నా పాత్ర బాధపడినా... నాకు కన్నీళ్లొస్తాయి!!

22 Sep, 2015 00:36 IST|Sakshi
నా పాత్ర బాధపడినా... నాకు కన్నీళ్లొస్తాయి!!

గోదావరి తీరాన రాజమండ్రిలో పుట్టి పెరిగిన అమ్మాయి మధు. అందుకేనేమో ఆమె ముఖంలో, నవ్వులో, పలుకులో అచ్చమైన తెలుగుదనం ఉట్టి పడుతుంటుంది. టీవీ సీరియల్స్‌లో ఆమెను చూస్తుండే సీనియర్ సిటిజన్లు ఆమెలో తమ మనవరాలిని చూసుకుంటారు. ‘‘షాపింగ్‌మాల్స్‌లో కనిపించినా, బయట మరెక్కడ కనిపించినా పెద్దవాళ్లు నన్ను గుర్తుపట్టి ‘ఎంత నటన అయితే మాత్రం ఎందుకమ్మా! నిన్ను మరీ అంత ఏడిపిస్తారు’ అని బాధపడేవాళ్లు. నన్ను, నా పాత్రను అంతగా ఆదరిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంటుంది’’ అంటారు మధు.
 
తృప్తినిచ్చిన సన్నివేశం!

నాకు ఎక్కువ సంతృప్తినిచ్చిన సన్నివేశం ‘మిస్సమ్మ’లో వచ్చింది. అందులో ఇంటికి పెద్ద కూతుర్ని. చెల్లెలు పెళ్లి చేసుకుని హనీమూన్‌కెళ్లి ఉంటుంది. ప్రతి సంఘటననూ ఫోన్‌లో చెబుతూ ఉంటుంది. అదే సమయంలో ఇంట్లో తండ్రి ప్రాణాలు పోతాయి. చెల్లి అక్కడ షాపింగ్ చేస్తూ నాన్న కోసం శాలువా కొంటున్నాను, నాన్నకు చాలా బాగుంటుంది అని సంతోషంగా చెబుతూ ఉంటే, ఇక్కడ తండ్రి పార్థివ దేహం మీద శాలువా కప్పుతుంటారు.  తండ్రి పోయిన విషయం చెప్పకుండా మేనేజ్ చేయాల్సిన సీన్ అన్న మాట. గొంతులో, ముఖంలో బాధ పొంగుకొస్తుండాలి, చెల్లికి అనుమానం రాకుండా సంతోషం ధ్వనింపచేయాలి.
 
సావిత్రి... సౌందర్య!

సావిత్రి నటన, సౌందర్య కట్టుబొట్టు నాకు చాలా ఇష్టం. నేను నటిని కాక ముందు కూడా వాళ్ల నటనను బాగా ఇన్‌వాల్వ్ అయి చూసేదాన్ని. ఇప్పుడైతే ఈ పాత్రను వాళ్లయితే ఎలా చేసేవాళ్లు అనే కోణంలో సాధన చేస్తున్నాను. అది నాకు చాలా ప్లస్ అవుతోంది. ఏ రోజు ఏ సీన్ నటించాల్సి ఉంటే ఆ తరహా మేకప్, డ్రస్‌తో వెళ్లి పోతాను. పాత్రలో అంతగా ఇన్‌వాల్వ్ అవుతాను కాబట్టి గ్లిజరిన్ పెట్టకుండానే నాకు ఏడుపు వచ్చేస్తుంది. అంతా సహజంగా ఉంటుందని డెరైక్టర్, మిగిలిన నటులు మెచ్చుకుంటారు కూడా.
 
తీరాల్సిన కోరిక!
ఇప్పటి వరకు నాకు డబ్బింగ్ చెప్పే అవకాశం రాలేదు. నా పాత్రకు సొంత గొంతుతో నటించాలని ఉంది. అలాగే పవిత్రబంధం సినిమాలో సౌందర్య చేసినటువంటి పాత్రలో నటించాలని ఉంది. ఇక కుటుంబం అంటే అక్కకు పెళ్లయింది. రాజమండ్రిలో ఉంటుంది. అమ్మానాన్న, నేను హైదరాబాద్‌లో ఉంటున్నాం. దేవుడు మంచి అమ్మానాన్నలను ఇచ్చాడు. ఆదరించే బంధువులను ఇచ్చాడు. అడక్కుండానే నటిని చేశాడు. అలాగే మంచి అబ్బాయితో పెళ్లి చేయిస్తాడనే నమ్మకం ఉంది.

మరిన్ని వార్తలు