త్రీమంకీస్ - 64

21 Dec, 2014 23:04 IST|Sakshi
త్రీమంకీస్ - 64

డైలీ సీరియల్ - క్రైమ్ కామెడీ సస్పెన్స్‌థ్రిల్లర్ - 64
 

 మల్లాది వెంకటకృష్ణమూర్తి
 
 ‘‘రేపు ఆదివారం సాయంత్రం నాలుగుకి బేంక్ మూసేస్తారు. సోమవారం శెలవు. అది ఆదివారం సగం పూట పనిచేసే బేంక్. కాబట్టి మనం నాలుగుకల్లా లోపలకి వెళ్తే మంగళవారం ఉదయం తొమ్మిదికి బేంక్ తెరిచే దాకా టైం ఉంటుంది. రేపు మనకి కొంత సామాను అవసరం ఉంటుంది. బేంక్‌లోని ఫ్లోర్‌ని సొరంగంలోంచి కట్ చేయడానికి ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్, టార్చిలైట్లు మొదలైనవి.’’
 ‘‘ఐతే ఇంక ఇక్కడ మనకేం పని? కిందకి పదండి. వాటి సంగతి గూగుల్‌లో చూద్దాం’’ వానర్ చెప్పాడు.

 ‘‘సరే. నేను ఆమెని బెడ్‌రూంలోకి తీసుకెళ్తాను. మేం బయటకి వచ్చే లోగా నువ్వు మనకి ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్, టార్చిలైట్లు మొదలైనవి కొనడానికి ఎంత అవసరమో చూడు’’ కపీష్ సూచించాడు.

 ముగ్గురూ రుధిర అపార్ట్‌మెంట్‌కి చేరుకున్నారు.
 ‘‘టీ చేస్తున్నాను’’ ఆమె చెప్పింది.
 ‘‘ఎనీ కోక్ ఇన్ ఫ్రిజ్ బై ఎనీ ఛాన్స్?’’ వానర్ అడిగాడు.
 ‘‘సారీ. నో.’’

 ‘‘కోక్2హోమ్‌డాట్‌కామ్‌లో అకౌంట్ పెట్టుకోండి. ఫ్రీ డెలివరీ ప్లస్ కనీసం పది శాతం డిస్కౌంట్.’’
 వానర్ వాళ్ళ పథకం ప్రకారం లేప్‌టాప్‌లో గూగుల్ చేసి చూసి చెప్పాడు.
 ‘‘ఎలక్ట్రిక్ డ్రిల్, సుత్తి, వర్క్ గ్లవ్స్ కొనడానికి సుమారు ఎనిమిది వేలు కావాలి.’’
 ‘‘గూగుల్ చేసి ఆ డబ్బు కూడా ఎలా దొరుకుతుందో చూడు’’ మర్కట్ సూచించాడు.
 వానర్ ఆ ప్రకారం సెర్చ్ చేసి చెప్పాడు.

 ‘‘అన్ని ఆర్థిక అవసరాలకి తమ దగ్గరకే రమ్మనే ప్రుడెన్షియల్ బేంక్ ప్రకటనకి తీసుకెళ్ళింది గూగుల్.’’
 వానర్ సెకండ్ హేండ్ ఎలక్ట్రిక్ డ్రిల్స్ అమ్మే షాపుల వివరాల ప్రింటవుట్‌ని తీశాడు.
 డోర్ బెల్ వినపడగానే వానర్ వెళ్ళి తలుపు తీశాడు. ఎదురుగా గళ్ళ లుంగీకి బెల్ట్ పెట్టుకున్న ఓ శాల్తీ. రుధిర పోలికలతో ఉన్న ఆయన ఎర్రగా కాలిపోతున్న కళ్ళతో లోపలకి వచ్చాడు.
 ‘‘మీరెవరు? రుధిర ఏది?’’ ఉగ్రంగా చూస్తూ అడిగాడు.

 రుధిరతో ఆమె బెడ్‌రూం లోంచి బయటకి వచ్చిన కపీష్‌ని ఎగాదిగా చూసి రుధిరని నిలదీశాడు.
 ‘‘ఐతే నేను విన్నది నిజమేనన్న మాట. నువ్వు మళ్ళీ ఎవర్నో చేరదీసావన్నమాట.’’
 ‘‘మళ్ళీనా?’’ కపీష్ అదిరిపడ్డాడు.
 ‘‘మళ్ళీ, మళ్ళీ, మళ్ళీ. నువు నాలుగో మళ్ళీవి.’’
 ‘‘రుర్! ఇది నిజమా?’’ కపీష్ అడిగాడు.

