ఒక ప్రాంతీయ రచయిత సార్వజన ఘోష

23 Dec, 2019 00:42 IST|Sakshi
కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించిన బండి నారాయణ స్వామి

పురస్కారం

రౌద్రమూ, బీభత్సమూ, విషాదమూ ముప్పిరిగొనే శప్తభూమి నవల చారిత్రక విభాత సంధ్యలో మానవ కథ వికాసమెట్టిదో నిరూపిస్తుంది. 

‘‘బాబ్రీ మసీదును రామజన్మభూమిగా విశ్వసిస్తే తప్ప హిందువు కాడంటే, నేను హిందువును కాను. నాస్తికుడైతే తప్ప కమ్యూనిస్టు కానేరడు అంటే, నేను కమ్యూనిస్టును కాను. అవినీతిని తాత్వీకరించుకున్న దొంగల రాజ్యంలో ఆ దోపిడీ స్వభావపు పాలనాధికారం కోసమే తమ దళిత రాజకీయాలు ఉన్నాయంటే, నేను దళితవాదిని కాను. భిన్న భిన్న ప్రాంతాల వివిధాత్మక జీవితాన్ని గుర్తించి ఆమోదిస్తే తప్ప నేను ప్రాంతీయ తాత్వికుణ్ణి కాలేను,’’ అని స్పష్టంగా ప్రకటించుకున్న సాహిత్యకారుడు ‘స్వామి’.

మానవ జీవితాన్నే గురువుగా గుర్తించి, తనదైన విలక్షణమైన చూపుతో జీవితపు చలన సూత్రాలను అన్వేషించే సాధకుడు స్వామి అనే పేరుతో ప్రసిద్ధుడైన బండి నారాయణ స్వామి. కథకుడుగా ప్రారంభించి, నవలలు రాసి, యిటీవల కాలంలో రాయలసీమ సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలపైన పరిశోధన వ్యాసాలు రాసిన స్వామి తొలినుంచీ తనదైన జీవితపు అస్తిత్వ మూలాలను తరచి చూడడంలోనే తన దృష్టినంతా కేంద్రీకరిస్తున్నాడు. యీ అన్వేషణ ఆయన కథల్లో బీజమై పుట్టి, నవలల్లో మర్రిచెట్లంత విశాలంగా పరుచుకుంటూ వస్తోంది. యీ అన్వేషణ క్రమంలోనే, అనంతపురం చారిత్రక నేపథ్యాల్ని సాహిత్యీకరించిన ‘శప్తభూమి’ నవల రాశాడు. దానికిప్పుడు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు, తన ప్రాంతపు జీవన సంఘర్షణనిప్పుడు, మిగిలిన ప్రాంతాలవాళ్లు గూడా తెలుసుకుంటారనీ, రచయితలు అభిలషించే వొక ఆదర్శ ప్రపంచంవైపుకు నడవడానికి కొందరైనా సమాయత్తమౌతారనీ మాత్రమే స్వామి సంతోషిస్తాడు.

వానరాలే, నీళ్లు, సావుకూడు, అవశేషం వంటి తొలినాటి కథల్లో అనంతపురం జిల్లాలోని జీవిత పోరాటాల్ని చిత్రించడంతో స్వామి యీ అన్వేషణను ప్రారంభించాడు. ‘‘ఎవరు ఎన్ని నీళ్లు వాడతారో తెలిస్తే వాళ్ల నాగరికత ఏపాటిదో చెప్పెయ్యొచ్చు’ అనేది ఒక సూక్తి. తాగడానికి ఒక కడవ నీళ్లు నోచుకోలేనివారికి ఏం నాగరికత ఉంటుంది?’’ అని ముగిసే ‘నీళ్లు’ కథలో రచయిత వాపోయినట్టుగా కనిపించినా, అది నిజానికి నాగరికమని అనుకునే సంఘానికీ, ప్రజాస్వామ్యం అని పిలుచుకుంటున్న మన రాజకీయ వ్యవస్థకూ పెద్ద సవాలుగా మిగులుతుంది. పైనుంచీ నంగనాచి మాదిరి చూస్తావుండే ఆకాశం కింద వాన రాక కోసం యెగజూసుకుంటూ సంవత్సరాలకు సంవత్సరాలు గడిపే అనంతపురం జిల్లా రైతుల ఆక్రందనలను సాహిత్యీకరించడమే తన బాధ్యతగా గుర్తెరిగిన రచయిత స్వామి. 

