇష్టం లేదేమో. క్లాసులో ఎవరైనా చూస్తే నా పరువు పోతుందని నా పరీక్ష పేపర్‌ రాకుంటే బాగుండు అనుకున్న. ఫిజిక్స్‌ పంతులు నా పేరు పెట్టి పిలిచాడు. అది నా పరీక్ష పేపరే. ఈ మాయదారి పరీక్ష పేపర్‌ ఇప్పుడే రావాలా అని తిట్టుకుంటూ పంతులు దగ్గరకి పోయా. నేను కవర్‌ చేసుకుంటున్న ప్యాంట్‌ను చూసి ‘మార్కులు అయితే బాగా వచ్చాయి కానీ చిరిగిన ఫ్యాంట్‌ వేసుకున్నావు ఏంట్రా ఎదవా!’ అన్నాడు. అంతే ఆ మాటకు క్లాసులో వాళ్ళంతా నవ్వారు. ‘నా పరువు అంతా పోయింది’ అనుకుంటూ కళ్ళల్లోని నీళ్లను పంతులికి చూపించలేక తల కిందికి వేసా. ‘మీ నాన్న ఏం చేస్తాడు రా? మంచి ప్యాంట్‌ కొనమని వచ్చుగా!’ అన్నాడు. రాత్రి మంచంపై మూలుగుతున్న నాన్న దృశ్యాలే నాకు జ్ఞాపకం వచ్చాయి.

ఆయనకు ఆరోగ్యం బాగా లేదని అందరి ముందు చెప్పలేక పోతున్నాను. ‘ఏంట్రా మాట్లాడు’ అంటూ గట్టిగా గద్దించాడు పంతులు. గొంతులోని మాటలను కన్నుల్లోనీ నీళ్లు ఆపుకోలేక చెప్పా మా నాన్న పరిస్థితి బాగోలేదని. కన్నీటిబొట్లు కాలు మీద పడుతున్నాయి. నన్ను చూస్తున్న ఆయన ‘నేను కూడా చిన్నప్పుడు ఇలాగే వేసుకునేవాడిని ప్యాంట్లు. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు’ అని కళ్లకు కట్టినట్టు తన జ్ఞాపకాలను చెబుతున్నాడు. నిశ్శబ్దంగా ఉంది క్లాసు. అది వింటున్న అందరి మొహాల్లో తెలియని బాధ కనబడుతుంది. సరిగ్గా బట్టలు లేకపోవడంతో ఊళ్లో ఫంక్షన్లకు కూడా వెళ్ళే వాడిని కాదు. క్లాసులో పోయినట్టు ఊర్లో కూడా నా పరువు పోతుందని. కొత్త ప్యాంట్‌ కొనుక్కోవాలని అమ్మను అడిగితే ‘అన్నయ్య ప్యాంటు వేసుకో. డబ్బుల్లేవు. పంట వచ్చాక ఇద్దరికి కొంటా లే’ అంది అమ్మ.

అమ్మ కూలికి వెళ్తే వచ్చే డబ్బులు, పండిన పంటకు వచ్చే డబ్బులు ఇంట్లో అప్పులకి, నాన్న మందులకి సరిపోతాయి. కొత్త ప్యాంట్‌ కొనుక్కోవడానికి డబ్బులు మిగలవు ఇంట్లో. గవర్నమెంట్‌ వాళ్ళు ఇచ్చే యూనిఫామ్‌తో అన్నయ్య ప్యాంట్లతో పదో తరగతి వరకు చదువుకున్న. పది పాస్‌ అయ్యాక ఎండాకాలం సెలవుల్లో పనికి పోయి కొన్ని డబ్బులు పోగేసుకున్న. ఆ డబ్బుతో ప్యాంట్లు కొనుక్కుని ఇంటర్మీడియట్‌ గవర్నమెంట్‌ కాలేజీలో చేరా. అప్పటివరకు చిరిగిన ప్యాంట్‌తో బాధపడ్డ నేను కొత్త ప్యాంట్‌ వేసుకొని కాలేజీకి పోతున్న.

ఓరోజు ఇంగ్లీషు పంతులు అన్ని గ్రూపుల వాళ్ళను కలిపి పెద్ద క్లాసులో కూర్చోబెట్టాడు. నేను నా సహవాస గాడు గోపి ఎప్పుడూ కూర్చునే వెనక బెంచీలో కూర్చున్నాము. క్లాస్‌ అంతా నిండిపోయింది. అందరినీ స్టేజి కాడికి పిలిచి సన్నగా ఉన్న ఇంగ్లీష్‌ పీసు బుక్‌ ఇచ్చి పెద్దగా అందరికి వినబడేటట్టు చదవమంటున్నాడు. వెనక కూర్చున్న మాకు ఇంగ్లీషు పీసు సరిగ్గా చదవడం రాదు. పక్కన ఉన్న నా స్నేహితుడు గోపిగాడిని పిలిచి ఇంగ్లీష్‌ చదవమన్నాడు పంతులు. స్టేజి కాడికి పోయి చదవడం మొదలుపెట్టాడు పెద్ద ఇంగ్లీష్‌ వచ్చినవాడి లాగా.‘సైకాలజీ’ అనే పదాన్ని ‘పిజికాలాజీ’ అని చదివాడు. ఒకటే నవ్వులు! ఇక నేనే చదవాల్సింది. పైకి లేవగానే ప్యాంట్‌ కిందికి జారింది. ఎందుకు జారుతుందని చూస్తే చిన్నప్పుడు అమ్మ నడుముకు కట్టిన ఎర్రని మొల తాడు తెగే ప్రమాదంలో ఉంది. ఆరోజు బెల్ట్‌ పెట్టుకోవడం మర్చిపోయా. చేసేది ఏమీ లేక ముందుకు నడిచా. నడుముకున్న ఎర్ర తాడు నిర్దయగా పుటుక్కున తెగింది. అప్పటి నా తిప్పలు తలుచుకుంటే ఇప్పటికీ నవ్వు ఆగదు!
– మారీడు వేణుగోపాల్‌రావు,
బోనకల్, ఖమ్మం జిల్లా.

మరిన్ని వార్తలు