‘కలల’ వికేంద్రీకరణే ఉత్తమం

17 Jan, 2020 00:06 IST|Sakshi

విశ్లేషణ

అధికారంలో ఉన్నామన్న ఏకైక ధీమాతో విభజనానంతర ఆంధ్రప్రదేశ్‌ రాజధాని పేరుతో ఏకపక్ష అభివృద్ధి నమూనా కోసం గత ముఖ్యమంతి చంద్రబాబు చేసిన ప్రయత్నం ఏపీ అభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారింది. అయిదేళ్లపాటు కలల రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌తో జిమ్మిక్కులు సృష్టించి చేతులెత్తేసిన చంద్రబాబు తాజాగా ‘అక్కడే రాజధాని. అదే రాజధాని’ అనే పల్లవి తోడుగా జిల్లాలను చుట్టేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజానీకం తనపట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంటున్న విషయం పసిగట్టిన బాబు ఇంతవరకు తన తాజా ఉద్యమాన్ని ఉత్తరాంధ్ర గడపకు తీసుకుపోవడానికి కూడా సాహసించడం లేదు. ఇక సీమకు వచ్చి జోలెపడితే అడుగడుగునా బాబుకు అవమానాలే.. కొందరు వ్యక్తుల ప్రయోజనం కోసం రాష్ట్ర భవిష్యత్తును నిర్మించదలిస్తే ఏమవుతుందో చంద్రబాబు గత అయిదేళ్ల పాలన చాటిచెబుతోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల ప్రయోజనాలను పణంగా పెట్టి కొందరి ప్రయోజనాల కోసం, చంద్రబాబు వ్యక్తిగత అవసరాల కోసం ‘చరిత్రలో నిలిచిపోయే రాజధాని’ నిర్మాణం చేపట్టడం ప్రమాదకరం. ఈ నేపథ్యంలో కేంద్రీకృత అభివృద్ధిలో దాగిన అసలు నిజాలను తెలుసుకోవడం, మూడు ప్రాంతాల సమగ్రాభివృద్ధితోనే మౌలిక ప్రగతి సాధ్యం అని గ్రహించడం రాష్ట్ర ప్రజలకు అత్యంత ఆవశ్యకంగా మారింది.

కొందరి రాజధాని అందరి రాజధాని అవుతుందా?
మొట్టమొదటగా అమరావతి ప్రాంతాన్ని, అమరావతి ప్రాజెక్టును వేరు వేరుగా చూడాల్సి ఉంది. అమరావతి ప్రాంతం అంటే అక్కడి ప్రజలు. ప్రాజెక్టు మాత్రం కొందరు వ్యక్తుల ప్రయోజనం కోసం రూపొందించినది. ఈ వాస్తవాన్ని విస్మరించి అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని గుండు గుత్తగా వ్యతిరేకించడం నేడు జరుగుతున్న తప్పుడు ప్రచారం. నిజానికి రాజధాని పేరిట జరుగుతూ వచ్చిన నిర్మాణాలు అమరావతిలో కాదు వెలగపూడిలో అన్నది అందరూ గుర్తించాలి. అమరావతి ప్రాజెక్టు రూపాన్ని పరిశీలిస్తే ఎంపిక చేసుకున్న ప్రాంతంలో స్థూలంగా 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. అదనంగా రైతుల నుంచి మరో 33 వేల ఎకరాల భూమి తీసుకున్నారు.

