ఎండాకులు భలే ఎరువు!

17 Mar, 2020 06:39 IST|Sakshi
తమ ఇంటి ఆవరణలో సేకరించిన ఎండాకులతో అదితి దేవ్‌ధర్‌

కంపోస్టు కథలు–1

నవంబర్‌ నుంచి దాదాపు ఏప్రిల్‌ వరకు మన చుట్టూతా ఉండే చెట్లు ఆకులను రాల్చుతూ ఉంటాయి. పొద్దున్న లేచేటప్పటికల్లా వాకిలి నిండా, ఇంటి ఆవరణలో, చెట్ల పక్కనున్న ఇంటి పైకప్పుల మీద, కాలనీల్లో రోడ్ల మీద, పార్కుల్లో.. ఎక్కడ చూసినా ఆకులే.. ఆకులు.. రాలిన ఆకులు! ఈ ఆకులను చక్కని కంపోస్టు ఎరువుగా మార్చుకోవచ్చని తెలిసినా.. నిర్లక్ష్యం కొద్దీ ఆకులను కుప్పజేసి నిప్పు పెట్టడమో లేదా చెత్తను మోసుకెళ్లే మున్సిపాలిటీ వాళ్ల నెత్తిన వెయ్యడమో చేస్తున్నాం.. అయితే, స్వల్ప ప్రయత్నంతోనే ఈ ఎండాకులను  అమూల్యమైన సహజ ఎరువుగా మార్చుకోవచ్చని ఓ మహిళ ఎలుగెత్తి చాటుతున్నారు. మహారాష్ట్రలోని పుణే నగరవాసి అదితి దేవ్‌ధర్‌ ‘బ్రౌన్‌లీఫ్‌’ పేరిట ఏకంగా ఓ సామాజిక ఉద్యమాన్నే ప్రారంభించి ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తున్నారు. ఈ స్ఫూర్తి కథనంతో ‘కంపోస్టు కథలు’ సిరీస్‌ను ఈ వారం ప్రారంభిస్తున్నాం..

పచ్చని చెట్లంటే మనందరికీ ఇష్టమే. అందుకే పొలాల గట్లమీద, పడావుభూముల్లో, ఇంటి దగ్గర, ఊళ్లు / కాలనీల్లో రోడ్ల పక్కన, పార్కుల్లో.. ఇష్టపడి పచ్చని చెట్లను పెంచుకుంటూ ఉంటాం. అయితే, ఆ చెట్లు రాల్చే ఆకుల్ని ఏం చేయాలి? ఊడ్చి మున్సిపాలిటీ వ్యాన్‌లో వేస్తున్నారు లేదా కుప్ప చేసి నిప్పు పెడుతున్నారు. ఈ రెండూ మంచి పనులు కాదు. పనిగట్టుకొని మొక్కలు నాటి పచ్చని చెట్లని పెంచుతున్న వారు సైతం నాకెందుకులే అనో.. ఓ రకమైన నిరాసక్తతతోనో, నిర్లక్ష్యంతోనో చూస్తూ ఊరుకుంటున్నారు.

కానీ, అదితి దేవ్‌ధర్‌ ఊరుకోలేదు. తమ ఇంటి ఆవరణలో పెద్ద చెట్లు రాల్చే ఆకులు పోగుపడుతూ ఉంటే.. ఆ ఆకులను నిప్పు పెట్టి వాయుకాలుష్యాన్ని పెంచి ప్రజారోగ్యానికి ముప్పు తేవడానికి గానీ, మున్సిపాలిటీ వాళ్లకు ఇచ్చి డంపింగ్‌ యార్డులో చెత్తదిబ్బలను కొండలుగా పెంచడానికి గానీ ఆమె ఒప్పుకోలేదు. తానే చొరవతో ఎండాకుల సమస్యకు పరిష్కారం వెదికారు.

బ్రౌన్‌లీఫ్‌ ఛాలెంజ్‌ తీసుకున్నారు. నలుగురినీ కూడగట్టారు. ఒక్క ఎండాకునూ తగులబెట్టనియ్యకూడదని ప్రతిన బూనారు. నాలుగేళ్లుగా ఎండాకులను తగులబెట్టకుండా చూస్తున్నారు. ఎండాకులతో కంపోస్టు తయారు చేసుకునే పద్ధతులను ప్రచారం చేస్తున్నారు. ఆ కంపోస్టుతో చక్కని సేంద్రియ ఇంటిపంటలు పండించుకోవడానికి దోహదం చేస్తూ మరెందరికో ప్రేరణగా నిలుస్తున్నారు. కంగ్రాట్స్‌ టు అదితి!

ఆకులను తగులబెడితే ఏమవుతుంది?
ఎండాకులను తగులబెట్టినప్పుడు ధూళి కణాలు గాలిలో కలుస్తాయి. భూతాపాన్ని పెంచే కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌ డయాక్సయిన్, మిథేన్‌ వంటి వాయువులు విడుదలవుతాయి. ఇవి శ్వాసకోశ వ్యాధులనూ కలిగిస్తాయి. చెట్లు రాల్చే ఆకులు.. భూమికి చెట్లు కృతజ్ఞతగా తిరిగి ఇస్తున్న పోషకాలు. ప్రకృతిలో, అడవిలో రాలిన ఆకులు దొంతర్లుగా పేరుకొని భూమికి ఆచ్ఛాదన కల్పిస్తున్నాయి. వర్షానికి తడిచిన ఆకులు కుళ్లి భూమిని సారవంతం చేస్తాయి. కంపోస్టు చేయడం ద్వారా ఈ ప్రక్రియకు దోహదపడటం మన కర్తవ్యం.   
 (వచ్చే వారం: లీఫ్‌ కంపోస్టర్‌ను తయారు చేసుకోవడంతోపాటు కంపోస్టు మెళకువలు నేర్చుకుందాం)

1 ఆచ్ఛాదన (మల్చింగ్‌) చెయ్యండి: ఎండాకులను మొక్కలు, చెట్ల దగ్గర నేలపై ఎండ పడకుండా మల్చింగ్‌ చేయాలి. ఎండ నేరుగా నేలకు తగలకుండా ఆకులతో ఆచ్ఛాదన కల్పిస్తే మట్టిలో ఉండే సూక్ష్మజీవులు, వానపాములకు మేలు జరుగుతుంది. కాలక్రమంలో ఆకులు కుళ్లి భూమిని సారవంతం చేస్తాయి.  ∙

2కంపోస్ట్‌ చెయ్యండి: ఎండాకులను కుళ్లబెట్టి కంపోస్టు తయారు చేయండి. కంపోస్టు చేయడానికి మూడు పద్ధతులు ఉన్నాయి. ఎ) ఇంటి ఆవరణలో ఒక మూలన గుంత తవ్వి ఆకులను అందులో వేయటం. బి) ఇనుప మెష్‌తో ట్రీగార్డు మాదిరిగా గంపను తయారు చేసి అందులో ఎండాకులు వేసి ఎక్కడికక్కడే కంపోస్టు తయారు చేయడం. సి) ఎండాకులను కుప్పగా పోసి కూడా కంపోస్టు చెయ్యొచ్చు. ఈ మూడు పద్ధతుల్లోనూ ఆకులను తేమగా ఉండేలా నీరు పోస్తుండాలి. పేడనీరు లేదా జీవామృతం లేదా వేస్ట్‌ డీ కంపోజర్‌ ద్రావణం లేదా లాక్టిక్‌ ఆసిడ్‌ బాక్టీరియా ద్రావణం లేదా పుల్లమజ్జిగ వంటి సేంద్రియ పదార్థాన్ని కుళ్లింపజేసే సూక్ష్మజీవరాశి ఉండే కల్చర్‌ను కలపాలి

3 ఇతరులకివ్వండి: పట్టణాలు, నగరాలలో నివసించే వారు ఇంటి దగ్గర లేదా కాలనీ రోడ్లపై లేదా పార్కుల్లో చెట్లు రాల్చే ఆకులను కంపోస్టు చేసే ఉద్దేశం లేకపోతే వాటిని కంపోస్టు చేసుకోదలచిన వారికి అందించడం ఉత్తమం. పుణే వాసులు ఎండాకులను ఇచ్చి పుచ్చుకోవడానికి వీలుగా అదితి బ్రౌన్‌లీఫ్‌ పేరుతో వాట్సప్‌గ్రూప్, ఫేస్‌బుక్‌ ఖాతాతోపాటు వివరంగా చర్చించేందుకు వెబ్‌సైట్‌ను సైతం ప్రారంభించారు.

తొలి ఏడాదే 500 బస్తాల ఎండాకులను ప్రజలు ఇతరులకు అందించారట. సోషల్‌ మీడియా ద్వారా సామాజికోద్యమం ప్రారంభించి ఉండకపోతే ఈ ఆకులన్నిటినీ తగులబెట్టి ఉండేవారని, ఇప్పుడు ఇలా సద్వినియోగం అయ్యాయని ఆమె సంతోషంగా చెబుతారు. అయితే, రెండో ఏడాదికి ఆకులను ఇతరులకిస్తాం అనే వారు లేకుండా పోయారట. అంటే అందరూ కంపోస్టు తయారు చేసుకోవడం, దానితో కుండీలలో సేంద్రియ ఇంటిపంటలు పండించడం ప్రారంభించారన్న మాట!



ఆకులను తగులబెట్టడం అనర్థదాయకం


ఎండాకులను కంపోస్టు చేసే పద్ధతి

మరిన్ని వార్తలు