హర హర  మహాదేవ

3 Mar, 2019 01:19 IST|Sakshi

లోక కళ్యాణం కోసం గరళాన్ని సైతం గొంతులో దాచుకొని అందరికీ అమృతాన్ని పంచిన ప్రేమమూర్తి ఆయన. రాక్షసులకు సైతం వరాలను అనుగ్రహించగల బోళాశంకరుడు, మూడోకన్నుతో లోకాలన్నిటì నీ భస్మం చేయగల ముక్కంటి, లోకంలోని సర్వ దుఃఖాలను, సర్వుల పాపాలను తనలో లయం చేసుకునే లయకారుడయిన శివుడిని అర్చించడం కంటే మించిన పూజ, అంతకు మించిన సాధన మరేదీ లేదు.

ఆ స్వామి ఓంకార నాదంతో స్వయం ప్రకాశ స్తంభంగా(లింగం)గా ఆవిర్భవించిన పర్వదినం ‘మహాశివరాత్రి’. ఈ పర్వదినం మాఘమాసంలో బహుళ పక్షంలో అర్ధరాత్రి వ్యాపకమైన చతుర్దశి తిథిలో వస్తుంది. ప్రతి మాసంలో వచ్చే బహుళ చతుర్దశి  తిథులు ‘మాస శివరాత్రులు’ గా వ్యవహరిస్తారు. ఏడాది కాలంలో వచ్చే ద్వాదశ శివరాత్రులలో మాఘ బహుళ చతుర్దశి శివునికి అత్యంత ప్రీతికరమైనది. కనుకనే ఈ మాఘ బహుళ చతుర్దశి మహా శివరాత్రిఅంటే శివరాత్రులలో గొప్పది అయింది.

శివలింగ ఆవిర్భావం గురించిన వివరణ శివపురాణంలో ఉంది. దానిని అనుసరించి... ఒకసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు..? అనే వాదన తలెత్తింది. వారి గర్వాన్ని పోగొట్టేందుకు శివుడు కోటిసూర్య సమాన దివ్యతేజస్సుతో లింగరూపంలో ఆవిర్భవించాడు. ఆ లింగం ఆది, అంతం తెలుసుకోగలిగిన వారే గొప్పవారు అని వారితో చెప్పాడు. అప్పడు ఆ లింగం మూలస్థానం చూసేందుకు విష్ణువు వరాహరూపంలో పైకి, అంతిమ స్థానం చూసేందుకు బ్రహ్మ, హంస రూపంలో కిందివైపుకి ప్రయాణించారు.

ఎంతగా వెదికినా, మరెంతగా శోధించినా ఫలితం కనిపించలేదు. బ్రహ్మ, విష్ణువులిద్దరూ ఆ తేజోమయ లింగ ఆది, అంతాలను తెలుసుకోలేకపోయారు. అప్పుడు వారిద్దరూ శివుడిని ‘మహాప్రభూ’.. మమ్మల్ని అనుగ్రహించండి. మీ నిజరూపాన్ని ప్రదర్శించండి’ అని అన్నారు. అప్పుడు శివుడు  వారికి దివ్యజ్ఞానాన్ని ప్రసాదించాడు. మాఘ బహుళ చతుర్దశి నాడే ఈ మహాలింగం ఉద్భవించింది. అందుకే అది మహాశివరాత్రి పర్వదినమయ్యిందని అంటారు. 

స్నానం... దానం... అర్చన  అభిషేకం... ఉపవాసం... జాగారం
మహాశివరాత్రి పర్వదినాన  పూజ, అభిషేకం, ఉపవాసాలను భక్తిశ్రద్ధలతో నిర్వర్తించడం వలన శివానుగ్రహానికి పాత్రులు కాగలరు. శివరాత్రినాడు మహాదేవుని అర్చించి మోక్షాన్ని పొందిన భక్తుల కథలు పురాణాల ద్వారా మనకు కొంతవరకూ పరిచితమే కాబట్టి  అభిషేక ప్రియుడైన శివుని ఈ మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం, అభిషేకాలు, నాలుగు జాముల్లోనూ పూజలు, జాగరణలతో శివపూజ సాగించాలి. మొదటి పూజ రాత్రి ఎనిమిదిగంటలకు ప్రారంభిస్తారు. చివరి పూజ తెల్లవారుజామున ఐదుగంటలకు ముగిస్తారు. శివరాత్రి అందరూ ఉపవాసం చేయాలని శాస్త్రం చెబుతోంది. అయితే, చిన్నపిల్లలకు, ముసలివాళ్ళకు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళకు, గర్భవతులకు, ఔషధసేవనం చేయాల్సిన వాళ్ళకు మినహాయింపు ఇచ్చింది.

ఉపవాసం ఎలా చేయాలి?
ఉపవాసం ఉండే ముందురోజు, ఉపవాసం మరుసటి రోజు కూడా మాంసాహారం, గుడ్డు తినకూడదు, మద్యపానం చేయకూడదు. ఉపవాసం ఉండే రోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేచి, తలస్నానం చేసి, ‘ఈ రోజు నేను శివునకు ప్రీతికరంగా శివరాత్రి ఉపవాసం చేస్తున్నాను, విఘ్నాలేమీ లేకుండా నా దీక్ష చక్కగా సాగాలి’ అని సంకల్పం చెప్పుకోవాలి. ఉపవాసం అనే పదానికి దేవునికి దగ్గరగా ఉండడం అని అర్థం.

