మమతల కోవెల 

10 Jan, 2018 23:44 IST|Sakshi

మాటుంగ రైల్వేస్టేషన్‌ 

అందరూ మహిళలే. రైలుకు సిగ్నల్‌ ఇచ్చేది మహిళ, కౌంటర్‌లో టిక్కెట్‌ అమ్మేది మహిళ, రైల్లో టికెట్‌ చెక్‌ చేసేది మహిళ. ఒక్కమాటలో.. స్టేషన్‌మాస్టర్‌ నుంచి స్వీపర్‌ వరకు అందరూ మహిళలే. ఇదేమీ కాల్పనిక సన్నివేశం కాదు. రియల్‌లైఫ్‌లో మహిళలు సాధించిన ఘనత. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్ట్స్‌ నమోదు చేసిన మహిళా సాధికారత. ముంబై నగరంలో మాటుంగా రైల్వేస్టేషన్‌లో ఉద్యోగులంతా మహిళలే. ఆపరేషన్స్, కమర్షియల్‌ విభాగంలో పదిహేడు మంది, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌లో ఆరుగురు, టికెట్‌ చెకింగ్‌కి ఎనిమిది మంది, ఇక అనౌన్సర్‌లు, పాయింట్‌ పర్సన్స్, ఇతర బాధ్యతలలో ఉన్నవారు మొత్తం కలిపి 41 మంది మహిళలు!

సెంట్రల్‌ రైల్వేస్‌ జనరల్‌ మేనేజర్‌ డి.కె శర్మకు గత ఏడాది జూలైలో వచ్చిన వినూత్నమైన ఆలోచనకు ఆచరణ రూపమే ఈ అపూర్వ పరిణామం. నిబద్ధతగా ఉద్యోగం చేయడం నుంచి పరిశుభ్రత, ఇతర పనుల్లో కచ్చితంగా ఉండడం ఆడవాళ్లకు సహజమే. ఇతర ఒత్తిడిలేవీ లేకపోతే ఆడవాళ్లు అద్భుతాలు చేయగలరని, నిర్ణయాలు తీసుకోవడంలో సంఘటితంగా ఉండగలరనీ, చక్కటి పని వాతావరణాన్ని కల్పించడం ఆడవాళ్ల చేతుల్లోనే ఉందని జనరల్‌ మేనేజర్‌ శర్మకు ఉన్న నమ్మకాన్ని మహిళలంతా నిజమని నిరూపించారు. అందరూ మహిళలే ఉంటే మెరుగైన ఫలితాలు వస్తాయని, అనుకున్నదే తడవుగా ఆయన తీసుకున్న నిర్ణయం మంచి ఫలితాలను ఇస్తోందని, ఈ ఫార్ములాను కొనసాగిస్తామంటున్నారు పై అధికారులు. మరొక విశేషం ఏమిటంటే ఈ స్టేషన్‌ మాస్టర్‌ మమతా కులకర్ణి 1992లో ఇదే రైల్వేస్టేషన్‌లో అసిస్టెంట్‌ స్టేషన్‌ మేనేజర్‌గా ఉద్యోగంలో చేరారు. ఇప్పుడామె స్టేషన్‌ మాస్టర్‌. టీమ్‌ని నడిపించడంలో స్టేషన్‌ని మమతల కోవెలగా మార్చారు. అంతా బాగానే ఉంది కానీ, ఆ స్టేషన్‌కొచ్చే రైళ్లను నడిపేది మగవాళ్లేగా అని సెటైర్‌ వేసేవాళ్లు ఉండొచ్చు. అయితే ఉమన్‌ లోకోపైలట్‌లు ఇప్పుడు  చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారు. ముంబైతో మొదలైన ఆ ట్రెండ్‌ హైదరాబాద్‌ మెట్రో వరకు విస్తరించింది కూడా.

మరిన్ని వార్తలు