ఫరూక్‌ అబ్దుల్లా (కశ్మీర్‌ నేత) రాయని డైరీ

18 Jan, 2020 23:56 IST|Sakshi

ఎవరో తలుపు తోసుకుని లోపలికి వస్తున్నారు! ‘‘తోయనవసరం లేదు, తెరిచే ఉంది రండి’’ అన్నాను. 
‘‘తెరిచే ఉన్నా, మీరు నిర్బంధంలో ఉన్నారు కనుక మేము తోసుకునే రావాలి ఫరూక్‌ జీ’’ అన్నాడు ఆ వ్యక్తి లోపలికి వస్తూనే. 
ఎవరా అని చూశాను. 
నవ్వుతున్నాడతను!
‘‘నాకు రెండు సందేహాలు ఉన్నాయి. మీరెవరు అన్నది ఒకటి. మీరెందుకు నవ్వుతున్నారు అన్నది ఇంకొకటి. అయితే నాకిప్పుడు అనిపిస్తోంది.. మీరెందుకు నవ్వుతున్నారో తెలుసుకుంటే మీరెవరో తెలిసిపోతుంది కాబట్టి రెండింటిలో ఒక సందేహం తీర్చుకుంటే చాలునని. చెప్పండి. మీరెందుకు నవ్వుతున్నారు?’’ అని అడిగాను. 
మళ్లీ నవ్వాడతను. 
‘‘నా ఊహకు నాకే నవ్వొచ్చింది ఫరూక్‌జీ. లోపలికి వస్తున్నప్పుడు నా మనసు ఒక దృశ్యాన్ని ఊహించుకుంది. గది మధ్యలో ఒక కుర్చీ ఉంటుంది. అందులో మీరు కూర్చొని ఉంటారు. మీ చేతులు కుర్చీకి కట్టేసి ఉంటాయి. మీ నోటికి ఒక గుడ్డ బిగదీసి కట్టి ఉంటుంది. మీకు రెండు వైపులా మరో రెండు కుర్చీలు ఉంటాయి. ఒక కుర్చీలో ఒమర్‌ అబ్దుల్లా ఉంటారు. ఇంకో కుర్చీలో మెహబూబా ముఫ్తీ ఉంటారు. వాళ్ల చేతులూ కుర్చీలకు కట్టేసి ఉంటాయి. వాళ్ల నోటికీ ఒక గుడ్డ బిగదీసి కట్టి ఉంటుంది. మీ ముగ్గురు పూర్వపు ముఖ్యమంత్రులూ ఒకరితో ఒకరు కళ్లతో మాట్లాడుకుంటూ ఉంటారు... ఇలా అని ఊహించుకున్నాను ఫరూక్‌  జీ. కానీ అలా లేరు మీరు. పక్కన ఒమర్, మెహబూబా కూడా లేరు’’ అన్నాడు!
‘‘అలాగైతే మీరు కచ్చితంగా భారతదేశపు దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచే వచ్చి ఉంటారు. నేను ఊహించినదేమిటంటే.. ఎప్పటికైనా నా కోసం వచ్చేవారు భారతదేశపు హోం శాఖ మంత్రి అమిత్‌ షా గానీ, భారతదేశపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గానీ అయి ఉంటారని! మీరు వాళ్లిద్దరూ కాదు కనుక మీరెవరన్నది, మీరేమిటన్నది నాకు ఆసక్తి లేని సంగతి’’ అన్నాను.
‘‘కానీ ఫరూక్‌జీ.. కనీసం నేను ఎందుకు వచ్చానన్న దానిపై నైనా మీరు ఆసక్తిని కనబరచడం నన్ను సంతోషపరిచే సంగతి అవుతుంది. అంతకన్నా ముందుగా మీకు నేను గుర్తు చేయబోతున్న ఒక విషయాన్ని వినేందుకు కూడా మీరు నిర్బంధంగా ఆసక్తి చూపాలి. భారతదేశపు హోం శాఖ, భారతదేశపు హోం కార్యదర్శి అని మీరు అంటున్నారు!  ‘భారతదేశపు’ అని మీరు మాటిమాటికీ అనడం మిమ్మల్ని మీరు భారతదేశం నుంచి వేరు చేసుకోవడం కానీ, మీ నుంచి భారతదేశాన్ని వేరు చేయడంగానీ అవుతుంది. ఇప్పుడు కశ్మీర్‌.. భారతదేశంలోనే ఉంది, భారతదేశం పైనో, కిందో, పక్కనో లేదు’’ అన్నాడు! 
‘‘ఎందుకొచ్చారో చెప్పండి’’ అన్నాను. 
‘‘మీకు రగ్బీ అంటే ఇష్టమేనా?’’ అన్నాడు!
ఎవరనుకుని ఎవరి దగ్గరికి వచ్చాడో!!
‘‘మీరు నన్ను ఫరూక్‌జీ అంటున్నారు కనుక నేనే ఫరూక్‌నని మీకు తెలిసే ఉంటుందని నేను భావించవచ్చా?’’ అన్నాను. 
‘‘పోనీ.. మీకు బీర్‌ ఫెస్టివల్‌ అంటే ఇష్టమేనా ఫరూక్‌జీ..? బాత్‌ ఫెస్టివల్, కాఫీ ఫెస్టివల్, కామెడీ ఫెస్టివల్, లిటరరీ ఫెస్టివల్‌. ఫుడ్‌ ఫెస్టివల్‌..?’’ అన్నాడు!!
‘‘ఇవన్నీ ఇప్పుడు ఇండియాలో జరుగుతున్నాయా.. త్రీసెవంటీని ఎత్తేశాక..’’ అన్నాను. 
‘‘ఇండియాలో కాదు ఫరూక్‌జీ.. యు.కె.లో జరుగుతున్నాయి. ఇండియాలో ఉండకుండా, యు.కె. వెళ్లిపోడానికి మీరు కనుక ఓకే అంటే మిమ్మల్ని, మీ అబ్బాయి ఒమర్‌ని విడుదల చేస్తారట. ఇంటర్నల్‌ సెక్యూరిటీ ప్రత్యేక కార్యదర్శి రీనా మిత్ర అడిగి రమ్మన్నారు’’ అని చెప్పాడతను!!
- మాధవ్‌ శింగరాజు

మరిన్ని వార్తలు