అందుకు ప్రతిగా రాష్ట్రం మొత్తం రైతులకు 5 దఫాలుగా 50 వేల రూపాయలు మాఫీ చేయగా అక్కడి రైతులకు ఒకే సారి 1.50 లక్షల రుణమాఫీ చేశారు. ప్రతి ఏటా ఎకరాకు 50 వేలు కౌలు చెల్లించాలి. ప్రతి ఏటా మొత్తంలో 10 శాతం పెంచుకుంటూ 10 సంవత్సరాలు ఇవ్వాలి.కేవలం ప్రతి ఏటా చెల్లించే కౌలు మాత్రమే రూ. 165 కోట్లు దీనికి ప్రతి ఏటా 10 శాతం అదనంగా వేసి ఇవ్వాలి. అభివృద్ధి చెందిన రాజధానిలో మూడవ వంతు తిరిగి ఇవ్వాలి. స్థూలంగా అక్కడి రైతులకు 11 వేల ఎకరాల భూమి అభివృద్ధి చెందిన రాజధానిలో ఉంటుంది. అంటే మొత్తం 50 వేల ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన రాజధానిలో ప్రభుత్వ భూమి పోను మిగిలిన భూమి అంతా ఆ 19 గ్రామాలకు చెందిన ప్రజలకు మాత్రమే చెందినదిగా ఉంటుంది. అలాంటి రాజధాని 5 కోట్ల మంది ప్రజలది ఎలా అవుతుంది?

ఏపీకి నూతన నగరం అసాధ్యం
5 కోట్ల మంది జనాభా కలిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని నగరాలు ఉంటాయి? ఇప్పటికే విశాఖ, కాకినాడ, రాజమండ్రి,  విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు లాంటి 8 నగరాలు అందుబాటులో ఉన్నాయి. మరోనగరం సాధ్యమా? కొత్త నగరాన్ని కోరుకుంటున్నవారు పెట్టుబడులు ఆకర్షించాలని చెబుతున్నారు. రాష్ట్రంలో ఐటీ కంపెనీల కోసం తిరుపతి, హిందూపురం అత్యంత అనువయిన ప్రాంతాలు. పారిశ్రామిక అవకాశాలకు విశాఖ–కాకినాడ, శ్రీసిటీ లాంటివి అందుబాటులో ఉన్నాయి. స్వల్ప ఖర్చుతో ఈ నగరాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అన్ని అవకాశాలను అంది పుచ్చుకోవచ్చు. వీటిని పక్కనపెట్టి అత్యంత వ్యయప్రయాసలతో ఉత్తరాంధ్ర, రాయలసీమ, గోదావరి జిల్లాల ప్రయోజనాలను పణంగా పెట్టి కొందరి ప్రయోజనాల కోసం, చంద్రబాబు వ్యక్తిగత అవసరాల కోసం ‘చరిత్రలో నిలిచిపోయే రాజధాని’ నిర్మాణం చేపట్టడం ప్రమాదకరం. శివరామకృష్ణన్‌ చెప్పినట్లు ‘అమరావతి అద్భుత రాజధాని నిర్మాణం కోసం రాష్ట్రంలోని వనరులను, శక్తిసామర్థ్యా లను వెచ్చించడం ఆత్మహత్యా సదృశమే’.

కేంద్రీకరణ అభివృద్ధికి ఆటంకం
అమరావతిలో అంతర్జాతీయ స్థాయి రాజధానిని నిర్మించండి అభివృద్ధిని కావాలంటే వికేంద్రీకరణ చేయండి అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అభివృద్ధి కేంద్రీకరణ ఉంటే వికేంద్రీకరణకు అవకాశం ఎలా ఉంటుంది? పైపెచ్చు నూతన నగరంగా అమరావతి నిర్మాణం చేపట్టాలంటే లక్షల కోట్లు కావాలి. రాజధానికి నిధులు అవసరం లేదు అంటున్నారు. కానీ అది వట్టి ప్రచారం మాత్రమే. చంద్రబాబు తిరుపతిలో జరిగిన 14వ ఆర్థిక సంస్థకి సమర్పించిన నివేదికలో హైదరాబాద్‌లో కేంద్రం 2 లక్షల కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల కోట్లు ఖర్చు చేసిందని పేర్కొన్నారు. హైదరాబాద్‌ను మించిన రాజధానిగా అమరావతి నిర్మాణం జరగాలంటే అంతకు మించి ఖర్చు కాకుండా ఎలా ఉంటుంది? ప్రభుత్వం దగ్గర ఉన్న వనరులను రాజధాని నిర్మాణం కోసం ఖర్చు చేస్తే పేదల సంక్షేమ కార్యక్రమాలు, విద్యా వైద్య సౌకర్యాలతో బాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర నీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలంటే నిధులు ఎక్కడ నుంచి వస్తాయి?

