సన్నద్ధం

25 Jul, 2018 00:41 IST|Sakshi

ఈ అమ్మాయిని చూడండి. ప్రెట్టీగా ఉంది కదా! కానీ పేరేమిటో తెలీదు. సోషల్‌ మీడియాలో గత రెండు రోజులుగా ‘పత్లీ చోక్రీ’ గాప్రశంసలు అందుకుంటోంది. çపత్లీ చోక్రీ అంటే ‘సన్నటి పిల్ల’ అని అర్థం. అయితే ఈ అమ్మాయి ఇప్పుడు ‘పత్లీ’గా లేదు. ఒకప్పుడు ఉండేది. అప్పుడు అందరూ తనపై ప్రశంసల పూలజల్లులు కురిపించారు. అయితే మరీ సన్నగా ఉండడం అనారోగ్యమే తప్ప అందంగా కాదని ఆమె గ్రహించింది. ఆ గ్రహింపును ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌గా పెట్టింది! సన్నబడాలని కోరుకునే టీనేజ్‌ ఆడపిల్లలకు పనికొచ్చే పోస్ట్‌ ఇది. అందుకే ఈ పోస్ట్‌కు ‘హ్యూమన్స్‌ ఆఫ్‌ బాంబే’ అనే ప్రముఖ సోషల్‌సైట్‌ ప్రాచుర్యం కల్పిస్తోంది. ఇంతకీ ఈ ‘పత్లీ చోక్రీ’ రాసిన పోస్ట్‌లో ఏముంది?! టీనేజ్‌ గర్ల్స్‌ని ఈమె దేనికి సన్నద్ధం చేస్తోంది?  

‘‘నాకప్పుడు పందొమ్మిదేళ్లు. టైఫాయిడ్‌ జ్వరంతో మూడు వారాలపాటు మంచం పట్టాను. ఒక్కసారిగా పదకొండు కిలోల బరువు తగ్గిపోయాను. జ్వరం నుంచి కోలుకుని కాలేజ్‌కి వెళ్తున్నాను. స్నేహితులంతా ఆశ్చర్యంగా చూశారు నన్ను. ‘ఏయ్‌! ఏం చేశావ్‌’ అని సంభ్రమంగా అడిగారు కొందరు. ‘చేయడానికి ఏముంది?’ ఆ ప్రశ్న అర్థం కాలేదు మొదట్లో. ‘ఎంత స్లిమ్‌గా ఉన్నావో తెలుసా, ఏ జిమ్‌కెళ్లావు’ అంటూ ప్రశంసలతో కూడిన ప్రశ్నలు. నిజమా! అంత బాగున్నానా... నాకూ విచిత్రంగానే అనిపించింది. ‘టైఫాయిడ్‌ జ్వరం వచ్చింది’ అని నేను మాట పూర్తి చేసే లోపు వాళ్లంతా నోళ్లు వెళ్లబెట్టారు. ‘ఎంత అదృష్టమో నీది’ అని! జిమ్‌కెళ్లి వర్కవుట్లు చేసే పనిలేకుండా బరువు తగ్గినందుకు ఒకటే పొగడ్తలు. నాలో కూడా ఆసక్తి మొగ్గతొడిగింది. అప్పుడు నా బరువు 41 కిలోలు. ఇక ఏ మాత్రం బరువు పెరగకూడదనుకున్నాను. 