భగవంతునికి మనసును, ఇంద్రియాలను దగ్గరగా జరపడమే ఉపవాసం. ఆరోగ్యపరంగా చూసినప్పుడు ఉపవాసం శరీరంలో ఉన్న విషపదార్థాలను తొలగించడంతో పాటు శరీరంలో ప్రాణశక్తిని, ఇంద్రియ నిగ్రహాన్ని పెంచుతుంది. మరీ నీళ్ళు కూడా తాగకుండా ఉపవసించమని ఎవరు చెప్పలేదు. అలా చేయకూడదు కూడా. ఎందుకంటే శరీరాన్ని కష్టపెడుతూ, భగవంతుని వైపు మనసును మళ్లించడం ఈ కాలంలో అయితే చాలా కష్టం.

జీవారాధన
మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎంత బియ్యం, ఇతర ఆహారపదార్ధాలు మిగులుతాయో, వాటిని ఆకలితో ఉన్న పేదలకు పంచాలి. అప్పుడే మనం చేసిన ఉపవాసం ఫలిస్తుంది. ఎందుకంటే అష్టమూర్తితత్వంలో శివుడు లోకంలో జీవుల రూపంలో సంచరిస్తూ ఉంటాడు. అన్నార్తుల ఆకలిని తీర్చడం కూడా ఈశ్వరసేవయే. అందుకే స్వామి వివేకానంద ’జీవారాధనే శివారాధన’ అన్నారు. శివరాత్రి రోజు ప్రకృతిలో ఉన్న శివశక్తిని శరీరం గ్రహించాలంటే, వెన్నును నిటారుగా పెట్టి కూర్చోవాలి. అంటే కూర్చునే సమయంలో ముందుకు వంగి కూర్చోవడం కాకుండా, వెన్నుపూస నిటారుగా ఉండేలా కూర్చోవాలి, అలాగే నిలబడాలి. అప్పుడే దృష్టిని కేంద్రీకరించగలుగుతాం. ఆ శివశక్తిని గ్రహించ గలుగుతాం. 

మౌనవ్రతమూ మహిమాన్వితమే!
శివరాత్రి రోజు చేసే మౌనవ్రతం అద్భుత ఫలితాలను ఇస్తుంది. మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది. మౌనం అనగానే నోరు మూసుకుని కూర్చోవడం అని భావించరాదు. మనసును కూడా మౌనం ఆవరించినప్పుడు మౌనవ్రతం సంపూర్ణమవుతుంది. అందువల్ల అనవసరమైన ఆలోచనలను, వాదనలను కట్టిపెట్టి, మనసును శివునిపై కేంద్రీకరించాలి. మీరు అభిషేకం చేయించుకోకపోయినా ఆందోళన అవసరం లేదు.

ప్రశాంతంగా కళ్ళు మూసుకుని కూర్చుని, పండితులు పఠిస్తున్న రుద్ర – నమక చమకాలను వింటే చాలు.. మనసు మధురభక్తితో నిండిపోతుంది.  ఈ జగత్తంతా శివమయమే. అంతటా శివతాండవమే. ఎక్కడ చూసినా ఎంతో పురాతన చరిత్రనూ, మరెంతో వైభవాన్నీ, ఆ స్వామి మహిమలనూ కలిగిన శైవక్షేత్రాలే. శివతత్త్వాన్ని శిల్పాల రూపంలో, స్థలపురాణాల రూపంలో జ్ఞానామృతాన్ని పంచుతుంటాయి. అందుకే అందుబాటులో ఉన్న ఏ శివాలయానికైనా వెళదాం, ఆ ఆనందాన్ని దోసిళ్లతో గ్రోలుదాం. హర హర మహాదేవ శంభో శంకర అంటూ శివభక్త్యామృతంలో ఓలలాడదాం.
పూర్ణిమా స్వాతి

త్రిలోకనాయకుడు
ఆ స్వామి త్రినేత్రుడు. త్రిగుణాకారుడు. త్రి ఆయుధుడు. త్రిజన్మ పాప సంహారుడు. మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడు. త్రిదళాలతో కూడిన బిల్వాలను ఇష్టపడేవాడు. త్రిశూలధారి. త్రికాలాలకు, త్రి నామాలకు అధిపతి. త్రిలోక రక్షకుడు. ఆకాశమనే లింగానికి భూమి పీఠం. సమస్త దేవతలూ అందులో ఉన్నారు. అంతా అందులోనే లయమవుతుంది. అందుకే ఈశ్వరులకు ఈశ్వరుడు, దేవతలకు దైవం అయిన పరమేశ్వరుడు జాగ్రద్, సుషుప్త, స్వప్నాలకు అతీతుడు. అన్నీ ఆయనలో ఉన్నాయి. అంతటా ఆయనే నిండి ఉన్నాడు.

మరిన్ని వార్తలు