పల్స్ చూసుకోండి... పక్షవాతం నుంచి రక్షణ పొందండి...

10 May, 2015 23:54 IST|Sakshi
పల్స్ చూసుకోండి... పక్షవాతం నుంచి రక్షణ పొందండి...

క్రమం తప్పకుండా నాడీ స్పందించే తీరును పరీక్షించుకుంటూ ఉంటే అది పక్షవాతం ప్రమాదాన్ని గణనీయంగా నివారిస్తుందంటున్నారు జర్మనీకి చెందిన న్యూరాలజిస్టులు. వాళ్లే కాదు... అమెరికాకు చెందిన యూఎస్ నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కూడా అదే మాట చెబుతున్నారు. పైగా వారు నిర్వహించిన ఒక అధ్యయనంలోనూ ఇదే తేలింది. అమెరికాకు చెందిన నేషనల్ స్ట్రోక్ అసోసియేషన్ వారు కనుగొన్న విషయాల ప్రకారం... మొదటిసారి పక్షవాతం (స్ట్రోక్)కు గురై కోలుకున్నవారిలో 24 శాతం మంది మహిళల్లో, 42 శాతం మంది పురుషుల్లో ఐదేళ్లలోపు మరోసారి స్ట్రోక్ వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.

ఎడమచేతి మణికట్టు వద్ద ఉండే రేడియల్ ఆర్టరీ అనే రక్తనాళాన్ని పట్టుకుని పల్స్‌ను పరీక్షిస్తున్నప్పుడు అందులో ఏవైనా తేడాలు ఉంటే గుండె కొట్టుకోవడంలో తేడా ఉందని అర్థం. గుండె స్పందనల లయ సరిగ్గా లేని ఈ కండిషన్‌ను ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. ఇది ఒక్కోసారి మరణానికి దారితీయవచ్చు. మొదటిసారి స్ట్రోక్ వచ్చిన 256 మందిపై నిర్వహించిన పల్స్ రీడింగ్ ద్వారా వాళ్లలో ఈ ఏట్రిల్ ఫిబ్రిలేషన్‌ను గుర్తించి, ప్రమాదాలను నివారించడం సాధ్యమైనట్లు పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలను ‘న్యూరాలజీ’ అనే జర్నల్‌లోనూ పొందుపరిచారు.

మరిన్ని వార్తలు