రోజూ వాంతి చేసుకోవడమే. నిజమే! భోజనం చేయడం, బాత్‌రూమ్‌లోకి వెళ్లి గొంతులో వేళ్లు పోనిచ్చి తిన్నది వాంతి చేసుకోవడం నా డైలీ రొటీన్‌. పత్లీ చోక్రీ (సన్నటి అమ్మాయి) అని ఎవరైనా అంటుంటే తల మీద నాకేదో కిరీటం పెట్టినట్లుండేది. అలా రెండేళ్లు గడిచిపోయాయి. వందగ్రాములు కూడా బరువు పెరగకుండా మెయింటెయిన్‌ చేశాను ఆ రెండేళ్లలో. అప్పుడు తెలిసింది అదొక మానసిక సమస్య అని. బరువు పెరుగుతామనే భయంతో తిన్న అన్నాన్ని వాంతి చేసుకునే వ్యాధిని ‘బులీమియా’ అంటారని. అప్పుడు తొలిసారిగా నా ఆరోగ్యం గురించి బెంగ పట్టుకుంది. ఇంట్లో పెద్దవాళ్లతో చెప్పాను. డాక్టర్‌కు చూపించారు నన్ను. అప్పటి నుంచి భోజనం చేసిన తరువాత నన్ను బాత్‌రూమ్‌లోకి వెళ్లనివ్వకుండా కాపు కాశారు ఇంట్లో వాళ్లంతా. నా వంతు ప్రయత్నంగా ఆహారం పరిమాణాన్ని కొంచెం కొంచెంగా పెంచుకుంటూ పోయాను. నేను కోల్పోయిన బరువును తిరిగి పొందాను. పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నా దేహాకృతిని ఉన్నదున్నట్లుగా స్వీకరించడం నేర్చుకున్నాను. సన్నదనం మీద నా వ్యామోహం ఇంకా కొనసాగి ఉంటే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురయ్యేవో తలుచుకుంటే భయమేస్తోంది’’.. అని 22 ఏళ్ల ముంబయి అమ్మాయి ఫేస్‌బుక్‌లో తన అనుభవాన్ని స్నేహితులతో పంచుకుంది. 

కౌన్సెలింగ్‌ కూడా ఇస్తోంది
ఇప్పుడామె ‘బాడీ ఇమేజ్‌’ కారణంగా మానసిక ఆందోళన పడుతూ, డిప్రెషన్‌కు లోనయ్యే వారికి కౌన్సెలింగ్‌ ఇస్తోంది. అమ్మాయిలకు ఆమె చేస్తున్న సూచన ఒక్కటే. ‘మనమేమీ సినిమాల్లో నటించడం లేదు, పత్రికల కవర్‌ పేజీకి పోజులివ్వడమూ లేదు. అలాంటప్పుడు దేహాకృతి నాజూకుగా ఉండాలనే కోరిక అర్థం లేనిది. బాడీ ఫిజిక్‌ కోసం గంటలు గంటలు సమయం కేటాయించాలంటే ఉద్యోగాలతో సాధ్యమయ్యే పని కాదు. స్థూలకాయంతో అనారోగ్యాల పాలు కాకుండా జాగ్రత్త పడితే చాలు. బొద్దుగా ఉంటే ఆందోళన పడాల్సిన అవసరమే లేదు’ అని చెప్తోంది. ఆమె సోషల్‌ మీడియాలో చెప్పిన మంచిమాటలను ప్రధాన స్రవంతి మీడియా అందిపుచ్చుకుంది. కానీ ఆమె పేరు మాత్రం పత్లీ చోక్రీగానే ఉండిపోయింది.

నవ్వులో నీరసం.. ఓ లక్షణం
టీనేజ్‌ అమ్మాయిల్లో పాతికశాతం మంది ఈటింగ్‌ డిజార్డర్‌తో బాధపడుతున్నారు. కొంతమంది సరిగా తినకుండా ‘అనెరొక్సియా నెర్వోజా’ బారిన పడుతుంటే, మరికొందరు తిన్న తర్వాత పావు గంట లోపే (అది జీర్ణమై శక్తిగా ఒంటికి పట్టే అవకాశం ఇవ్వకుండా) వాంతి చేసుకుంటూ ‘బులీమియా’ బారిన పడుతున్నారు. పలకరిస్తే నీరసంగా నవ్వడం, ఎక్కువ మాట్లాడే ఓపిక లేక పొడి పొడిగా మాట్లాడి సరిపెట్టుకోవడం, ఎక్కువ సేపు ఒక పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి వీళ్లలో కనిపించే లక్షణాలు. అందం అనేది సన్నగా ఉండడంలో ఉండదని, ఆరోగ్యంగా ఉండడంలోనే ఉంటుందని తెలియచెప్పడానికి ఇప్పుడు డాక్టర్లు, సైకాలజిస్టులు కూడా పత్లీ చోక్రీ కేసునే ఒక ఉదాహరణగా చూపిస్తున్నారు.
– మంజీర

మరిన్ని వార్తలు