 ‘‘మీ కబుర్లు తర్వాత. ముందు నేనేం మాట్లాడదలచుకొని వచ్చానో అది మాట్లాడనీండి. చూడు. చూడు. నిన్ను ఎంత కష్టపడి పెంచానో ఓసారి చూడు.’’
 ఓ ఆల్బం అందించాడు. రుధిర ఒకో ఫొటోని చూడసాగింది. అన్నీ ఆమెకి నవ్వు తెప్పించాయి.
 ఆమె తండ్రి మెడ మీద కూర్చుని కాళ్ళని భుజాల మీంచి ముందు ఛాతీ మీదకి వేసింది. వీపు వైపు నుంచి తీసిన ఫొటోలో ఆయన టీ షర్ట్ ధారగా కిందకి తడిసి ఉంది.

 రెండో ఫొటోలో సోఫాలో కూర్చుని దినపత్రిక చదువుకునే తండ్రి జుట్టుని వెనక నించి పీకుతోంది.
 మూడో ఫొటోలో రెండేళ్ళ రుధిరని తండ్రి ఎత్తుకున్నాడు. అతని కుడి అరచేతిలో పసుపు పచ్చ రంగులో ఆమె వాంతి ఉంది.
 నాలుగో ఫొటోలో నాలుగేళ్ళ రుధిర బూజు కర్రతో కొడుతూంటే తండ్రి మంచం మీంచి నేల మీదకి దొర్లిపోయాడు.
 ఐదేళ్ళ రుధిర ఒంటి మీది బట్టల నిండా బురద. హాల్లో ఆమె నడిచిన మేర నేల మీద బురద పాదాల గుర్తులు కనిపిస్తున్నాయి.
 ఆరేళ్ళ రుధిర నిద్రపోతున్న తండ్రి వీపు మీద స్కెచ్‌పెన్‌తో పిచ్చిపిచ్చి గీతలు గీసింది.

 ఏడేళ్ళ రుధిర చక్కటి పెయింట్ వేసిన గోడంతా క్రేయాన్స్‌తో ఆల్ఫాబెట్‌ని, అంకెలని రాసి పాడుచేసింది.
 ‘‘ఇంత కష్టపడి నిన్ను పెంచాం. నా మాట ఏదీ నువ్వు వినలేదు. హాస్టల్‌లో చేరి చదవమంటే చేరకుండా ఇంట్లో చదివి డిమ్కీలు కొట్టావు. కుంగ్‌ఫు నేర్చుకోమంటే కరాటే నేర్చుకున్నావు. దొంగతనాలకి మర్డర్స్ కలపమంటే కలపనన్నావు. ఓ చిన్న మార్పు నీ జీవితాన్నే సుఖమయం చేసేస్తుందని సెక్స్ మార్పిడి ఒద్దంటే వినకుండా చేసుకున్నావు’’
 ‘‘వాట్! నిజమా?’’ కపీష్ అరిచాడు.

 ‘‘అవును. చూడు. సెక్స్ మార్పిడికి హాస్పిటల్‌లోకి వెళ్ళే ముందు తీసిన ఈ ఫొటో రుధిర్‌ది. నా బంగారు కొండా!’’ ఓ పంతొమ్మిదేళ్ళ యువకుడి ఫొటోని ముద్దు పెట్టుకుని చూపించి చెప్పాడా గళ్ళ లుంగీ.
 ‘‘కూతుర్ని అయినంత మాత్రాన కొడుకుగా విన్న మాటలు మర్చిపోయాననుకున్నావా? నువ్వేగా పదేపదే పెళ్ళయ్యే దాకానే కొడుకు కొడుకు. పెళ్ళయ్యాక కూడా కూతురు కూతురే అని అంటూండేవాడివి’’ రుధిర చెప్పింది.
 కపీష్ తన తలని గోడకేసి బాదుకోసాగాడు. సిమెంట్ పెచ్చులు రాలి పడటంతో రుధిర తండ్రి అతన్ని ఆపబోయాడు.
 
 (ముగ్గురు మిత్రులు ఏ మోసంతో  డబ్బు సంపాదించారు?)
 

మరిన్ని వార్తలు