వేషం ఉంది.. టాప్‌ తీసెయ్‌ అన్నాడు

7 Jan, 2020 04:14 IST|Sakshi

బాలీవుడ్‌ ఇండస్ట్రీలో స్త్రీలు పని చేసే వాతావరణంలో ఎన్ని అడ్డంకులు ఉన్నా పోరాటం ఆగదు అంటున్నారు టెలివిజన్‌ స్టార్‌ మల్హర్‌ రాథోడ్‌. ఢిల్లీకి చెందిన ఈ నటి కొన్ని చేదు అనుభవాల తర్వాత ముంబై నుంచి తిరిగి ఢిల్లీకి చేరుకున్నారు. ‘శక్తిని పుంజుకుంటాను... తిరిగి పోరాడతాను’ అంటున్నారామె.

‘హోస్టేజెస్‌’ (2019) వెబ్‌ సిరీస్‌లోనూ, ‘తేరే లియే బ్రో’ (2017) టీవీ సిరీస్‌లోనూ నటించిన మల్హర్‌ రాథోడ్‌ బాలీవుడ్‌లో ఒక నటిగా, మోడల్‌గా ఎదుర్కొనాల్సిన సవాళ్లన్నీ ఎదుర్కొన్నారు. స్త్రీలకు ఆత్మరక్షణ తెలిసి ఉండాలని చెప్పే ఈ నటి ప్రస్తుతం కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకుంటున్నారు. ‘స్త్రీలు పోరాటం చేయాలి. అందుకు  సన్నద్ధం కూడా అయి ఉండాలి’ అని ఆమె అంటారు. మల్హార్‌ రాథోడ్‌ అందరు వర్థమాననటులకు మల్లే తానూ బాలీవుడ్‌లో కష్టాలు పడ్డారు. ‘నటించాలనే నా కోరికను నా కుటుంబం కాదనలేదు. కాని ముంబైలో నాకు ఎదురయ్యే సవాళ్లు వాళ్ల నుంచి దాచాలంటే కష్టంగా ఉండేది’ అని ఆమె అంది.

‘ఒక నిర్మాత.. అతని వయసు 65 సంవత్సరాలు ఉంటాయి. సినిమాలో వేషం ఉందని ఆఫీసుకు పిలిపించాడు. నీకు వేషం ఉంది... ఒకసారి ఆ టాప్‌ తీసెయ్‌ అన్నాడు. నేను షాక్‌ అయ్యాను. ఎలా రియాక్ట్‌ అవ్వాలో కూడా తెలియలేదు. మెల్లగా అక్కడి నుంచి వచ్చేశాను. దీని నుంచి బయటపడటానికి చాలా రోజులు పట్టింది’ అని ఆమె ముంబైలో ఇటీవల ఏ.ఎఫ్‌.పి వార్తా సంస్థకు తెలియచేసింది. ‘బాలీవుడ్‌లో ఎవరైనా పని లేకపోవడం అనే కష్టాన్ని అనుభవిస్తారు. నెలల తరబడి పని దొరకదు. ఆడవాళ్లకు సెక్సువల్‌ హరాస్‌మెంట్స్‌ అదనం. అదృష్టవశాత్తు మీటు ఉద్యమం రావడం వల్ల కొంత చైతన్యం వచ్చింది. హాలీవుడ్‌లో బాలీవుడ్‌లో కొందరి బండారం బట్టబయలైంది. ఆ ఉద్యమం రాకపోయి ఉంటే జరిగేది జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మన దేశంలో ఇలాంటి విషయాల పట్ల బహిరంగంగా బయట మాట్లాడరు. కాని తప్పక మాట్లాడాలని నేను అంటాను’ అందామె.


కిక్‌ బాక్సింగ్‌ నేర్చుకుంటున్న మల్హర్‌ రాథోడ్‌
‘మా కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయి. వాళ్లు నన్ను తమ వ్యాపారాలు చూసుకుంటే చాలని అనుకుంటున్నారు. బాలీవుడ్‌లో స్ట్రగుల్‌ అవుతూ ఉండటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కాని మన కలలు నెరవేర్చుకోవడానికి వెనకడుగు వేయాల్సిన అవసరం లేదు. నేను కొంత కాలం కోసం ఢిల్లీ వచ్చేశాను. మానసికంగా, శారీరకంగా మరింత దృఢమయ్యి తిరిగి ముంబై వెళతాను. అనుకున్నది సాధిస్తాను’ అందామె.
మల్హార్‌ రాథోడ్‌ పాములు తిరిగే దారిలో కర్ర పట్టుకొని నడవాల్సిన అవసరాన్ని చెబుతున్నారు. పాములుంటాయని ఆ దారిలోనే వెళ్లడం మానేస్తే మణులు మన చేత చిక్కవు అని కూడా ఆ మాటలకు అర్థం. పోరాటం కొనసాగించే వారే విజయానికి చేరువవుతారు. లక్ష్యం చేరుకుంటారు.

మరిన్ని వార్తలు