త్రీమంకీస్ - 57

14 Dec, 2014 23:29 IST|Sakshi
త్రీమంకీస్ - 57

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 57
- మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘నాకు నిద్ర వస్తోంది’’ రాత్రి ఎనిమిదిన్నరకి వానర్ టీ తాగి ఆవులించినట్లు నటించి చెప్పాడు.
 ‘‘నాక్కూడా’’ మర్కట్ కూడా అదే పని చేసి చెప్పాడు.
 ‘‘ఉన్నది ఒకటే బెడ్‌రూం. కాబట్టి మర్కట్, ఇక్కడ సోఫాలో నువ్వు పడుకో. వానర్, నువ్వు పొట్టి కాబట్టి డైనింగ్ కుర్చీలని పక్కపక్కన ఉంచి వాటి మీద పడుకో. నేను, కపీష్ లోపల మంచం మీద పడుకుంటాం’’ రుధిర చెప్పింది.
 ‘‘అలాగే.’’
 ఆ ఇద్దరూ గదిలోకి వెళ్ళి తలుపేసుకోగానే వానర్ రుధిర లేప్‌టేప్‌ని తెరిచాడు. అది పాస్‌వర్డ్‌ని అడిగింది. ఇద్దరూ అది ఏమై ఉండచ్చా అని ఆలోచించారు.
 ‘‘నైఫ్ అని టైప్ చేసి చూడు’’ మర్కట్ సూచించాడు.
 ‘‘ఊహూ. అది కాదు.’’
 రివాల్వర్, పిస్టల్, స్వోర్డ్‌ల తర్వాత బ్లడ్ అని టైప్ చేస్తే తెరచుకుంది. గూగుల్‌లోకి వెళ్ళి రైట్ టైం కోసం వెదికితే చాలా కనిపించాయి. టొరంటోలోని ఓ ట్రావెల్ ఏజన్సీ పేరది. టోక్యోలోని ఓ షేర్ బ్రోకర్ సంస్థ పేరది. టెహ్రాన్‌లోని ఓ పెళ్ళిళ్ళని కుదిర్చే సంస్థ పేరది. టెల్ అవివ్‌లోని కండోమ్స్ బ్రాండ్ పేరది. హైద్రాబాద్‌లో ఓ వాచీ షాప్ పేరది. రైట్ టైం అనే వాచీ షాప్ బంజారాహిల్స్‌లో ఉంది. ఆ అడ్రస్‌ని రాసుకుని గూగుల్ మేప్స్‌కి వెళ్ళి దాన్ని టైప్ చేశాడు. ఆ గూగుల్ మేప్‌ని చూసి వానర్ ఆనందంగా చెప్పాడు.
 ‘‘ఇదిగో. ఈ వాచ్ షాప్ పక్కనే ప్రుడెన్షియల్ బేంక్ ఉంది.’’
 ‘‘ఎస్ అదే అయి ఉంటుంది’’ చెప్పి లేచి వానర్ బెడ్‌రూం తలుపు తట్టాడు.
 చెదిరిన జుట్టుతో, నడుం నించి చుట్టుకున్న దుప్పటిలో ఉన్న కపీష్ తల మాత్రం బయటకి పెట్టి అడిగాడు.
 ‘‘ఏమిటి?’’
 ‘‘ఆ అడ్రస్ కనుక్కున్నాం’’ వానర్ ఆనందంగా చెప్పాడు.
 ‘‘రేపటి మాటలు ఇవ్వాళ దేనికి? ఇవాల్టి పని ఇవాళ చేయనీ’’ కోపంగా చెప్పి కపీష్ తలుపు మూశాడు.
 17
 ‘‘రాత్రెలా గడిచిందేంటి?’’ మర్కట్ మర్నాడు ఉదయం ప్రశ్నించాడు.
 ‘‘అమ్మాయిలు బట్టల్లేకుండా కన్నా బట్టలతోనే అందంగా కనిపిస్తారని అర్థమయ్యేలా గడిచింది. పైగా నా పేరు కప్‌గా, ఆమె పేరు రుర్‌గా మారింది’’ కపీష్ చెప్పాడు.
 ‘‘ఏం మాట్లాడుకున్నారు?’’ వానర్ ఉత్సాహంగా అడిగాడు.
 ‘‘ఒక్క మాట కూడా మాట్లాడలేదురా మూర్ఖా. బెడ్ రూం మాటల కోసం కాదురా. అది వేరే పనికి ఉద్దేశించబడిందని తెలుసుకో’’ కపీష్ నవ్వుతూ చెప్పాడు.
 రుధిర స్నానానికి బాత్‌రూంలోకి వెళ్ళాక వాళ్ళు మళ్ళీ గుసగుసలాడారు.
 ‘‘మనకి సొరంగంలో ఎలక్ట్రిక్ డ్రిల్ అవసరం. అది ఎంతవుతుందో?’’ కపీష్ గుసగుసలాడాడు.
 ‘‘ఎలక్ట్రిక్ డ్రిల్ కొనడానికి మనకి నాలుగున్నర వేలు అవసరం’’ వానర్ గూగుల్ చేసి చూసి చెప్పాడు.
 ‘‘అంత డబ్బు మన దగ్గర లేదు. రుధిరని అప్పడుగు’’ మర్కట్ సూచించాడు.
 ‘‘అలాగే.’’
 రుధిర డ్రెస్ చేసుకుని వచ్చాక మర్కట్ చెప్పాడు.
 ‘‘మా వాడు మీతో ఓ విషయం మాట్లాడటానికి మొహమాట పడుతున్నాడు. వాడి తరఫున నేను మాట్లాడనా?’’
 ‘‘అలాగే. పెళ్ళి గురించేగా అంకుల్?’’
 ‘‘అవును. అలా పక్కకి వెళ్దాం పద.’’
 ఇద్దరూ పక్కకి వెళ్ళి మాట్లాడి వచ్చాక ఆమె కపీష్ చేతిని పట్టుకుని చెప్పింది.
 ‘‘గుళ్ళో పెళ్ళి వద్దు కప్.’’
 ‘‘ఏం? చీప్‌గా ఉంటుందనా?’’ మర్కట్ అడిగాడు.
 ‘‘కాదు. అతిథులంతా కానుకలని హుండీలో వేసి వెళ్తారు.’’
 ‘‘అది సరే. నా మిత్రుడికి ఇప్పుడో ఆరు వేల రూపాయలు అవసరం అయ్యాయి. అప్పుగానే’’ వానర్ చెప్పాడు.
 థంప్స్ డౌన్ సైన్‌ని చూపించి చెప్పింది - ‘‘ఇప్పుడు నా సమస్యా అదే. సారీ కప్. నా డబ్బంతా ప్రస్తుతం లాయర్ దగ్గర ఫీజ్ రూపంలో ఉంది. ఐ కాన్ట్ హెల్ప్ యు.’’
 ‘‘ఇట్సాల్ రైట్. నాకు అప్పు అడగడంలో మొహమాటం లేదు. కాని నిన్ను అడగడంలో ఇబ్బంది పడ్డాను’’ కపీష్ చెప్పాడు.
 డోర్ బెల్ విని మర్కట్ తలుపు తెరిచాడు. అతన్ని చూడగానే ఎదురుగా నిలబడ్డ యువతి మొహం విప్పారింది.
 ‘‘వాటే సర్‌ప్రైజ్! నువ్వు ఇక్కడ ఉన్నావా? నీకోసం నేను ఎంత తపించిపోతున్నానో తెలుసా?’’ ఆమె చెప్పింది.
 ‘‘మీరెవరు?’’ మర్కట్ ఆశ్చర్యంగా అడిగాడు.
 ‘‘గుర్తు పట్టలా? నేను వైని.’’
 ‘‘వైయా? ఎక్స్ కాదా?’’
 ‘‘గుడ్ జోక్. వైతరణిని.’’
 ‘‘ఓ!’’ తెల్లబోతూ చూస్తూండిపోయాడు.    
 ‘‘నేను యూనిఫాంలో లేకపోవడంతో గుర్తు పట్టలేకపోయావా మట్?’’
 ‘‘మట్ ఎవరు?’’
 
 (మూలిక, వైతరిణిలను చూసి కపీష్ ఎందుకు భయపడ్డాడు?)
 
 - మళ్లీ  రేపు
 
ఈ చిరునామాకి మీ అభిప్రాయాన్ని రాసి పంపండి: త్రీ మంకీస్ సీరియల్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి  టవర్స్, రోడ్ నంబర్ 1, బంజారాహిల్స్, హైదరాబాద్-34 3monkies.sakshi@gmail.com
 
లెటర్స్
ఎంత బిజీగా ఉన్నా త్రీ మంకీస్ చదవడం నా నిత్య చర్య అయింది. సీరియల్ పట్టులో ఉంది. - షాహీర్, తాడిపత్రి
The episode published on 12-12-14 is very funny...this type of comic
 serials coming from authors r very rare...thanx to Malladi garu &
 sakshi...
 - pradeep kumar pedada,srikakulam
 

మరిన్ని వార్తలు