అక్రమాల రక్షణలో ఆర్బీఐ!

29 Mar, 2019 00:44 IST|Sakshi

విశ్లేషణ

రాజ్యాంగ సంస్థలే రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తే న్యాయస్థానాలే దిక్కు. ఒకటి రెండు కేసుల్లో కోర్టు ధిక్కారనేరం కింద శిక్షలు వేయడం సాధ్యమవుతుంది కానీ, అన్ని కేసుల్లో జైలుకు పంపడం సాధ్యం కాదు కదా. ఇదంతా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గురించి. నాగరికమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు రుణాన్ని సాయంగా అందించి, పరిశ్రమలను, ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించి, నేరాలను నివారించి, జరిగితే శిక్షించి బ్యాంకింగ్‌ రుణ వితరణ వ్యవస్థను, పరిపాలనా వ్యవహారాలను క్రమబద్ధీకరించడం రిజర్వ్‌ బ్యాంక్‌ బాధ్యత.  సక్రమ వ్యాపారాలకు చేయూత అందించడం బాధ్యత. లంచాలు తీసుకుని మోసగాళ్లకు అప్పులివ్వడం కాదు. చిన్న, మధ్యతరహా భారీ పరి శ్రమలను, కార్పొరేట్లను బతకనిచ్చి వారి ద్వారా దేశాన్ని బతకనివ్వాలి. బ్యాంకులు ఆర్థిక గందరగోళాలు సృష్టిస్తూ ఇవ్వకూడని వారికి అప్పులిస్తూ, వేలకోట్ల రూపాయల అప్పులు ఎగవేస్తుంటే అడ్డుకోవలసిన రిజర్వ్‌ బ్యాంక్, వారి అప్పులు, తప్పుల కుప్పలను అత్యంత రహస్యాలుగా కాపాడడానికి ప్రయత్నించడం సంవిధాన వ్యతిరేక చర్య.  ఇది కేవలం ఆర్టీఐ సమస్య కాదు. ఇది ఆర్బీఐ వెన్నెముకకు సంబంధించిన అంశం. కేంద్రంలో ఉన్న రాజకీయ ప్రభుత్వానికి అనుబంధ, విధేయ, అనుచర, వందిమాగధ గణంగా బతకడానికి ఆర్బీఐ, అధికార పార్టీ వారి జిల్లా శాఖ కాదు. సత్ఫలితాలు, సత్‌ లక్ష్యాలున్న ఒక సువ్యవస్థ.  

ఆర్టీఐ ద్వారా ఒక పౌరుడు అడిగిన అప్పుల ఎగవేత వివరాలు ధర్మకర్తృత్వ సంబంధిత సమాచారం కనుక పరులెవ్వరికీ ఇవ్వజాలమని నీతి సూత్రాలు పలికింది ఆర్బీఐ. ఆ సమాచారం ఇమ్మంటూ కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశించింది. ఆర్బీఐ హైకోర్టుకు వెళ్లింది. స్టే తెచ్చుకుంది. తతంగం ఒక తంతుగా సుప్రీంకోర్టుకు చేరింది. జయంతిలాల్‌ కేసులో రిజర్వ్‌బ్యాంక్‌ వారికి సుప్రీంకోర్టు బోలెడన్ని మొట్టికాయలు వేసి బుద్ధి చెప్పింది. ఆ సమాచారం నీది కాదు, మూడో వ్యక్తిది కాదు, ధర్మకర్త లక్షణాలు ఒకవేళ ఉంటే అది జనం సొమ్ము కాపాడడానికి ఉపయోగించాల్సిందే కానీ, దోచు కున్న దొంగల వివరాల రక్షణకు వాడుకోరాదు. అది జాతీయ భద్రతా రహస్యం కాదు. ఆ అప్పుల ఎగవేతదారులనే ఆర్థిక నేరగాళ్ల సమాచారాన్ని రక్షించడానికి ప్రయత్నించడం అంటే నేరాలను ప్రోత్సహించడమే అవుతుంది.

