పిచ్చుకపై ప్రేమాస్త్రం

18 Mar, 2019 00:02 IST|Sakshi

‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అనే మాట పురాణాల్లో ఉంది. దాన్ని మనం నిజం చేసేశాం! పిచ్చుకపై ఇంత ఇసుక, కంకర, సిమెంట్‌ వేస్తున్నాం. మన గూడు కోసం పిచ్చుక గూళ్లనుకొట్టేస్తున్నాం. పిచ్చుకపై మనం వేస్తున్న ఈ అమానుషాస్త్రాన్ని, పిచ్చుక జాతిపై తనకున్నప్రేమ అనే అస్త్రంతో తిప్పికొడుతున్నారు మహేష్‌ అనే పక్షి ప్రేమికుడు.

ఊర పిచ్చుక.. ఒకప్పుడు మన ఆవాసాలలో కిలకిలరావాలతో తిరుగాడిన మానవ స్నేహజీవి. మన లోగిళ్లలో.. చూరులలో.. గూళ్లు కట్టుకుని సంతతిని వృద్ధి చేసుకుంటూ ఉండేవి. మానవాళికి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగించేవి. అలాంటి పిచ్చుక ఇప్పుడు చాలా చోట్ల అదృశ్యమై.. దేశంలో అంతరించే జాతుల జాబితాలో చేరింది. ఐయూసీఎన్(ఇంటర్నేషనల్‌ యూనియన్  ఫర్‌ కన్జర్వేషన్  ఆఫ్‌ నేచర్‌) వారు రెడ్‌ లిస్ట్‌లో చేర్చారంటేనే వాటి మనుగడ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వీరా మహేష్‌ కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకల ‘వృద్ధి  సంరక్షణ’లపై 2014 నుంచి పరిశోధన చేస్తున్నారు. మార్చి 20  ‘వరల్డ్‌ స్పారో డే’ సందర్భంగా పిచ్చుకల ఆవాసాల ఏర్పాటు అవసరం  గురించి మహేష్‌ ‘ఫ్యామిలీ’తో మాట్లాడారు. 

పిచ్చుకకు ప్లేస్‌ ముఖ్యం
పదేళ్ల క్రితం 2009లో కొత్తగా నిర్మించిన మా ఇంటికి ఒక పిచ్చుకల జంట వచ్చింది. వాటి కోసం ఒక అట్టపెట్టెతో చేసిన గూడును స్లాబుకు దగ్గరగా అమర్చాను. ఏడాది తరువాత ఒక సాయంత్రం తల్లి పిచ్చుక పిల్లలకు ఆహారాన్ని అందించడం గమనించాను! పిచ్చుకలు గూడు బయటికి వెళ్లిన తరువాత పరిశీలిస్తే ఆ గూడులోనే ఆరు గూళ్లు ఉన్నాయి. ఒక్కొక్క గూటినుంచి కనీసం రెండు పిల్లలు వచ్చినా సంవత్సర కాలంలో పన్నెండు పిల్లలు వస్తాయి. ఇలా ఆలోచిస్తే పిచ్చుకలు గూళ్లు నిర్మించుకోవడానికి స్థలం ఎంతో అవసరం అని అర్ధమైంది. ఈ ఆలోచనతోనే నా ప్రయాణాన్ని ప్రారంభించాను. 2012లో చెక్కలతో గూళ్లను తయారుచేసి మా ప్రాంతంలో స్థానికుల సహకారంతో వాళ్ల వాళ్ల ఇళ్ల వద్ద ఏర్పాటు చేశాను.

క్రమంగా జంగారెడ్డిగూడెం పట్టణం చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించాను. ప్రస్తుతం పట్టణంలో 400 వరకు కృత్రిమ గూళ్లను ఏర్పాటు చేయగలిగాను. మొదటగా వివిధ ఆకృతులలో చెక్క గూళ్లను నిర్మించి పెట్టాను. వాటిల్లో ప్రధానంగా పిచ్చుకలు ఆవాసం పొందిన గూటిని ప్రామాణికంగా తీసుకున్నాను. ఈ ప్రామాణిక గూళ్లకు పిచ్చుకలు త్వరగా ఆకర్షితమై వాటిలోకి చేరాయి. ఈ గూటిలో కాకులకు పిచ్చుకల పిల్లలు అందవు. వివిధ జాతుల చేరికకు వీలు కలగదు. ఒకసారి చిలుకలు, గోరింకలు లోపలికి చేరేందుకు విఫలయత్నం చేయడం చూశాను. ఇక ఈ గూళ్లలో పిచ్చుకలు వాటి పిల్లలకు ఆహారం అందించడం తేలిక. పిచ్చుకల వృద్ధికి అదో ప్లస్‌ పాయింట్‌. 

