మానుకైనా వస్తుంది

23 Jul, 2018 01:43 IST|Sakshi

కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా.. అంటారు. మానులకు వచ్చే కష్టాల గురించి మనకు తెలియక అలా అనుకుంటామేమో మరి. మానులకు కష్టాలు వస్తాయా లేదా అనే మాట అంటుంచితే మానుల వల్ల మనుషులకు వచ్చే కష్టాలు తక్కువే. ఏవో విపత్తులు, విలయాలు సంభవించి మానులు విరిగిపడితే తప్ప మనుషులకు కష్టాలు రావు. అందుకే మనిషికి కష్టం వచ్చిందంటే అది మనిషి వల్లనే అయి ఉంటుంది. ఎంత మంది మనుషులున్నారో, మనుషుల వల్ల మనుషులకు అన్ని రకాల కష్టాలు వస్తుంటాయి.

కష్టాల పాలయ్యే మనుషుల గురించి, కష్టాల పాల్జేసే మనుషుల గురించి కొత్తగా చెప్పుకోడానికి ఎప్పుడూ ఏమీ ఉండదు. ఫ్రెష్‌గా అప్పటికప్పుడు పడిపోయినప్పుడు తెలుసుకోవడమే. కష్టం అనేది చిన్న మాట. ఇందులో తీవ్రతలు ఉంటాయి. కష్టాన్ని తట్టుకునే మనిషిని బట్టి ఆ తీవ్రతలు కొద్దివో, పెద్దవో అవుతుంటాయి తప్ప, తీవ్రతకు కొలబద్ద అంటూ ఏమీ ఉండదు. బతకలేకపోవడం అన్నిట్లోకీ పెద్ద కష్టం. డబ్బు లేక బతకలేక పోవడం, ఆరోగ్యం లేక బతకలేకపోవడం, అవమానం తట్టుకోలేక బతకలేకపోవడం, ఆత్మగౌరవం దెబ్బతిని బతకలేకపోవడం.. ఇవన్నీ పెద్ద కష్టాలే. ముఖ్యంగా ఆడపిల్లలు. రక్షణ ఉండాలి వాళ్లకు. అది లేకపోవడం బతకలేకపోవడాన్ని మించిన కష్టం.

కొద్దిరోజులుగా వింటున్నాం. జగత్తుకు ఏ చీడో పట్టినట్లు అన్నీ అత్యాచారాల ఘటనలే. అడవిలో మానుల్ని కూడా వదిలిపెట్టేలా లేదు ఈ చీడ. మామూలుగా.. కష్టపడిన వాళ్లపై సానుభూతి ఉంటుంది. కష్టపెట్టినవాళ్లపై కోపం ఉంటుంది. తప్పు ఎటుందీ అని కాకుండా, కష్టం ఎటుందీ అనే దాన్ని బట్టే లోకంలో తీర్పులు ఉంటాయి. తప్పులేదు. తాత్కాలికంగా అలాంటి తీర్పులు అవసరమే. ‘జాగ్రత్తగా లేకపోవడం నీ తప్పే’ అని.. కష్టంలో ఉన్నవాళ్లను ఇంకా కష్టపెట్టలేం కదా.

అలాగని జాగ్రత్త చెప్పకుండా ఉండడం కూడా కష్టంలోకి నెట్టడమే అవుతుంది. ఒక అమ్మాయికి కష్టం వచ్చిందంటే అందులో ఆమె కొని తెచ్చుకున్న కష్టం కూడా కొంత ఉంటుందని మమతా మోహన్‌దాస్‌ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈ మాట ఎవరికీ రుచించలేదు. ‘అందమైన లోకమనీ, రంగురంగులుంటాయని’ నమ్మడం ఆడపిల్ల తప్పెలా అవుతుందని అన్నారు. నిజమే కానీ ఆ రంగుల మధ్య మగవాడి అసలు రంగును పోల్చుకోలేకపోవడం ఆడపిల్ల తప్పే అవుతుంది.           – మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు