శ్రీకూర్మనాథుని డోలోత్సవానికి వేళాయె...

17 Mar, 2019 00:59 IST|Sakshi

మహావిష్ణువు దశావతారాల్లో రెండవ అవతారం కూర్మం. స్వామివారు కూర్మనాథుడిగా వెలసిన క్షేత్రం శ్రీకూర్మం. బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించిన ఈ శ్రీకూర్మ క్షేత్రం హిందూదేశానికే తలమానికం. ప్రాచీన శిల్పకళా శోభితంగా, దేశ నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాలను పంచిపెడుతూ అలరారుతోంది. వైష్ణవుల 108 దివ్యారామాల్లో ప్రముఖంగా ఉంది. అంతటి మహిమాన్విత గల ఈ క్షేత్రంలో ప్రముఖమైన ఉత్సవంగా ఫాల్గుణ మాసంలో జరిగే డోలోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతి ఏటా ఫాల్గుణమాస త్రయోదశి నాడు మఖ నక్షత్రంలో ఈ ఉత్సవం ప్రారంభమవుతుంది. మార్చి 19న కామదహనోత్సవం, 20న పడియ, 21న డోలోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. కామదహనోత్సవం... అంటే మనలోని కోరికలను దహనం చేసే ఉత్సవంగా చెబుతారు.

మన్మథుని దహించేందుకు గానూ తొలుత స్వామివారి ఉత్సవమూర్తులను శేషవాహనంపై ఉభయానాంచారులతో కలిపి గోవిందరాజస్వామి, చొప్పరంలో సీతారామ, అశ్వవాహనంపై లక్ష్మణ, పల్లకీలో చక్రనారాయణస్వామి హోమం అనంతరం ప్రత్యేక పూజలనంతరం కామదహనం చేస్తారు. గరుడవాహనం పై ఉంచి మేళతాళాలతో తిరువీధి నిర్వహిస్తారు. గ్రామ సమీపంలోని కామదహనం మంటపం వద్ద కామదహన కార్యక్రమాన్ని వేదపండితులు నిర్వహిస్తారు.పడియ... కామదహనంలో పాల్గొన్న భక్తులు వేకువజామున సమీపంలోని సముద్రస్నానాలు చేసి ఆలయంలోని శ్వేతపుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. అనంతరం స్వామిని దర్శించుకోవడంతో పడియ ఉత్సవం పూర్తవుతుంది. శ్వేతపుష్కరిణిని విష్ణువు సుదర్శన చక్రంతో తవ్వడం జరిగింది. తవ్వుతున్న సమయంలో లక్ష్మీదేవి గరుడవాహనంపై కూర్చున్న విగ్రహం లభ్యమవ్వడంతో ఆలయంలో శ్రీకూర్మనాయకిగా పూజలందుకుంటోంది.

డోలోత్సవం...
డోలాయమానం గోవిందం మధ్యస్ధ మధుసూదనం రథస్త వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే...
డోలోత్సవంలో ఉయ్యాల మంటపంలో ఉన్న స్వామిని దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదన్నది శ్లోక భావన. గ్రామదేవత మోహినీ భద్రాంబిక దర్శనార్ధమై శ్రీకూర్మనాథుడు రాజరాజ అలంకరణలో డోలామంటపం వద్దకు వెళ్తారని స్ధలపురాణం చెపుతుంది. ఈ సందర్భంగా స్వామిపాదాలను భక్తులు తాకే అవకాశం ఉంది. స్వామి అస్పృశ్య దోష నివారణకు బుక్కా, భర్గుండ (రంగులు కలిపిన పదార్ధం)తో అర్చకులు పూజలు చేస్తారు.

పూజ చేసిన బుక్కా, భర్గుండను భక్తులపై చల్లుతారు. సనాతనంగా వచ్చిన ఈ ఉత్సవమే ప్రస్తుతం హోళీగా మారిందని చెబుతుంటారు. డోలోత్సవం రోజున ఆలయం నుంచి గజ వాహనంపై స్వామివారు, మరోవాహనంపై ఉభయ నాంచారులు తిరుగు ప్రయాణంలో గరుడవాహనంపై స్వామి వారు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. ఉదయం మాడ వీధుల గుండా జరిగిన ఈ యాత్ర డోలా మంటపం చేరుకున్న తరువాత ఉత్తర నక్షత్ర లగ్నమందు ఉత్తరాభిముఖ దర్శనం ఇస్తారు. విజయనగరం రాజవంశీకుడు పూసపాటి అశోకగజపతిరాజు గోత్ర నామాలతో తొలిపూజలు చేస్తారు. శ్రీరంగం, వైకుంఠంలో స్వామిని చేరేందుకు గద్యత్రయం పఠనం చేస్తారు. 

కూర్మనాథుని ఆవిర్భావం.... 
ఆలయం తొలుత దేవతలు నిర్మించగా, 2వ శతాబ్దంలో అనంత చోళగంగుడు, అనంగ భీముడు హయాంలో పునఃనిర్మాణం జరిగింది. కూర్మనాథుడి పైనే భూమి అంతా ఆధారపడి ఉందని,  క్షీరసాగర మధనంలో దేవతలు, రాక్షసులు వాసుకిని తాడుగా చేసుకొని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి చిలుకుతున్నప్పుడు మందర పర్వతం సముద్రంలోకి కుంగిపోసాగింది. ఆ సమయంలో విష్ణువు కూర్మావతారం దాల్చి మందర పర్వతాన్ని తన మూపున మోస్తూ అమృతం పొందేందుకు సహకరించాడు. తాను స్వామిని కూర్మరూపునిగా సందర్శించాలని ఉందన్న శ్వేత చక్రవర్తి కోరిక మేరకు స్వామి కూర్మరూపంలో ఇక్కడ దర్శనమిచ్చారని స్ధలపురాణం చెబుతుంది.