ఒకవైపు రైతులు చిన్న అప్పులు తీర్చలేక తమ పొలాల్లోనే పడి ప్రాణాలు తీసుకుంటూ ఉంటే, పెద్ద పెద్ద వ్యాపారులు, కార్పొరేట్‌ గ్రద్దలు జనం సొమ్ము దండుకుని విదేశాలకు పారిపోతున్నారు. చనిపోయిన రైతుల బతుకులు బజారు పాలుచేస్తూ మరోవైపు ఘరానా గజదొంగలకు కాపలా కాయడం న్యాయం కాదని సీఐసీ హితవు చెప్పింది. సుప్రీంకోర్టు జయంతిలాల్‌ కేసులో ఆదేశించినా బ్యాంకు రుణాల ఎగవేతదారుల వివరాలు జనానికి ఇవ్వకపోవడం న్యాయం కాదని, ఈ పని పీఐఓ ద్వారా చేయించినప్పటిఎకీ, అసలు నేరం రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌దే అవుతుందని సీఐసీ గవర్నర్‌కు జరిమానా విధించే కారణవివరణ హెచ్చరిక లేఖ రాసింది. అదొక పెద్ద వార్తగా మారిందే కాని, పెద్దలకు బుద్ధి రాలేదు. మళ్లీ వారు ఈ విషయాన్ని కూడా హైకోర్టుకు తీసుకువెళ్లారు. స్టే తెచ్చుకున్నారు.  

గిరీశ్‌ మిట్టల్‌ ఆర్టీఐ చట్టం కింద డిసెంబర్‌ 2015లో ఐíసీఐసీఐ బ్యాంక్, ఆక్సిస్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాపైన ఇన్‌స్పెక్షన్‌ జరిపిన నాటి నివేదికలు ఇవ్వాలని రిజర్వ్‌ బ్యాంక్‌ను కోరారు. బాంక్‌ ఆఫ్‌ రాజస్తాన్, సహారా కంపెనీల లావాదేవీల్లో ఈ బ్యాంకులు పాల్పడిన అక్రమాలపై ఆర్బీఐ దాఖలుచేసిన కేసుల వివరాలు, ఫైల్‌ నోటింగ్స్‌ ప్రతులు ఇవ్వాలని గిరీశ్‌ మిట్టల్‌ కోరినా ఇవ్వలేదు. సుప్రీంకోర్టు దాకా విషయం వెళ్లింది. ఏ బ్యాంకుతోనూ రిజర్వ్‌ బ్యాంక్‌ ధర్మకర్త సంబంధం కలిగిలేదనీ, ప్రైవేటు లేదా పబ్లిక్‌ బ్యాంక్‌ లకు ఏ విధంగానైనా లాభాలు పెంచడానికి కృషి చేయవలసిన బాధ్యత గానీ, ధర్మం గానీ రిజర్వ్‌ బ్యాంక్‌ పైన లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు  ఎం.వై.ఇక్బాల్, సి.నాగప్పన్‌ డిసెంబర్‌ 2015లో  జయంతి లాల్‌ కేసులో చాలా స్పష్టంగా చెప్పిన విష యం సుప్రీంకోర్టు ధర్మాసనం నుంచి న్యాయమూర్తి ఎల్‌.నాగేశ్వరరావు రిజర్వ్‌ బ్యాంక్‌కు గుర్తుచేశారు. ‘మీరు అడిగిన ఈ సమాచారం దాచడానికి వీల్లేదు. ఇవ్వవలసిందే. ఆర్టీఐ నియమాలను పాటించా ల్సిందే’ అని నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వినకపోతే కోర్టు ధిక్కార నేరం కింద శిక్షకు సిద్ధంగా ఉండాలని మార్చి 27న రిజర్వ్‌ బ్యాంక్‌ ను హెచ్చరించింది. సీఐసీలో ఆర్బీఐ లేవనెత్తిన అభ్యంతరాలన్నీ తిరస్కరించారు. ఇటీవల పెద్ద నోట్ల రద్దు విషయంలో ఆర్బీఐ సమావేశంలో చేసిన తీర్మానాల వివరాలు సమాచార హక్కు చట్టం కింద ఇవ్వాలన్నపుడు ఆర్బీఐ ఇవే వాదనలను మళ్లీ లేవనెత్తింది. మళ్లీ సీఐసీ మొట్టికాయలు వేసింది. ఇది మొండితనమా లేక దురహంకారామా లేక అక్రమాలను రక్షించాలన్న తాపత్రయమా?

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త బెన్నెట్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్, కేంద్ర సమాచార శాఖ మాజీ కమిషనర్‌

మరిన్ని వార్తలు