కరువు సీమలో మొగుడు చచ్చిపోయిన తర్వాత జరిగిన దివసాల రోజున, బంధువులు అందరూ మాంసాహారాల్ని గొంతుల వరకూ తినివెళ్లిపోయిన తర్వాత, యింకా యేడుస్తూ కూర్చున్న ముసలాయన పెండ్లాం యేడుస్తున్నదెందుకో తెలిసేదెవరికి? ‘‘ఎవురెవురికి పుట్టిన నా కొడుకులో వచ్చి, గొంతువరకూ సించుకొని పోయిరి. నా ఇస్తరాకులో మాత్రము నాలుగు తునకలు ఎయ్యకపోతిరి కదరా! మీ కడుపులు దొక్కా! మీరు తునకలు తిని నా మొగానికి నీల్లు కలిపిన పులుసు పోస్తిరి కదరా!’’ అంటూ ఆ ముసలావిడ తిట్టడం మొదలెడుతుంది. యివీ కరువు సీమల వ్యధలు.

వ్యక్తి, కుటుంబము, వూరు, సమాజము, మతము, రాజ్యం, ప్రపంచం– మనిషితో ముడిబడిన యీ విషయాల పైనంతా స్వామికి అక్కరే! ‘‘ప్రపంచం కుగ్రామం కావడం కాదు. కుగ్రామమే ఒక ప్రపంచం కావాలి’’ అని యెలుగెత్తి చెప్పేవాడు స్వామి. అందుకే పై అంశాలలో దేన్నీ వదలకుండా అన్వేషిస్తాడు. యీ అన్వేషణలోనే ఆయన భారతీయమైన తాత్విక చింతనలోనూ మునిగిపోతాడు. జీవితపు మూల తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నంలో నీడలమెట్లు, రెండు అబద్ధాలు, చమ్కీదండ, పద్మపాదం వంటి కథలూ అనేకం రాశాడు. వెతికేవాడికి యేదైనా దొరుకుతుందనీ, వొక్కోసారి ఎంత వెదికినా ఏదీ దొరక్కపోవచ్చుననీ, దొరికేదేదైనా వుంటే అది వాడిపోనీ, వాసన లేనీ చమ్కీదండే అవుతుందనీ స్వామి గ్రహిస్తాడు.

స్వామికున్న యీ అస్తిత్వ, సాంఘిక, రాజకీయ అన్వేషణలు కథల్లో వేరువేరుగా కనిపించినా, ఆయన యిటీవలి నవలల్లో మాత్రం ముప్పేటగా పెనవేసుకుపోతాయి.
నిత్య విద్యార్థిగా భారతీయ తాత్విక చింతనను అవుపోసన పట్టిన స్వామే అగ్ర శూద్ర కులాల రాజకీయ ఆధిపత్యంపైనా, జాతి ముఖంపైన రుద్దిన బ్రాహ్మణ కుల సంస్కృతిపైనా, రాజకీయ పాలెగాళ్లపైనా తిరుగుబాటును నిర్ద్వంద్వంగా ప్రకటిస్తాడు ‘మీ రాజ్యం మీరేలండి’ నవలలో. దళితుడు మరో దళిత కులంపైన అనుకంపన చెందే ఔన్నత్యాన్నీ, సనాతన సంస్కృతిని చెమట పరం చేసే శూద్రకులాల మూలాల్నీ, వ్యక్తిగత ‘నేను’ను విచ్ఛేదం చేసే అద్వైత చింతననూ, కమ్యూనిస్టు సమాజాన్నీ ఆయన తన గమ్యంగా చూపిస్తాడు.

అందుకే ఆ నవలను అంబటి సురేంద్రరాజు ‘శూద్ర గాథా సప్తశతి అను అనంత జీవన ఇతిహాసం’ అని పేర్కొంటాడు. కులాలూ, మతాలూ గాఢంగా వేర్లూనుకున్న భారతదేశంలో వైవిధ్యాలు లేని ఆర్థిక వర్గమొకటి రూపొందించగలమనే యూరోపియన్‌ భావనను వ్యతిరేకిస్తూ, ప్రతి అట్టడుగు కులమూ తనదైన సాంస్కృతిక వైవిధ్యాన్ని తాను పోషించుకుంటూనే, మిగతా అట్టడుగు కులాలతో కలిసి ఒక రాజకీయ ఎజెండా కింద ఐక్యమయ్యే బహుజన తాత్వికతను ఆపాదిస్తూ స్వామి ‘రెండు కలల దేశమ్‌’ నవల రాశాడు.