చంద్రబాబు అభివృద్ధి నమూనా ప్రమాదకరం
చంద్రబాబు అధికారంలో ఉన్నామన్న ధీమాతో అమరావతి ఏకపక్ష అభివృద్ధి నమూనా కోసం ప్రయత్నాలు చేశారు. ఒక రాష్ట్రంలో ప్రాధాన్యతలను నిర్ణయించుకునేటప్పుడు పాలకులు గుర్తుంచుకోవాలసింది రాష్ట్రంలోని పరిస్థితులు. రాష్ట్రంలో ఐక్యరాజ్య సమితి పరి శీలన మేరకు పుడుతున్న 100 మంది పిల్లలలో రాయలసీమలో 45–50 , ఉత్తరాంధ్రలో 35–40, కోస్తా ప్రాంతంలో 25 మంది బలహీనంగా పుడుతున్నారు. దానికి కారణం నీరు, పేదరికం. ఇంతటి వ్యత్యాసం ప్రాంతాల మధ్య ఉన్నపుడు పాలకులు చేయాలసింది సమతుల్యత అందుకోసం వెనుకబడిన ప్రాంతాల్లో నీటి సౌకర్యం, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలి. ఇలాంటి నేపథ్యంలో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు భిన్నంగా ప్రాధాన్యతలను ఎంచుకుంది. అమరావతి ప్రయోజనాల కోసం రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రయోజనాలను పణంగా పెట్టినారు.

రాయలసీమలో గత ప్రభుత్వాలు నిర్మించిన కొన్ని సంస్థలను రద్దు చేశారు. ప్రయివేటు సంస్థలను ఇతర ప్రాంతాల్లో పెట్టకుండా అమరావతిలో పెట్టేలా ఒత్తిడి తీసుకువచ్చారు. ఏపీ జీవనాడి అనుకున్న పోలవరం నిర్మాణంలో కూడా పాక్షికదృష్టితో వ్యవహరించారు.అమరావతి అవసరాల కోసం ఉపయోగపడే కుడికాలువను (పట్టిసీమ) ఒక ఏడాదిలో పూర్తి చేసిన చంద్రబాబు విశాఖతో సహా గోదావరి , ఉత్తరాంధ్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఎడమకాలువ (పురుషోత్తపట్నం) నిర్మాణాన్ని పట్టించుకోలేదు. ఫలితంగా అది నేటికీ పూర్తి కాలేదు. అందుకే అమరావతి ప్రాజెక్టు రాయలసీమ, ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల ప్రయోజనాలకు విఘాతం అన్న భయం పట్టుకుంది.

వీటిని పట్టించుకోకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం అమరావతి అని కాకుండా అమరావతి కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అని భావించడం ప్రమాదకరం. ఇలాంటి అభివృద్ధి నమూనా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారడం ఖాయం.ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ప్రతిబంధకంగా మారిన అమరావతి ప్రాజెక్టును రద్దు చేయాలని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం భావించడం సముచితమైన నిర్ణయం. రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కొత్తగా మహానగర నిర్మాణం ఆలోచనను పక్కన పెట్టాలి. రాజధానితో సహా అభివృద్ధి, నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో కేటాయింపు, సత్వర పూర్తికి చర్యలు తీసుకోవాలి. మొత్తం ఈ వ్యవహారంలో నిర్ణయం, అమలు విషయంలో గత ప్రభుత్వం లాగా కాకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో అందరి అభిప్రాయాలను, అభిమతాలను పరిగణనలోకి తీసుకుని హేతుబద్ధ నిర్ణయం తీసుకొని సమతుల్యతతో కూడిన సమగ్రాభివృద్ధికి బాటలు వేయాలి.

మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి
వ్యాసకర్త సమన్వయకర్త, రాయలసీమ మేధావుల ఫోరం
మొబైల్‌ : 94904 93436

మరిన్ని వార్తలు