గోపురం అష్టదళపద్మాకారంలో ఉంటుంది. ఈ గోపురంపై గల గాంధర్వ, నారసింహా, కపీశ, హయగీవ్ర, ధదివక్త్ర దర్శనం పుణ్యభరితమని, సర్వరోగ, సకల పాప నివారణి అని చెబుతారు.ఈ క్షేత్రంపై మహమ్మదీయ చక్రవర్తులు దాడికి దిగుతున్నారని తెలిసి, స్థానికులు సున్నం, గుగ్గిలం రాశులుగా పోసారట. వాటిని సైనికుల కొండలుగా భావించి, వీరిని జయించలేమని మహమ్మదీయ సేనలు వెనుదిరిగారట. అప్పటి సున్నం, గుగ్గిలం ఆనవాళ్లు మనం చూడవచ్చు.  క్షేత్ర పాలకునిగా ఆలయం చెంతనే శివుడు పాతాళ సిద్ధేశ్వరుడుగా దర్శనమిస్తాడు. 

త్రిమతాచార్యులు సందర్శించిన ఏకైక క్షేత్రం....
ఈ క్షేత్రాన్ని ఎనిమిదో శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు సందర్శించి స్వామి వారికి సాలగ్రామాన్ని సమర్పించారు. 11వ శతాబ్దంలో స్వామిని సేవించిన రామానుజాచార్యులు కోరిక మేరకు తూర్పు ముఖం కలిగి ఉన్న కూర్మనాథుడు పశ్చిమానికి తిరిగి దర్శనం ఇచ్చాడని చెబుతారు. అందుకోసం రెండు ధ్వజస్తంభాలను ఇక్కడ చూడవచ్చు. 13వ శతాబ్దంలో మధ్వాచార్యులు శ్రీనరహరి తీర్థులు  క్షేత్రాన్ని సందర్శించి సీత, రామలక్ష్మణ ఉత్సవమూర్తులను బహూకరించారని, ప్రస్తుత ఉత్సవమూర్తులైన గోవింద రాజస్వామి, శ్రీదేవి, భూదేవి విగ్రహాలను లవకుశులు సమర్పించారని పురాణాలు చెబుతున్నాయి. 1512వ సంవత్సరంలో చైతన్య మహాప్రభువులు క్షేత్రాన్ని సందర్శించారు. శైవ, విషు<, మధ్వాచార్యులు సందర్శించిన ఏకైక క్షేత్రంగా కూర్మనాథాలయం విరాజిల్లుతుంది. బలరాముడు వచ్చిన తర్వాత ఈ క్షేత్రంలో అన్ని మతాల వారికి గర్భగుడి ప్రవేశం జరిగిందని చారిత్రక కథనం చెబుతోంది.

శిల్పకళా శోభితం .....
శ్రీకూర్మనాథుని సన్నిధి అపురూప శిల్పకళతో అలరారుతోంది. ఇక్కడి 108 రాతిస్తంభాలు ఒక దానికీ మరొకదానికీæ పోలికలు ఉండవు. ప్రదక్షిణ మంటపం చుట్టూ 24 నల్లరాతి స్తంభాలున్నాయి. ఇందులో ఏకశిలతో తయారు చేసినట్టుండే ఈ శిల్పాలు మూడు శిల్పాలతో నిర్మితమైనవే. ఆకుపసరు చిత్రాలు ఇక్కడ భక్తులను ఆకట్టుకుంటాయి.  

పితృమోక్ష క్షేత్రం...
ఈ క్షేత్రం ఆవరణలోని శ్వేతపుష్కరిణిలో చనిపోయిన పెద్దల అస్తికలను కలిపితే ముక్తి లభిస్తుందని, ఇందులో కలిపిన అస్తికలు వారం రోజుల్లో శిలలుగా మారుతాయనీ విశ్వాసం. కూర్మనాథుని దర్శిస్తే శని వల్ల కలిగే ఈతిబాధలను నివారించుకోవచ్చునని, శనిదోషనివారణకు తిరుమంజన సేవలో పాల్గొంటే మంచిదని స్థలపురాణం చెబుతుంది.
ఆర్‌.వి. శ్రీనివాస్, గార మండలం, సాక్షి 
 శ్రీకాకుళం జిల్లా
 

అమృతమయ క్షేత్రం..శ్రీకూర్మం
శ్రీ కూర్మ క్షేత్రంలో మూడురోజుల పాటు జరిగే డోలోత్సవంలో తొలిరోజు పాల్గొంటే తుచ్ఛమైన కోరికలు దగ్ధమై, స్వామిని పొందాలన్న కోరిక కలుగుతుంది. వైకుంఠ పాప్తి కలిగేందుకు గానూ చేసే పవిత్ర స్నానమే రెండవరోజు పడియగా, మూడవరోజు స్వామి పాదాలను తాకి ఉత్తరాభిముఖ దర్శనంతో మానవ జీవితం అమృతమయమవుతుంది. శని బాధలు తొలగుతాయి. 
చామర్తి సీతారామనృసింహాచార్యులు, శ్రీకూర్మనాథాలయ ప్రధానార్చకులు

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా