ముగ్గురు బలి

6 Jun, 2018 00:16 IST|Sakshi
మేఘన్‌ మార్కల్‌, కరీనా కపూర్‌, కంగనా రనౌత్‌

ఫెమినిజం

క్వీన్‌ ఎలిజబెత్‌ గారింటి కొత్త వధువు మేఘన్‌ మార్కెల్, బాలీవుడ్‌ పురుషాహంకారాల విధ్వంసకారిణి కంగనా రనౌత్,  తను తనులాగే మాట్లాడే కరీనా కపూర్‌.. ఈ ముగ్గురూ.. ఫెమినిస్టులమని చెప్పుకున్నందు వల్ల అంతోఇంతో కోల్పోయారు!

‘ఫెమినిజం’ అనే మాట, ‘నేను ఫెమినిస్టును’ అనే ఆత్మవిశ్వాసపు ప్రకటన.. ఈవారంలో ముగ్గురు ఆరాధ్య దేవతల్ని బలి తీసుకుంది! ఎక్కడైనా దేవతలు బలి కోరుతారు. దేవతలే బలవుతారా?!  దేవతలు అని మనం అనుకున్నాం తప్ప, మనల్ని అనుకోమని వాళ్లేమీ అనలేదు. కనుక వాళ్లు బలి అవడంలో తప్పు మనదే, బలి అయినందువల్ల కింద పడిన.. వాళ్ల కిరీటమూ మనం పెట్టిందే.  క్వీన్‌ ఎలిజబెత్‌ గారింటి కొత్త వధువు మేఘన్‌ మార్కెల్, బాలీవుడ్‌ పురుషాహంకారాల విధ్వంసకారిణి కంగనా రనౌత్, తను తనులాగే మాట్లాడే కరీనా కపూర్‌.. ఈ ముగ్గురూ.. ఫెమినిస్టులమని చెప్పుకున్నందు వల్ల అంతోఇంతో కోల్పోయారు! వీరిలో కంగనా.. ‘క్లే ఫీట్‌ ఐడల్‌’గా (బురదకాళ్ల దేవత) మిగిలిపోయారు. పెళ్లికి కాస్త ముందు మేఘన్‌ ‘నేను ఫెమినిస్టునని చెప్పుకోడానికి గర్వపడుతున్నాను’ అని ప్రకటించడం.. ఆమెకు పుట్టబోయే కూతుళ్లను సింహాసన వారసత్వానికి దూరం చేసింది. బ్రిటిష్‌ చట్టాల ప్రకారం ‘జెండర్‌ న్యూట్రల్‌’గా ఉండేవాళ్లే రాజులు గానీ, రాణులు గానీ అవుతారు. కరీనా సంగతి తెలిసిందే. ఆమె ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై నెట్‌లో ఇప్పటికీ వెటకారాల వరద ఉద్ధృతం అవుతూనే ఉంది. ‘స్త్రీ, పురుష సమానత్వాన్ని విశ్వసిస్తాను. అలాగని నేను ఫెమినిస్టును కాను’ అని కరీనా అనడాన్ని లోకం తప్పుపడుతోంది. ఫెమినిజం అంటేనే స్త్రీ,పురుష సమానత్వం అని కదా అని లోకం పాయింట్‌. 

ఇప్పుడిక కంగనా అదే ఫెమినిజానికి బుక్‌అయ్యారు. మిగతా ఇద్దరిలా కాదు కంగనా. కరడుగట్టిన ఫెమినిస్టు. ఇష్టం వచ్చినట్లు బతికేస్తారు. ఇష్టం లేని దాన్ని ఉతికేస్తారు. కరణ్‌జోహార్‌ బంధుప్రీతిని, హృతిక్‌ రోషన్‌ కపట ప్రేమను ఇలాగే బట్టబయలు చేశారు. పెద్ద పెద్ద స్టార్‌లను నిర్లక్ష్యంగా చూశారు. ‘ఎంత పొగరు!’ అని అంత కోపంలోనూ ఇండస్ట్రీ ఆమెను ఆరాధించింది. అలాంటి అమ్మాయి ఇటీవల కాన్స్‌ ఫెస్టివల్‌లో సహ నటుడు జిమ్‌ సర్భ్‌ వేసిన రేప్‌ జోక్‌కి దడేల్మని నవ్వడం సోషల్‌ క్రిటిక్స్‌కి నచ్చలేదు. జోక్‌ ఏమిటన్నది అలా ఉంచితే.. ఒక స్త్రీవాది.. రేప్‌ జోక్‌కి నవ్వడం పెద్ద చర్చ అయింది. ఇప్పుడు ఆమెను ఇంకో వివాదం చుట్టుకుంది. ‘మీరు భారతీయురాలై ఉంటే కనుక చీర ఎలా కట్టుకోవాలో మీకు తెలిసుండాలి’ అని ఓ ఫ్యాషన్‌ షోలో కంగనా అనడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.. ఒక ఫెమినిస్టు ఇలా మాట్లాడ్డం ఏమిటని! ఫెమినిస్టు ఎలా మాట్లాడతారు? అసలు ఎలా మాట్లాడాలి? కంగనా వల్ల తలెత్తిన ప్రశ్నలకు మళ్లీ కంగనానే సమాధానం. ఆమె బలమైన ఫెమినిస్టు. జబ్బు పడిన సమాజానికి ఫెమినిజం శక్తిమంతమైన ఔషధం అని ఆమె ఒపీనియన్‌. ఒపీనియన్‌ కాదు. అలాగని వాదిస్తారు కూడా. ఫెమినిజం సిద్ధాంతం కాదంటారు. అదొక పరిహారం అంటారు. స్త్రీ, పురుషుల్లో రక్తం ఒకేలా ప్రవహిస్తుంది కదా. అప్పుడు.. ఒకే పనికి ఒకే జీతం ఎందుకుండదని అడుగుతారు. సమాజంలోని  ఈ అసమానతలకు ఫెమినిజమే విరుగుడని అంటారు. అంత స్ట్రాంగ్‌ ఫెమినిస్ట్, గ్లోబల్‌ ఉమన్‌.. ‘మన చీరలు, మన సంస్కృతి’ అనడం ఏంటనే చూపుడు వేలు రెండ్రోజులుగా ఆమెనే చూస్తోంది. చూపుడు వేళ్లను పట్టించుకునేంత వీక్‌ కాదు కంగనా, కరీనా, మేఘన్‌.  ఫెమినిజం అనే మాటకు ఇప్పుడు ఒకే అర్థం సరిపోదు. ఉన్న ఆ ఒక్క అర్థంలోనే ఇమిడిపోయేవి కావు కంగనా, కరీనాల నవ్వులు, స్టేట్‌మెంట్‌లు. ఇక మేఘన్‌ ఫెమినిజానికి బ్రిటన్‌ ఎలాగూ పట్టని కుర్చీనే. మేఘన్‌కూ అది పట్టింపు లేని పీఠమే.
మాధవ్‌ శింగరాజు  

మరిన్ని వార్తలు