దైవాదేశ పాలనకే ప్రాధాన్యం

19 May, 2019 01:12 IST|Sakshi

ఇస్లాం వెలుగు

మహమూద్‌ గజనవీ దర్బారులో అయాజ్‌ అనే  మంత్రి ఉండేవాడు. అయాజ్‌ అంటే చక్రవర్తికి ఎంతోఇష్టం. దీంతో మిగతా మంత్రులకు కాస్త అసూయగా ఉండేది. ఒకసారి చక్రవర్తి తన చేతిలో ఉన్న ముత్యాల హారాన్ని కొలనులో విసిరేశాడు. దర్బారులోని కొలను స్వచ్ఛమైన నీటితో కళకళలాడుతోంది. ముత్యాలహారం నీటి అడుగుభాగానికి చేరింది. అప్పుడుచక్రవర్తి, మంత్రులను పిలిచి,’మీలోఎవరైనా ఈ హారాన్ని బయటికి తీస్తారా?’అని అడిగాడు. దానికి అందరూ’ అదెంతపని చిటికెలో తీస్తాం.’ అన్నారు.‘సరే.. అయితే, ఒంటిపై వస్త్రాలు తడవకుండా హారాన్ని బయటికి తీయాలి.’ అన్నాడు చక్రవర్తి.‘అదెలాసాధ్యం?’ అంటూ అందరూ చేతులెత్తేశారు. బట్టలు తడవకూడదు అన్న షరతు లేకపోతే తీస్తామన్నారు.అప్పుడు చక్రవర్తి, అయాజ్‌ను పిలిచి ‘నువ్వు తీస్తావా?’అని అడిగాడు.

అయాజ్‌ వెంటనే వెనుకాముందూ ఆలోచించకుండా కొలనులోకి దూకి ముత్యాల హారాన్ని బయటికి తీశాడు. అతని బట్టలు, శరీరమంతా నీటిలో తడిసి పొయ్యాయి. వణుకుతున్న చేతులతోనే హారాన్ని చక్రవర్తికి అందించాడు అయాజ్‌ .‘నేను బట్టలు తడవకుండా హారాన్ని తియ్యాలని చెప్పానుకదా..!’ అని ఆగ్రహించాడు చక్రవర్తి.‘అవును ప్రభూ! హారం తియ్యాలి.. వస్త్రాలు తడవద్దు.’ అన్న మీ ఆజ్ఞను శిరసావహించాలన్న ఆరాటంలో బట్టలు తడుస్తాయా.. తడవకుండా ఎలా తియ్యాలి..? అనే విషయాలేవీ నేను పట్టించుకోలేదు ప్రభూ..! మీ రెండు ఆజ్ఞల్లో ఒకదాన్ని పాలించాను. మరొకదాని విషయంలో నన్ను క్షమించండి’ అని చేతులు జోడించాడు అయాజ్‌ .అప్పుడు చక్రవర్తి, ‘చూశారా.. ఇదీ అయాజ్‌ ప్రత్యేకత. మీరంతా బట్టలు తడవకుండా ఎలా? తడుస్తాయి కదా.. ఆ షరతు తొలగించండి.. అదీ ఇదీ..’ అంటూ మీనమేషాలు లెక్కించారు.

కాని అయాజ్‌  అదేమీ ఆలోచించలేదు. విలువైన హారాన్ని తీయడమే అతని దృష్టిలో ఉంది. ఆ క్రమంలో బట్టలు తడిస్తే శిక్షించబడతానని అతనికి తెలుసు. అయినా సరే నా విలువైన హారం కోసం తను శిక్షకు సిద్ధపడ్డాడు.మీరేమో హారం సంగతి తరువాత.. మేమెందుకు శిక్ష అనుభవించాలి?’ అని ఆలోచించారు.దైవాదేశపాలనలో మన పరిస్థితి కూడా ఇలాగే ఉండాలి. ఆయన ఆజ్ఞాపాలనలో మనం త్యాగానికి సిద్ధపడితే అల్లాహ్‌ మనల్ని తన సన్నిహితుడిగా చేసుకుంటాడు. మన పాపాలను క్షమిస్తాడు. ఇహలోకంలో గౌరవాన్ని ప్రసాదిస్తాడు. దైవదూతల ముందు మనల్ని గురించి గర్వంగా పొగుడుతాడు. ఆయన అమితంగా ప్రేమించేవాడు. అనన్యంగా కరుణించేవాడు. గొప్ప క్షమాశీలి.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌

మరిన్ని వార్తలు