దాదాపు గూళ్లన్నీ నిండాయి!
గూళ్లను ఏర్పాటు చేసిన తరువాత ప్రతీ సంవత్సరం జనవరి చివరి వారంలో ప్రతి గూడును పరిశీలిస్తూ సర్వే చేస్తున్నాను. గూళ్లకు పిచ్చుకలు చేరాయా లేదా, వాటి రాకపోకలు,  సంతాన వృద్ధి, ఇతర పక్షుల వల్ల వాటికి కలిగే ఇబ్బందులు.. తదితర సమాచారాన్ని వాటిని ఏర్పాటు చేసిన  వారి నుంచి తెలుసుకుంటాను. అలా 2019 జనవరి వరకు 413 గూళ్లను ఏర్పాటు చేశాను. వీటిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేసిన గూళ్లు 340 కాగా, పిచ్చుకలు ఆవాసాలకు వినియోగించిన గూళ్లు 329.

సంవత్సరానికి ఈ గూళ్ల కారణంగా సరాసరిన 2 నుంచి 3 పిల్లలతో పిచ్చుక సంతానం వృద్ధి చెందినట్లు గుర్తించాను’’ అని చెప్పారు మహేష్‌.మహేష్‌ ప్రయత్నం కారణంగా గతంలో పోల్చితే ప్రస్తుతం జంగారెడ్డిగూడెంలోని ఉప్పలమెట్ట, హైస్కూల్‌ ప్రాంతం, అయ్యన్నకాలనీ, రాజులకాలనీలలో పిచ్చుక సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. ఉప్పలమెట్ట ప్రాంతంలో పదుల సంఖ్యలో ఉండే పిచ్చుకలు నేడు సుమారు 300 వరకు ఉన్నాయి. ‘‘ప్రకృతి సమతౌల్యానికి జీవ వైవిధ్యం తప్పనిసరి. మానవ మనుగడలో భాగమైన పిచ్చుకను సంరక్షించుకుంటే పంటలకు పురుగు మందుల అవసరాలే మనకు ఉండవు’’ అంటారు మహేష్‌.
– డి.వి.భాస్కరరావు, సాక్షి, జంగారెడ్డిగూడెం

పక్షి ప్రేమికుడు.. పరిశోధకుడు
వీరా మహేష్‌ ఎమ్మెస్సీ జంతుశాస్త్రం చదివారు. ప్రస్తుతం కృత్రిమ ఆవాసాల ద్వారా పిచ్చుకలపై పీహెచ్‌డీ చేస్తున్నారు. బాంబే నేచురల్‌ హిస్టరీ సొసైటీలో పరిశోధకునిగా కూడా మహేష్‌కు అనుభవం ఉంది. పక్షి సమూహాలపై వివిధ ప్రాంతాల్లో పరిశోధన చేశారు. కలివి కోడిపై పరిశోధన, పక్షుల వలసలపై పరిశోధన చేశారు. పిచ్చుకలు, ఆవాసాలు తదితర విషయాలపై మహేష్‌ రాసిన పరిశోధనాత్మక పత్ర వ్యాస వివరణ ఎన్టీఎస్‌సీ 2018లో జాతీయ స్థాయిలో ఎంపికైంది. 

ఆవాసాలు లేకనే అదృశ్యం
ఆధునిక ఒరవడిలో పట్టణాల నుంచి గ్రామాల వరకు శాశ్వత గృహాలు కాంక్రీట్‌ శ్లాబులతో నిర్మితమవుతున్నందున పిచ్చుక జాతికి గూడు నిర్మించుకోవడానికి అనుకూలమైన తాటాకిళ్లు, పెంకుటిళ్లు కనుమరుగువుతున్నాయి. దాంతో గూళ్లు పెట్టుకునే సదుపాయం తగ్గిపోయింది. సంతానోత్పత్తికి అవకాశం లేకుండా పోయింది. పిచ్చుక జాతిని నిలబెట్టడానికి ఇప్పుడున్న ఏకైక మార్గం కృత్రిమ ఆవాసాలు ఏర్పాటు చేయడం. సమస్యను ముందుగానే గుర్తించి మన ఆవాసాలను ఏర్పాటు చేసుకుంటే, అవి గూడును కట్టుకోగలుగుతాయి. దీని వల్ల పిచ్చుక జాతి వృద్ధి చెందే అవకాశాలు మెరుగవుతాయి. 

మరిన్ని వార్తలు