మానవతా స్ఫూర్తి

15 Jan, 2020 01:39 IST|Sakshi

మకర సంక్రాంతి

తెలుగువారి పెద్ద పండుగ మకర సంక్రాంతి. మకర సంక్రాంతి నాడే ఉత్తరాయణం ప్రారంభమౌతుంది. సూర్యరశ్మి ప్రభావం భూగోళంపై క్రమంగా పెరుగుతుంది. ఆ సమయంలో దానధర్మాలు ఆచరించాలని ధర్మశాస్త్ర గ్రంధాలు చెప్పాయి. అందుకే మకర సంక్రాంతి మనవతా స్ఫూర్తి అయింది.

సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచి ‘ధనుర్మాసం’గా అనేక రూపాలలో.. తెలుగు లోగిళ్లలో స్త్రీలు, పురుషులు, పండితులు, పామరులు, ధనవంతులు, పేదవారు అందరూ పాలుపంచుకునే విధంగా కళలు, సంస్కృతి, సంప్రదాయలు రూపొందాయి. వీటిల్లో రంగవల్లులు, జానపద కళారూపాలు, పొంగలి, పిండివంటలు ప్రధానమైనవి.

రంగవల్లులు
సంప్రదాయంలో సూచించిన విధంగా బియ్యప్పిండితో ఎనిమిది రేకుల పద్మం ముగ్గు మొదలు అనేక ముగ్గులను పోటీపడి మరీ మహిళలు నెలంతా తీర్చిదిద్దుతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు, అమ్మవారికి సంకేతంగా పసుపు, కుంకుమ వంటి రంగులు చల్లుతారు. పర్యావరణ పరిశుభ్రత, పరిరక్షణ వంటి ఐహిక ప్రయోజనాలు కూడా ఈ ముగ్గులు వేయడంలో ఉన్నాయి.

కళారూపాలు
తెలుగు సంక్రాంతి పండుగకు ప్రత్యేకమైనవి జానపద కళారూపాలు. కళాకారులు భారతీయ సంస్కృతి, పురాణాలు, కథలు, గాథలు అన్నీ ఈ నెలరోజులు ఇంటి ముందుకు వచ్చి పిల్లలను, స్త్రీలను అక్కడికక్కడే విజ్ఞానవంతులను చేసేవిధంగా వీధి ప్రదర్శనలు ఇస్తారు. కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు తన చిన్నతనంలో ఇంటి ముందుకు వచ్చే జానపదకళారూపాలను చూసి భారత భాగవత రామాయణాలు, శాస్త్రీయ విషయాలు తెలుసుకున్నానని వాటి ఆవ«శ్యకతను వివరించారు.

పొంగలి
ధర్మశాస్త్రం చెప్పిన పాయసం తెలుగు నేలలో పొంగలి అయింది. అదీ కొత్త బియ్యంతో, ఆవు పాలతో ఉడికించిన పొంగలి. తెలుగువారికి ఇది పొంగలి పండుగ. రైతులకు, వ్యవసాయ కూలీలకు, వ్యవసాయంపై ఆధారపడిన అన్ని వృత్తులవారికీ, పశువులకు అందరికీ ఆనందాన్ని, విశ్రాంతిని ఇచ్చే సామాజిక పర్వం ఇది. ధాన్యపురాశులను ఇంటికి చేర్చటం, పనివారికి ధాన్యాన్ని పంచటం, కొత్త బియ్యం పొంగలి చేసి బంధుమిత్రులకు, పనివారికి అందరికీ పంచటమే అసలైన ప్రధానమైన పండుగ అయింది.

పిండివంటలు
‘వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి’ అనుకునే తెలుగువారు.. సంక్రాంతి నాడు గారెలు తప్పనిసరిగా వండుతారు. అరిసెలు సంక్రాంతికి సంకేతమైన పిండివంట. ఈ రోజు కోసం ఎవరు ఏం చేసుకున్నా చుట్టుపక్కల వాళ్లందరికీ పంచుతారు. ఇవ్వడంలోని తీపిదనాన్ని పంచుకుంటారు.  
– డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్‌

మరిన్ని వార్తలు