ప్రస్తుతాన్ని అర్థం చేసుకోడానికి చరిత్రలోకి ప్రయాణం చేసే లక్షణం స్వామిలో తొలినుంచీ వుంది. ‘అవశేషం’ కథలో ఆయన కురవ కులం వాళ్ల ఆచార వ్యవహారాలను చిత్రించిన తీరులో యీ ధోరణి స్పష్టంగా కనబడుతుంది. అనంతపురం చరిత్రను తెలుసుకోడానికి రచయిత కైఫీయత్తులను, శిలాశాసనాలనూ, గెజిట్‌లనూ, వీరగల్లులనూ అధ్యయనం చేశాడు. తన పరిశోధనలను తనదైన సామాజిక, తత్వశాస్త్ర అవగాహనలతో సాహిత్యీకరించి, ‘శప్తభూమి’ చారిత్రక నవలగా మలిచాడు. హండె హనుమప్ప నాయకుడి వంశస్థుడు సిద్దరామప్ప నాయుడి పరిపాలన కాలంలో జరిగిన సంగతులతో శప్తభూమి ప్రారంభమవుతుంది. ఆ కాలంనాటి ఆచారాలూ, వ్యవహారాలూ, నమ్మకాలూ, మొత్తం ఆనాటి సమాజాన్నీ, పాలేగాళ్ల వంటి రాజుల అరాచకపు పాలననూ, వాళ్ల పాదాల కింద పడి నలిగిపోయిన దళిత, బహుజన సముదాయాల ఘోషనూ యీ నవల నినదిస్తుంది.

రౌద్రమూ, బీభత్సమూ, విషాదమూ ముప్పిరిగొనే ఈ నవల చారిత్రక విభాత సంధ్యలో మానవ కథ వికాసమెట్టిదో నిరూపిస్తుంది. రచనతో బాటూ రచయిత గూడా ప్రయాణం చేయడం, దారిలో కొత్త సత్యాల్ని తెలుసుకోవడం యీ నవలలో గమనించవచ్చు. నవలను రాస్తున్నప్పుడు, అణగారిన వర్గాల వాళ్లంతా దళిత బహుజన కులాల వాళ్లేనని తెలిసిందనీ, అలా యీ నవల క్రమంగా రాయలసీమ దళిత బహుజన చారిత్రక నవలగా మారిందనీ రచయితే చెప్పుకున్నాడు.
చారిత్రక నవలలు పాశ్చాత్య సాహిత్యంలో చాలా వున్నాయి. చారిత్రక నేపథ్యాన్నీ, సత్యాల్నీ, కల్పనాత్మకమైన పాత్రలతోనూ, కథలతోనూ ముడిబెట్టే పాశ్చాత్య చారిత్రక నవలల్లాగే 

‘చెంఘిజ్‌ఖాన్‌’(తెన్నేటి సూరి), ‘గోన గన్నారెడ్డి’(అడవి బాపిరాజు), విశ్వనాథ సత్యనారాయణ రాసిన నేపాళీ కాశ్మీరు రాజవంశ నవలలు కొన్ని తెలుగు చారిత్రక నవలా రచనకు దారి చూపించాయి. స్వామికి తనదైన తమ ప్రాంతపు మౌఖిక ధోరణిలో, తమ అనంతపురం మాండలికంలో రాయడమే యిష్టం. ఆయన శప్తభూమిని చారిత్రక నవల అని పిలిచినా ఆ నవల మునుపున్న చారిత్రక నవలల ధోరణిలో కాకుండా, తన స్వభావానికి అనుగుణమైన రూపంలో, సహజంగా రూపొందాలనే అనుకుంటాడు. శప్తభూమి, స్వామి ముద్ర స్పష్టంగా ఉన్న నవల. నవలంతా రచయితదైన కంఠస్వరం స్పష్టంగా వినబడుతూ వుంటుంది. చివరిలో రచయిత పజ్జెనిమిదవ శతాబ్దానికంతా గొంతుగా మారిపోయి ‘‘యిది ఈ సీడెడ్‌ జిల్లాల కథ. వదిలించుకున్న జిల్లాల కథ. పాలకులు పట్టించుకోని అనాథ భూమి కథ. ప్రతి కొత్తలోనూ ఒక పాత కొనసాగుతూవుండటమే వర్తమాన చరిత్ర. కరువు కాటకాలూ, పాలేగాళ్ల కొనసాగింపే కదా ఇప్పటికీ ఈ శప్తభూమి గాథ’’ అని వ్యాఖ్యానిస్తాడు.

ఈ నవలకు అవార్డు రావడం సాహిత్యకారులందరికీ ఆమోదం కలిగించే విషయం. యీ శప్తభూమిని యికపైన అయినా సుఖసంతోషాల తీరం చేర్చే చిత్తశుద్ధి వున్న ప్రయత్నాలు మొదలైతేనే, సాహిత్యకారులతోబాటు రచయితా సంతోషపడతాడు.
-మధురాంతకం నరేంద్ర

మరిన్ని వార్తలు