జీవితంలో మరోసారి కనిపించకు!

30 Oct, 2018 00:38 IST|Sakshi

చెట్టు నీడ

పూర్వం ఒక వ్యక్తి ఉండేవాడు. పెద్దల నుంచి వచ్చిన వ్యాపారాన్ని నిర్వహించుకుంటూ, ఉన్న కొద్దిపొలంలో వ్యవసాయం చేసుకుంటూ, పశువులను పెంచుకుంటూ ఉన్నంతలో బాగానే జీవించేవాడు. అయితే, ఒకరోజు ఉన్నట్టుండి ఆ వ్యక్తికి చావు గురించిన చింత పట్టుకుంది. చావు తన దరి చేరకుండా ఉండాలని కోరుతూ యముని గురించి ఘోరతపస్సు చేశాడు. యముడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు.  అతను భక్తితో చేతులు జోడించి, ‘‘యమరాజా! నువ్వు ఎవరికైనా ఒకసారే కనిపిస్తావు. నాకు నువ్వు ఇప్పుడు ఒకసారి కనిపించావు కాబట్టి మరోసారి నాకు కనిపించకు. అది చాలు నాకు’’ అన్నాడు వినయంగా.  అతని తెలివితేటలకు యముడు ఆశ్చర్యపోయాడు. తాను రెండోసారి కనిపించకూడదంటే ఇతడికి మరణం రానట్లే కదా లెక్క. అయినా ఏదైతే అదవుతుందిలే అనుకుని ‘తథాస్తు’ అన్నాడు.  వ్యాపారి ఆనందానికి అంతులేదు. వెంటనే వెళ్లి పెళ్లి చేసుకుని పిల్లలను కన్నాడు.

వాళ్లు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వాళ్లకు పెళ్లిళ్లయి, పిల్లలు పుట్టారు. వారూ పెరిగి పెద్దయ్యారు. వారికీ ళ్లయ్యాయి. ఇలా తరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ, ఎంత వయసు మీదపడినా,  ఇతనికి మాత్రం మరణం రావడం లేదు. దాంతో ఇంట్లోవాళ్లు, బయటివాళ్లు అందరూ ఇతనికి సేవలు చేయలేక ఇంకెప్పుడు చచ్చిపోతావంటూ బయటికే తిట్టసాగారు. ఇతనికి బతుకు దుర్భరంగా మారింది.  తాను అనాలోచితంగా కోరుకున్న వరమే, ఇప్పుడు శాపంగా మారిందని తెలుసు కున్నాడు. దాంతో చావుకోసం తపస్సు చేయాలనుకున్నాడు. పుట్టిన ప్రతి ప్రాణీ గిట్టక తప్పదన్నది నిజం. దీనిని గుర్తించి, బతికి ఉన్నన్నాళ్లూ సంతోషంగా జీవించాలి కానీ, చావు గురించి భయపడటం, చావును చూసి దిగులు పడటం అవివేకం.  ఎప్పటికీ జీవించే ఉండాలని కోరుకోవడం దురాశ. మన చేతిలో లేని చావును గురించి చింతపడేకంటే, చేతిలో ఉన్న జీవితాన్ని ఫలప్రదం చేసుకునేందుకు ప్రయత్నించడం కర్తవ్యం.  
–డి.వి.ఆర్‌

మరిన్ని వార్తలు