అపరిచిత రచయిత నిష్క్రమణ

23 Sep, 2019 01:12 IST|Sakshi
మరాఠీ, ఇంగ్లిష్‌ రెండు భాషల్లోనూ రాసిన రచయిత కిరణ్‌ నాగర్‌కర్‌ (1942–2019)

మధురాంతకం నరేంద్ర

‘మరాఠీ – ఇంగ్లీషు సాహిత్య ప్రపంచంలో కూలిన చివరి గొప్ప మర్రిచెట్టు’ అన్న వార్త చదవగానే ఉలిక్కిపడ్డాను. తరచూ సాహిత్యానుబంధాల వ్యాసాల్లో కనిపించేవాడు కాదు కిరణ్‌ నాగర్‌కర్‌. ఆయన ఈ నెల 5వ తేదీన బొంబాయిలో చనిపోయాడు. 2006 ఆగస్టులో వారం రోజులపాటు ఆయనతో కలిసి మెక్సికో సిటీలో పర్యటించిన రోజులు గుర్తొచ్చాయి. సాహిత్య అకాడమీ మెక్సికోకు పంపిన తొలి సాహిత్య ప్రతినిధి బృందంలో సభ్యుడిగా ఢిల్లీ నుంచీ బయల్దేరినప్పుడు మిగిలిన ఇద్దరు సభ్యులెవరో కూడా నాకు తెలియలేదు. ఢిల్లీనుంచీ నాతోబాటూ అఖిలేష్‌ అనే హిందీ రచయిత మాత్రమే ప్రయాణం చేశాడు. తద్భవ్‌ అనే లక్నో నుంచి వెలువడే త్రైమాసిక పత్రిక సంపాదకుడాయన. మూడో సభ్యుడు మెక్సికో నగరంలోనే కలుస్తాడని చెప్పారు. 24 గంటల ప్రయాణం తర్వాత మెక్సికోలో మమ్మల్ని ఆహ్వానించిన రచయితల బృందం మా ఇద్దర్నీ ‘రైటర్స్‌ హోం’కు తీసుకెళ్లింది. నగరం మధ్యలో, చిన్న వీధిలో, పాతకాలపు మెక్సికో అలంకరణలూ, ఆనవాళ్లూ ఉండే ఆ నిరాడంబరమైన ఇల్లు ప్రాచీన మెక్సికో నాగరికతకంతా ప్రతీకలా వుంది. మిద్దె పైని గదుల్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత, మరునాటి వుదయం చిన్న డైనింగ్‌ రూంలో ఫలహారం తీసుకుంటున్నప్పుడు, అక్కడ కూర్చున్న వ్యక్తిని కిరణ్‌ నాగర్‌కర్‌ అనీ, మా బృందంలోని మూడవ రచయిత అనీ పరిచయం చేశారు.

సన్నగా, పొడుగ్గా, కుదురుగా దువ్విన జుట్టుతో, పైజమా లాల్చీలో వున్న ఆ అరవయ్యేళ్ల వ్యక్తి అదో రకం జీరవున్న గొంతుతో మొహమాటంగా మమ్మల్ని పలకరించాడు. మెక్సికో ప్రజలకు బాగా అలవాటయిన మొక్కజొన్న పాన్‌కేకులపైన తేనెను పోసుకుని, ఆ ఆహారం బాగా అలవాటున్నవాడిలా ఆయన తినడం చూసినప్పుడు ఆశ్చర్యమేసింది. ఫలహారం ముగిశాక నేను చనువుగా ఆయన గదిలోకి జొరబడ్డాను. అయితే నాగర్‌కర్‌ గారు మాత్రం పొడి పొడి మాటలతోనే సరిపెట్టేశారు. ఆయన రచనల్ని గురించి వాకబు చేస్తే, ‘‘యేదో, రాశానులెండి’’ అని పెదవులు చప్పరించేశాడు. మెక్సికోలో వున్న వారం రోజుల్లో ప్రతిరోజూ మమ్మల్ని యేదో వొక సందర్శనీయ స్థలానికి తీసుకెళ్లారు. నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో వున్న పిరమిడ్‌ల దగ్గరికి వెళ్లినప్పుడు అఖిలేష్‌తో బాటూ నాగర్‌కర్‌ గూడా సునాయాసంగా ఆ పిరమిడ్ల పైకెక్కేశారు. సన్నగా, చిన్నవిగా, నిటారుగా వుండే ఆ మెట్లపైకి ఎక్కలేక నేను జంకుతూ మధ్యలోనే ఆగిపోయాను. మాకు గైడుగా వ్యవహరించిన యువకుడితో గూడా నాగర్‌కర్‌ అంతగా కలిసిపోలేదు. కానీ అక్కడి అధికారులతోనూ, రచయితలతోనూ మాత్రం చనువుగా తిరిగేవాడు. పదిహేను, పజ్జెనిమిది అంతస్థుల భవనపు పెంట్‌ హవుస్‌లో యేర్పాటు చేసిన విందులో అఖిలేష్‌ దారి తప్పిన గ్రామీణుడిలా బెంబేలు పడుతూ వుండిపోయాడు. నాగర్‌కర్‌ మాత్రం అక్కడి రచయితల గుంపులో సులభంగా కలిసిపోయి, వాళ్లతోబాటూ అక్కడి దేశపు ప్రసిద్ధ ‘టకీలా’ చప్పరిస్తూ ఆటపాటల్లో కలగలిసిపోయాడు.

‘‘రష్దీలో పాఠకుల్ని విస్మయుల్ని చేసే అంతులేని మందుగుండు సామగ్రి వుంటుంది. మార్క్వెజ్‌కు సరైన కంఠస్వరం లేకపోయినా, గొప్ప మాంత్రిక ప్రతీకల్ని యెన్నుకోగల శక్తీ, యెన్నుకున్న వస్తువుకు సరిపోయేలా శైలిని మార్చుకోగలిగే ప్రతిభా వున్నాయి’’ అంటాడు నాగర్‌కర్‌

నగరం మధ్యలో వుండే ప్రసిద్ధమైన ‘పాలస్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌’ భవనంలో మా రచనల్ని చదవమని అడిగినప్పుడు అదే ధోరణిలో ‘‘యేదో రాశాను యిటీవలే!’’ అంటూ అప్పుడే ప్రచురితమవుతున్న తన నవల ‘గాడ్స్‌ లిటిల్‌ సోల్జర్‌’లోంచీ కొన్ని పేజీలు అన్యమనస్కంగా చదివాడు. అయితే అక్కడా, తరువాత మెక్సికో విశ్వవిద్యాలయంలో అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానాలు చెప్పాడు. నాలాగా, అఖిలేష్‌లాగా కాకుండా నాగర్‌కర్‌కు అప్పటికే మెక్సికో, లాటిన్‌ అమెరికన్‌ రచయితల్ని గురించి కొంత తెలుసు. జువాన్‌ రుల్ఫో అనే మెక్సికన్‌ రచయిత రాసిన ‘పెడ్రో పరమో’ అనే నవలను తాను చిన్నప్పుడే చదివాననీ, తర్వాతెప్పుడో వో యూరోపియన్‌ నగరంలో ఆయనను కలవడం తనకు మరపురాని అనుభవమనీ నాగర్‌కర్‌ అన్నాడు. ప్రసిద్ధ లాటిన్‌ అమెరికన్‌ నవలా రచయిత గాబ్రియల్‌ మార్క్వెజ్, మరోప్రసిద్ధ అర్జంటైనా కథకుడు లూయీ బోర్హెస్‌– రుల్ఫో రచనల ప్రభావం తమపైన వుందని అంటారు. అంత గొప్ప రచయితతో నాగర్‌కర్‌ యింగ్లీషులో మాట్లాడబోయినప్పుడు, ఆయన తన టెక్సాస్‌ను దోచుకుని, తన వాళ్లను అవహేళన చేసిన దుర్మార్గపు విదేశీయులైన యింగ్లీషు వాళ్ల భాషను వినడానికి కూడా నిరాకరించాడట! విచిత్రమేమిటంటే జువాన్‌ రుల్ఫో అనే ఆ మెక్సికో రచయిత ప్రపంచ ప్రసిద్ధుడవడానికి ఆయన రచనల యింగ్లీషు అనువాదాలే కారణమయ్యాయి.

కిరణ్‌ నాగర్‌కర్‌ తాను మతాన్ని పట్టించుకోని వాడిననీ, అయితే తన మాటలూ, రచనలూ ‘దేవుడు’ దగ్గరికే వచ్చి చేరుతున్నాయనీ అన్నాడు. పరమత సహనముండే లౌకిక కుటుంబంలో పుట్టిన జియా వుల్‌ హక్‌ మత తీవ్రవాది గావడమూ, అతను సాల్మన్‌ రష్దీపైన ఫత్వా ప్రకటించడమూ తాను ‘గాడ్స్‌ లిటిల్‌ సోల్జర్‌’ రాయడానికి కారణమయ్యాయన్నాడు. ఆ నవలలో ఆయన భారతదేశంలో మార్జినలైజ్డ్‌ ప్రజల దుస్థితి గూడా చిత్రించాడు. ‘‘రష్దీలో పాఠకుల్ని విస్మయుల్ని చేసే అంతులేని మందుగుండు సామగ్రి వుంటుంది. మార్క్వెజ్‌కు సరైన కంఠస్వరం లేకపోయినా, గొప్ప మాంత్రిక ప్రతీకల్ని యెన్నుకోగల శక్తీ, యెన్నుకున్న వస్తువుకు సరిపోయేలా శైలిని మార్చుకోగలిగే ప్రతిభా వున్నాయి’’ అంటాడు నాగర్‌కర్‌. మా వారం రోజుల పర్యటన తర్వాత నాగర్‌కర్‌ వచ్చిన దారిలోనే, మళ్లీ ఫ్రాంక్‌ఫర్ట్‌కు, అక్కడి బుక్‌ ఫెస్టివల్‌లో పాల్గొనడం కోసం వెళ్లిపోయాడు. నాగర్‌కర్‌ రచనలన్నీ జర్మన్‌ భాషలోకి అనువాదమయ్యాయి. జర్మన్‌ ప్రభుత్వం ఆయనకు ‘ఆర్డర్‌ ఆఫ్‌ మెరిట్‌ ఆఫ్‌ ద ఫెడరల్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ జర్మనీ’ అవార్డునిచ్చి సత్కరించింది. చాలా సంవత్సరాల స్నేహమున్నవాడిలా నాతో తిరిగిన అఖిలేష్‌లా కాకుండా, నాగర్‌కర్‌ యేదో ప్రయాణంలో యాదృచ్ఛికంగా యెదురై, మొహమాటంగా పలకరించి వెళ్లిపోయిన బాటసారిలా, అపరిచితంగానే వెళ్లిపోయాడు.

భారతదేశానికి తిరిగొచ్చాక నాగర్‌కర్‌ రాసిన రచనలేమిటని తెలుసుకోవడానికి ప్రయత్నించాను. ఆయన తన తొలి రచనల్ని తన మాతృభాష మరాఠీలోనే రాశాడు. మొదటినుంచీ ఆయన మధ్యతరగతి విలువల్ని విమర్శిస్తూ తన ఆగ్రహాన్ని వ్యంగ్య ధోరణిలో ఆవిష్కరించేవాడు. సాత్‌ సక్కమ్‌ ట్రెచాలిస్‌ అనే ఆయన మరాఠీ నవల తరువాత ‘సెవన్‌ సిక్సెస్‌ ఆర్‌ ఫార్టీ త్రీ’ అనే పేరుతో యింగ్లీషులోకి అనువాదమయింది. బొంబాయి లో కార్మికులు నివసించే బహుళ అంతస్థుల మురికి భవనం 17వ అంతస్థులో పెరిగిన రావన్‌ అనే హిందూ, ఎడ్డీ అనే క్రైస్తవ అబ్బాయిల యాతనలను చిత్రిస్తూ ‘రావన్‌ అండ్‌ ఎడ్డీ’ అనే మరో నవల రాశాడు. దీన్ని ముందు మరాఠీలో ప్రారంభించి తర్వాత ఇంగ్లీషులో పూర్తిచేశాడు. తరువాత ఆయన రచనలన్నీ యింగ్లీషులోనే చేశాడు. తరువాత నాగర్‌కర్‌ దృష్టి ప్రాచీన భారతదేశ చరిత్రపైన పడింది. 16వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ భక్తురాలు మీరాబాయి జీవితం ఆధారంగా, ఆమె భర్త భోజరాజ్‌ ఠాకూర్‌ను ప్రధాన పాత్రగా తీసుకొని, ఆనాటి పితృస్వామిక సమాజాన్ని విమర్శిస్తూ ‘కకోల్డ్‌’ అనే నవల రాశాడు. దానికే ఆయనకు 2001లో సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. 19వ శతాబ్దపు పితృస్వామిక వ్యవస్థను దుయ్యబట్టడం కోసం ‘జశోద’ అనే నవల రాశాడు. ఆయన చివరి నవల ‘ది అర్సోనిస్ట్‌’లో కబీరు జీవితపు సంఘర్షణల్ని చిత్రించాడు.

ప్రపంచం పట్ల వో రకమైన నిరసన, కోపం వ్యక్తం చేసే పెదవి విరుపుడు నవ్వూ, యెప్పుడూ లోపలి చిడుముడిపాట్లను వ్యక్తపరుస్తూ నుదుటిపైన వంకర గీతలూ, యెంత అధునాతనమైన విదేశీ దుస్తులు తొడుక్కున్నా భారతీయత వెల్లడించే ఆకారమూ, చుట్టూవున్న లోకాన్ని పట్టించుకోనట్టు కనబడే నిద్రకళ్లూ– కిరణ్‌ నాగర్‌కర్‌ కదిలే నీడలా కనబడేవాడు. తన 77వ యేట ఆయన కాలమైపోయిన సంగతి తర్వాత పదిరోజులకుగానీ తెలుగువాడినైన నాకు తెలియలేదు. వారం రోజులపాటు ఆయనతోబాటూ కలిసి తిరిగినా ఆయన సన్నిహితుడు కానేలేదు. అయినా ఆయనిలా చెప్పకుండా వెళ్లిపోయినప్పుడు గుండెలోపలి శూన్యమేదో బాధతో మూల్గుతోంది.


కిరణ్‌ నాగర్‌కర్, అఖిలేష్, వ్యాసకర్త 

మరిన్ని వార్తలు